ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీల సుస్తీ

ABN , First Publish Date - 2021-06-14T05:22:42+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి కోరలు చాస్తున్న పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పుత్రుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులు కరువయ్యారు. కొవిడ్‌ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు అందించి, కాపాడేందుకు ఉండాల్సిన డాక్టర్ల, స్టాఫ్‌నర్సుల పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీల సుస్తీ

సంగారెడ్డి జిల్లాలో వైద్యులు, స్టాఫ్‌నర్సులు కరువు

275 వైద్యుల పోస్టుల్లో 163 ఖాళీలు

216 స్టాఫ్‌నర్సుల్లో 136 ఖాళీలు


పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 49 డాక్టర్ల పోస్టుల్లో 29 ఖాళీగానే ఉన్నాయి. ఉన్న ఒక్క సివిల్‌ సర్జన్‌ పోస్టు, 10 డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులను అస్సలు భర్తీ చేయలేదు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి. ఎక్కడా పూర్తిస్థాయిలో వైద్యులు, స్టాఫ్‌నర్సులు లేరు. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు   అన్ని ఏరియా ఆస్పత్రుల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా  ఆయా ఆస్పత్రుల్లోని అవుట్‌ పేషెంట్లు, సాధారణ వార్డు, కొవిడ్‌ వార్డుల్లోని పేషెంట్లకు  వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 13 : కొవిడ్‌ మహమ్మారి కోరలు చాస్తున్న పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పుత్రుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులు కరువయ్యారు. కొవిడ్‌ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు అందించి, కాపాడేందుకు ఉండాల్సిన డాక్టర్ల, స్టాఫ్‌నర్సుల పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అటకెక్కాయి. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌), పటాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జోగిపేట, సదాశివపేట ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు చెందిన 275 డాక్టర్ల పోస్టులు మంజూరై ఉన్నాయి. వీటిలో 163 పోస్టులు కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాయి. 97 పోస్టులు రెగ్యులర్‌ పద్ధతిన భర్తీ కాగా 15 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన నియామకమయ్యాయి. 


సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో 55 డాక్టర్ల పోస్టులుండగా, 27 పోస్టులనే భర్తీ చేశారు. వీటిలో కూడా 22 పోస్టుల్లో రెగ్యులర్‌ డాక్టర్లుండగా, 5 పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిన నియామకమైన వారు ఉన్నారు. మిగిలిన 28 డాక్టర్ల పోస్టులు కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ల వారీగా పరిశీలిస్తే 19 సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులుండగా, నలుగురు మాత్రమే ఉన్నారు. 15 ఖాళీగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. 26 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల్లో 16 మాత్రమే భర్తీ చేశారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 8 ఉండగా, ఒక్క పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఇక సంగారెడ్డిలోని ఎంపీహెచ్‌లో 37 వైద్యుల పోస్టుల్లో 13 మంది మాత్రమే ఉన్నారు. సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ 9 పోస్టుల్లో ఒక్కటంటే ఒక్క పోస్టును కూడా కొన్నేళ్లుగా భర్తీ చేయలేదు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ 10 పోస్టులదీ ఇదే పరిస్థితి. కాగా 18 మంది ఉండాల్సిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల్లోనూ 13 మంది మాత్రమే ఉన్నారు.


మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 

పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో వివిధ కేటగిరీలకు చెందిన 49 డాక్టర్ల పోస్టుల్లో 29 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సివిల్‌    సర్జన్‌ (ఆర్‌ఎంవో) ఒక్క పోస్టు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ 10 పోస్టులను అస్సలు భర్తీ చేయలేదు. అలాగే జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలోని 52 డాక్టర్ల పోస్టులకు గానూ 30 ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా సివిల్‌ సర్జన్‌ (ఆర్‌ఎంవో) ఒక్క పోస్టు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ 10 పోస్టులు చాలాకాలంగా ఖాళీగానే ఉన్నాయి. నారాయణఖేడ్‌ ఏరియా ఆస్పత్రిలోని 32 డాక్టర్ల పోస్టులకుగానూ, 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడైతే సివిల్‌ సర్జన్‌ 6 పోస్టులు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ (ఆర్‌ఎంవో) పోస్టు ఒకటి, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ నాలుగు పోస్టులు, ఖాళీగానే ఉన్నాయి. ఈ ఆస్పత్రిలోని 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 20 పోస్టుల్లో ఆరుగురితో, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఒక్కరితో నిర్వహిస్తున్నారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిలోనూ 34 డాక్టర్ల పోస్టులకుగానూ 20 పోస్టులు, 8 డిప్యూటీ సివిల్‌ సర్జన్లకు ఏడింటిన ప్రభుత్వం భర్తీ చేయలేదు. 18 మంది ఉండాల్సిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లలో 10 మంది, ఒక డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌తో ఈ ఆస్పత్రి నిర్వహణ జరుగుతున్నది. ఇక సదాశివపేట కమ్యూనిటీ ఆస్పత్రిలోని 16 డాక్టర్ల పోస్టులకుగానూ 9 ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు నాలుగింటికి నాలుగు ఖాళీలే. 11 మంది ఉండాల్సిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లో ఆరుగురు, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఒకరితో ఈ ఆస్పత్రి నిర్వహణ జరుగుతున్నది. 


నర్సుల పోస్టులదీ అదే తీరు

సంగారెడ్డి జిల్లాలోని ఆస్పత్రుల్లో డాక్టర్ల పోస్టులు సగానికి పైగా ఖాళీలున్నట్టే నర్సుల పోస్టులు అలాగే ఉన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు జిల్లాలోని ఏడు ఆస్పత్రుల్లో 216 స్టాఫ్‌నర్సుల పోస్టులుండగా 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే గ్రేడ్‌వన్‌ నర్సింగ్‌ స్టాఫ్‌, మూడు పోస్టుల్లో ఒకటి ఖాళీయే. హెడ్‌ నర్స్‌పోస్టులు 42 ఉండగా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న 33 ఏఎన్‌ఎం పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా స్టాఫ్‌ నర్సుల్లో సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 85 పోస్టులుండగా 43 ఖాళీయే. మాతా శిశుసంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లోనైతే ఉన్న 14 స్టాఫ్‌నర్సుల పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు సేవలు ఎలా అందుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే అరకొరగా ఉన్న స్టాఫ్‌ నర్సుల్లో కొందరిని ఎంసీహెచ్‌కు డిప్యూటేషన్‌ పంపించి, సేవలందిస్తుండడం గమనార్హం.


Updated Date - 2021-06-14T05:22:42+05:30 IST