గుహల పర్యాటకానికి ఉత్తరాఖండ్ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-28T23:24:16+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్, గంగోలిహాత్ ప్రాంతంలో

గుహల పర్యాటకానికి ఉత్తరాఖండ్ ఏర్పాట్లు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్, గంగోలిహాత్ ప్రాంతంలో కేవ్ టూరిజం సర్క్యూట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌ స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో భూగర్భంలో తొమ్మిది గుహలను సెప్టెంబరులో గుర్తించారు. నవంబరులో జియోట్యాగింగ్ చేసిన తర్వాత వేల సంవత్సరాలనాటి ఈ గుహల వివరాలు తెలుస్తాయి. 


ఉత్తరాఖండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ ఎంపీఎస్ బిష్త్ మీడియాతో మాట్లాడుతూ, గంగోలిహాత్ ప్రాంతంలో గుర్తించిన గుహలు వేల సంవత్సరాలనాటివని తెలిపారు. నవంబరులో ఈ ప్రాంతం జియోట్యాగింగ్ జరుగుతుందని, ఆ తర్వాత ఈ గుహలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ గుహలు బహుళ అంచెలు కలవని తెలిపారు. దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహల్లో గదుల వంటి విభాగాలు ఉన్నట్లు తెలిపారు. ఇవి సహజ వారసత్వ ప్రదేశాలని, వీటిని పరిరక్షిస్తామని, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిస్తామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. స్లొవేనియా దేశం కేవ్ టూరిజం ద్వారా దాదాపు 30 శాతం ఆదాయం పొందుతోందని చెప్పారు. మనకు కూడా దీనివల్ల మంచి ఆదాయం వస్తుందన్నారు. 


కర్‌స్ట్ ల్యాండ్‌స్కేప్‌లో భాగంగా ఈ గుహలను ట్యాగ్ చేశారు. భూమికి అడుగు పొరల్లోని శిలలు క్షీణించడం వల్ల బిలాలు, ప్రవాహాలు, గుహలు వంటివి ఏర్పడతాయి. వీటినే కర్‌స్ట్ ల్యాండ్‌స్కేప్ అంటారు. పితోరగఢ్ పర్యాటకాధికారి అమిత్ కుమార్ మాట్లాడుతూ, భూ మండలంలో అత్యంత విలక్షణమైన, ముఖ్యమైన, అరుదైన పర్యావరణ వ్యవస్థగా కర్‌స్ట్ ల్యాండ్‌స్కేప్‌ను పరిగణిస్తారని చెప్పారు. ఇది భూమి క్రింద, పైన పర్యావరణ వైవిద్ధ్యానికి దోహదపడుతుందన్నారు. 


పితోరగఢ్‌లో పాతాళ భువనేశ్వరుని దేవాలయం భూగర్భంలో ఉంది. ఇది కూడా గుహ. ఈ దేవాలయానికి పర్యాటకులు, యాత్రికులు కూడా వస్తూ ఉంటారు. 


Updated Date - 2021-10-28T23:24:16+05:30 IST