ఒక్క రోజులో 2 లక్షల మందికి టీకా

ABN , First Publish Date - 2021-06-13T08:09:01+05:30 IST

రాష్ట్రంలో టీకా పంపిణీ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 2,09,374 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

ఒక్క రోజులో 2 లక్షల మందికి టీకా

  • 1.20 లక్షల టెస్టులు.. 1,771 కేసులు
  • వైర్‌సతో మరో 13 మంది మృతి..

హైదరాబాద్‌/మహాముత్తారం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీకా పంపిణీ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 2,09,374 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 654 ప్రభుత్వ కేంద్రాల్లో 1,45,592 మంది, ప్రైవేటులోని 47 కేంద్రాల్లో 63,782 మంది టీకా తీసుకున్నారు. వీరిలో 1,96,887 మంది తొలి డోసు, 12,487 మంది రెండో డోసు వేయించుకున్నారు. ఇప్పటిదాక 61,13,416 మంది మొదటి, 14,95,199 మంది రెండో డోసు పొందారు.


కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,20,525 టెస్టులు చేయగా, 1,771 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 13 మంది మృతిచెందారు. మొత్తం కేసులు 6,02,089కు, మరణాలు 3,469కు పెరిగాయి. 2,384 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీల సంఖ్య 5,76,487కు చేరింది. ప్రస్తుతం 22,133 క్రియాశీల కేసులున్నాయి.


అడవిలో 13 మంది ఐసొలేషన్‌  

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన 13 మంది కరోనా బాధితులు శనివారం అడవి బాట పట్టారు. ఇరుకైన ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉండలేక, కుటుంబసభ్యులకు ఇబ్బంది కలగొద్దని వనానికి తరలివెళ్లారు. గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని వాగు ఒడ్డున గుడారం ఏర్పాటు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు పట్టుకొని అడవికి వెళ్లారు. గ్రామంలో రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 32 మంది వైరస్‌ బారిన పడ్డారు. హోం ఐసొలేషన్‌ సాధ్యం కాకపోడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అడవిలో ఉన్న కొవిడ్‌ బాధితులను ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-13T08:09:01+05:30 IST