దండం పెట్టి చెబుతున్నా టీకా వేయించుకోండి

ABN , First Publish Date - 2021-04-20T05:39:47+05:30 IST

‘‘దండం పెట్టి చెబుతున్నా ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోండి’’ అని మంత్రి హరీశ్‌రావు సూచించారు.

దండం పెట్టి చెబుతున్నా టీకా వేయించుకోండి
రాజగోపాలపేట పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన కరోనా కేంద్రం వద్ద ప్రజల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి

 బీరప్ప అనుగ్రహం ప్రజలపై ఉండాలి

 ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


నంగునూరు, ఏప్రిల్‌ 19: ‘‘దండం పెట్టి చెబుతున్నా ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోండి’’ అని మంత్రి హరీశ్‌రావు సూచించారు. బీరప్ప దేవుడి అనుగ్రహంతో కరోనా తగ్గి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి అన్నారు. సోమవారం నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో  కురుమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీరప్ప, కామరతి కల్యాణోత్సవంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా తీవ్రంగా ఉన్నందున 45 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. నంగునూరు రాజగోపాల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చులేకుండా ఉచితంగా  టీకా వేస్తున్నామని చెప్పారు. కుర్మ సంఘం తరఫున ఎంపీటీసీ తిరుపతి మంత్రిని సన్మానించారు. ఆయనవెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కోల రమేశ్‌ గౌడ్‌, సర్పంచ్‌ కనకవ్వ, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.


ఎక్కువ సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌కు ఆదేశం


నంగునూరు మండలం రాజగోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. టీకా కోసం వందల సంఖ్యలో ప్రజలు రావడంతో వారిని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీకా వేసుకోవడానికి సమయం పడుతుందని ప్రజలు మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్‌కు పేర్ల నమోదు చాలా సమయం పడుతుందన్నారు. స్పందించిన మంత్రి హరీశ్‌రావు.. పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో టీకా కేంద్రాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. కరోనా టీకా పంపిణీ కేంద్రాల్లో ఎక్కువ సిబ్బందిని నియమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని ఫోన్‌ ద్వారా మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇక్కడి కరోనా టీకా కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ బాగుందని తక్కువ స్థాయిలో సిబ్బంది ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎంపీడీవోలు, ఎంపీఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలకు టీకా కేంద్రాల వద్ద డ్యూటీ వేయాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ రోజు వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. 


 

Updated Date - 2021-04-20T05:39:47+05:30 IST