మీడియా ముందు ఏడ్చేసిన బీజేపీ బహిష్కృత మంత్రి

ABN , First Publish Date - 2022-01-17T20:19:48+05:30 IST

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రివర్గం నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ..

మీడియా ముందు ఏడ్చేసిన బీజేపీ బహిష్కృత మంత్రి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రివర్గం నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన మంత్రి హరక్ సింగ్ రావత్ మీడియా ముందు కంటతడి పెట్టారు. ఇక నుంచి తాను కాంగ్రెస్ తరఫున పనిచేస్తానని, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సామాన్య ప్రజానీకం సమస్యలను బీజేపీ ఎప్పుడూ పట్టించుకున్న పాపన పోలేదని, పార్టీ గురించి, పార్టీ అనుసరించే విధానం గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి ఆదివారంనాడు హరక్ సింగ్ రావత్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ కోర్ కమిటీ సమావేశంలో రావత్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి, పార్టీ జాతీయ అధఅయక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌషిక్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్లహ్లాద్ జోషి, ఎన్నికల కో-ఇన్‌చార్జి ఆర్.పి.సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రావత్‌ను సమావేశానికి పిలిచినప్పటికీ ఆయన ఆయన పాల్గొనలేదు. తనకు, తన కోడలుకు అనుకృతి గుసాయ్‌కి టిక్కెట్లు ఇవ్వాలని ఆయన చేసిన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు.


కాగా, తనకు, తన కోడలికి, మరో మద్దతుదారుకు టిక్కెట్ ఇవ్వాలని రావత్ పదేపదే పార్టీపై ఒత్తిడి తెచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సైతం ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులకు పార్టీ టిక్కెట్లపై రావత్ ఒత్తిడి తెచ్చారని, ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒక టిక్కెట్టు మాత్రమే కేటాయించాలన్నది పార్టీ విధానమని చెప్పారు. ఐదేళ్ల క్రితం రావత్ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తిరిగి ఆయన కాంగ్రెస్‌కు వెళ్తారనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. తరచు పార్టీలు మారుస్తుంటారనే పేరు ఆయనకు ఉంది. కాగా, 70 సీట్ల ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2022-01-17T20:19:48+05:30 IST