పొరపాటున పాక్ సరిహద్దుల్లోకి.... 10 ఏళ్ల తరువాత భారత్‌కు...

ABN , First Publish Date - 2021-01-06T16:32:05+05:30 IST

పదేళ్ల పాటు పాక్ జైలులో బంధీగా ఉన్న పున్వాసీలాల్ ఎట్టకేలకు జైలు...

పొరపాటున పాక్ సరిహద్దుల్లోకి.... 10 ఏళ్ల తరువాత భారత్‌కు...

న్యూఢిల్లీ: పదేళ్ల పాటు పాక్ జైలులో బంధీగా ఉన్న పున్వాసీలాల్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలై తన ఇంటికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన పున్వాసీలాల్ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పున్వాసీలాల్ ప్రస్తుతం మానసికంగా బలహీనంగా ఉన్నాడు. పదేళ్ల క్రితం అతను రాజస్థాన్ సరిహద్దుల నుంచి పొరపాటున పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. దీంతో పాక్ సైన్యం అతనిని అరెస్టు చేసి, పదేళ్ల పాటు లాహోల్ జైలులో ఉంచింది. పున్వాసీలాల్ పాక్‌లోకి అనధికారంగా ప్రవేశించారని కేసు నమోదు చేశారు.


పున్వాసీలాల్‌ను వెనక్కి రప్పించే ప్రక్రియను భారత్ ఐదేళ్ల క్రితమే ప్రారంభించింది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, పున్వాసీలాల్ తన ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలో అతని సోదరి, భార్య తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పున్వాసీలాల్ సోదరి కిరణ్ మాట్లాడుతూ తన సోదరుడు 10 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సోదరుణ్ణి భారత్ తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఈ నేపధ్యంలో పున్వాసీలాల్‌ను విడుదల చేసిందని, దీంతో గత ఏడాది నవంబరులో అటారీ బార్డర్ చేరుకున్నాడని, అప్పటి నుంచి బీఎస్ఎస్ రక్షణలో ఉన్నాడని తెలిపారు. తరువాత మిర్జాపూర్ పోలీసులు ఈ విషయాన్ని అతని సోదరికి తెలియజేసి, అతనిని కలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తరువాత పున్వాసీలాల్‌ తన ఇంటికి చేరుకున్నాడు.

Updated Date - 2021-01-06T16:32:05+05:30 IST