పాదయాత్రకు ఉత్తరాంధ్ర సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2022-09-11T08:40:49+05:30 IST

అమరావతి నుంచి అరసవిల్లి వరకూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు ఉత్తరాంధ్ర నుంచి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె, టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మ ప్రకటించారు.

పాదయాత్రకు ఉత్తరాంధ్ర సంపూర్ణ మద్దతు

  • 3 రాజధానుల పేరుతో డ్రామా
  • పేదలకు 3 రాజధానుల్లోనూస్థలాలు ఇవ్వొచ్చుగా?
  • అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ నాశనానికే ఈ కుట్ర: కావలి గ్రీష్మ

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి అరసవిల్లి వరకూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు ఉత్తరాంధ్ర నుంచి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె, టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మ ప్రకటించారు. రైతులను వేధించడానికే మంత్రులు దూషణలు మొదలు పెట్టారని, ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. శనివారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడు రాజధానుల పేరుతో వైసీపీ డ్రామా చేస్తోంది. ఏ రాజధానీ లేకుండా మూడున్నరేళ్లు గడిపేశారు. ఇంకా మూడు రాజధానులంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ ఈ డ్రామాలకు తెరదించాలి. రైతుల పాదయాత్రకు మేం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అమరావతిలో తలపెట్టిన రాజధానిని పూర్తి చేయడమే టీడీపీ ప్రధాన కర్తవ్యం. అమరావతి రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉంది. అమరావతి, 13 జిల్లాలు అభివృద్ధి కావాలి. అమరావతిలో రాజధాని మొత్తం రాష్ట్రం సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.


‘‘అమరావతి ప్రాంతం స్మశానమని, ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని వైసీపీ నేతలు రకరకాల ప్రచారాలు చేశారు. ఆ ప్రాంతంలో రైతులు ఇచ్చిన భూములు అమ్మాలని తర్వాత ప్రయత్నం చేశారు. అది స్మశానమైతే అక్కడి భూములు ఎలా అమ్ముతారు? రాష్ట్రంలోని పేదలు అందరికీ అక్కడ స్థలాలు ఇస్తామని కొత్త ప్రచారం మొదలుపెట్టారు. మీకు మూడు రాజధానులు కట్టాలన్న కోరిక ఉంటే రాష్ట్రంలో పేదలందరికీ అమరావతిలో ఎందుకు స్థలాలు ఇస్తున్నారు? మూడు రాజధానుల్లో ఇవ్వవచ్చు కదా? అమరావతి కోసం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను నాశనం చేయడానికే వైసీపీ ప్రభుత్వం రోజుకో కొత్త ప్రతిపాదనను అక్కడి భూములపై తెస్తోంది. భూములు ఇచ్చిన వారిలో వేల సంఖ్యలో దళిత రైతులు ఉన్నారు. వారిని కూడా కొట్టి, హింసించి, కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తోంది. తమకు న్యాయం చేయాలని రైతులు ఉద్యమిస్తుంటే వారిని పెయిడ్‌ ఆర్టిస్టులని వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ స్ర్కిప్టు చదువుతున్న పెయిడ్‌ ఆర్టిస్టులు ఎవరో రాష్ట్రం మొత్తం చూస్తోంది’’ అని గ్రీష్మ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-11T08:40:49+05:30 IST