పిల్లలకు కోవిడ్ వాక్సిన్ అశాస్త్రీయం: ఎయిమ్స్ డాక్టర్

ABN , First Publish Date - 2021-12-27T00:17:11+05:30 IST

పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎయిమ్స్ డాక్టర్ సంజయ్ కె రాయ్..

పిల్లలకు కోవిడ్ వాక్సిన్ అశాస్త్రీయం: ఎయిమ్స్ డాక్టర్

న్యూఢిల్లీ: పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎయిమ్స్ డాక్టర్ సంజయ్ కె రాయ్ విభేదించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం 'అశాస్త్రీయం' అని అన్నారు. ఇందువల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు చేకూరవని చెప్పారు. ఎయిమ్స్‌లో సీనియర్ ఎపిడెమియోలజిస్ట్‌గా డాక్టర్ రాయ్‌ ఉన్నారు. పెద్దలు, పిల్లలకు సంబంధించి కొవాగ్జిన్ ట్రయల్స్‌‌లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కూడా ఆయన ఉన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు.. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పటికే మొదలుపెట్టిన ఆయా దేశాల డాటాను విశ్లేషించాల్సి ఉందని ఆయన అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం రాత్రి దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిల్లలందరికీ జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి, క్రిస్మస్‌ పండుగ కలిసి వచ్చిన పవిత్రమైన రోజున ఈ కీలక ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఇందువల్ల స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆందోళనలకు కూడా ఉపశమనం కలుగుతుందన్నారు. స్కూళ్లలో బోధన యథాపూర్వ పరిస్థితికి రావడానికి ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు.


డాక్టర్ రాయ్ ఏమన్నారంటే...

కాగా, బూస్టర్ షాట్లు తీసుకున్న తర్వాత కూడా కొన్ని దేశాల్లో ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారు ఉన్నారని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు. యూకేలో రోజుకు 50,000 ఇన్‌ఫెక్షన్లు రిపోర్ట్ అయ్యాయని చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాక్సినేషన్ నిరోధించలేదని నిరూపణ అవుతోందన్నారు. అయితే తీవ్రత, మరణాలను సమర్ధవంతంగా వ్యాక్సిన్లు నిరోధించినట్టు చెప్పారు. వ్యాక్సినేషన్ ద్వారా 80 నుంచి 90 శాతం ఇలాంటి మరణాలను నిరోధించగలిగామని అన్నారు. ఇమ్యునైజేషన్ తర్వాత కూడా తీవ్రమైన ప్రతికూల ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయని, వయోజనుల్లో రిస్క్ ఎంత, ప్రయోజనం ఎంత అనేది విశ్లేషిస్తే ఉపయోగం ఉంటుందని చెప్పారు.


పిల్లల విషయానికి వస్తే, పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పిల్లల్లో ఇన్‌ఫెక్షన్ తీవ్రత చాలా స్పల్పమని, ప్రతి రెండు మిలియన్ల జనాభాకు రెండు మరణాలు చోటుచేసుకున్నాయని డాక్టర్ రాయ్ చెప్పారు. ''పిల్లల విషయంలో రిస్క్ అండ్ బెనిఫిట్‌ విశ్లేషణ చేస్తే, ప్రయోజనాల కంటే రిస్క్ ఎక్కువని అందుబాటులో ఉన్న గణాంకాలను (డాటా) బట్టి చెప్పవచ్చు'' అని ఆయన విశ్లేషించారు. నాలుగైదు నెలల క్రితమే అమెరికా సహా పలు దేశాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారని, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేముందు ఆయా దేశాల డాటాను విశ్లేషించాల్సి ఉంటుందని డాక్టర్ రాయ్ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-27T00:17:11+05:30 IST