ఉత్తుత్తి వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 104 సంచార వాహనాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరే వైద్యం అందించాలన్నది 104 లక్ష్యం. అయితే 104 ద్వారా వైద్యసేవలు అందించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలనే ఉద్దేశంతో తప్పుడు లెక్కలు రాస్తున్నారని సమాచారం. వైద్య సేవలు నిర్వహించకపోయినా నిర్వహించినట్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 104 వైద్య సేవలపై ఆరోగ్య ట్రస్ట్‌ రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడినట్టు సమాచారం.

ఉత్తుత్తి వైద్యసేవలు

తక్కువ మందికి వైద్యసేవలు అందించినా..

ఆనలైనలో ఎక్కువగా నమోదు చేయాలని ఆపరేటర్లపై ఒత్తిడి 

ఆరోగ్యశ్రీ ఫీడ్‌ బ్యాక్‌లో బయటపడుతున్న బాగోతం 

జిల్లాలో 104 వైద్యసేవల పరిస్థితి ఇదీ 

కడప, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 104 సంచార వాహనాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరే వైద్యం అందించాలన్నది 104 లక్ష్యం. అయితే 104 ద్వారా వైద్యసేవలు అందించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలనే ఉద్దేశంతో తప్పుడు లెక్కలు రాస్తున్నారని సమాచారం. వైద్య సేవలు నిర్వహించకపోయినా నిర్వహించినట్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 104 వైద్య సేవలపై ఆరోగ్య ట్రస్ట్‌ రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడినట్టు సమాచారం. 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించేందుకు పదేళ్ల క్రితం 104 వైద్య సేవలను ప్రారంభించారు. ఒక్కో వాహనంలో డాక్టర్‌, ఏఎనఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌తో పాటు ఇతర సిబ్బంది మొత్తం ఏడుగురు ఉంటారు. జిల్లాలో కూడా మండలానికో 104 వాహనం ఉంది. రోజూ ఓ గ్రామానికి వెళుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు బీపీ, షుగర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొందరు మంచాలకే పరిమితమై ఉంటారు. వీరందరికీ 104 ద్వారా వైద్య సేవలు అందిస్తుంటారు. అవసరమైన మందులు ఇస్తారు.

వైద్యం చేసినట్టుగా..

104 వాహనాల్లో గతంలో ఏడుగురు సిబ్బంది ఉండేవారు. అరవింద ఫార్మాకు అప్పగించిన తరువాత ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. డాక్టర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఏఎనఎం విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు కనీసం 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని 104 సిబ్బందికి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో అంతమంది చూపించుకోవడానికి రావడం లేదని సమాచారం. 30 మంది వచ్చినప్పటికీ టార్గెట్‌ కోసం 60 మందిగా నమోదు చేయాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డాక్టర్లు హోం విజిట్‌ చేయాల్సి ఉంది. మంచానికి పరిమితమైన వారికి పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన వారికి ఈసీజీ తీయాలి. హోం విజిట్‌, ఈసీజీలు కూడా ఎక్కువ నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇలా బయటపడుతోంది

104 ద్వారా వైద్య సేవలు పొందిన వారి వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నమోదు చేస్తారు. ఆ వివరాలు ఆరోగ్యశ్రీట్రస్ట్‌కి చేరతాయి. ఫీడ్‌ బ్యాక్‌ కోసం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సిబ్బంది వైద్య సేవలు పొందిన వారికి ఫోన చేస్తుంటారు. ఓ కార్డులో ఐదుగురు ఉంటే ఒకరు చూపించుకున్నా సరే అందరి పేర్లు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫీడ్‌ బ్యాక్‌ కోసం ఫోన చేసినప్పుడు తాము వైద్య సేవలు చేయించుకోవడం లేదని చెబుతుండడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 

అయితే ఈ తప్పును ఉన్నతాధికారులు డేటా ఎంట్రీ ఆపరేటర్లపై నెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని డేటా ఎంట్రీ సిబ్బంది ఎక్కువగా నమోదు చేయడానికి ఒప్పుకోకపోతే వారిపై కక్ష కడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఇద్దరు ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్‌ కోసమే డబుల్‌ ఎంట్రీ నమోదు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.


వైద్య సేవలు విస్తృత పరుస్తున్నాం 

- సుబ్బరాయుడు, జిల్లా మేనేజర్‌, 104 వాహనాలు

104 వాహనాల ద్వారా పల్లెల్లో వైద్య సేవలను విస్తరిస్తున్నాం. ఎవరికీ టార్గెట్‌ పెట్టలేదు. వీలైనంత వరకు వైద్య సేవలను విస్తృత పరచాలని చెబుతున్నాం. ఒక్కో గ్రామంలో జనం తక్కువ వస్తే మధ్యాహ్నం తరువాత ఇంకో గ్రామానికి వెళ్లమని ఆదేశాలు ఇచ్చాం. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తప్పులు నమోదు చేయడం లేదు.


Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST