Abn logo
Sep 19 2021 @ 02:58AM

వ్యాక్సినేషన్‌ @ 80 కోట్లు

  • గత పది రోజుల్లోనే కోటి డోసుల పంపిణీ
  • దేశంలో అందుబాటులోకి మరిన్ని టీకాలు
  • నెలకు 25 కోట్ల డోసులకు నిర్ణయం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: దేశంలో కరోనా టీకా పంపిణీ 80 కోట్లకు చేరింది. ఇందులో గత 10 రోజుల్లోనే 10 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఏకంగా 2.5 కోట్ల డోసులను వేయగా.. అంతకుముందు రోజుల్లోనూ గరిష్ఠ సంఖ్యలో టీకాలిచ్చారు. 60 కోట్ల టీకాల నుంచి 70 కోట్లకు చేరేందుకు 13 రోజులు పట్టగా, అంతకంటే తక్కువ వ్యవధిలోనే 80 కోట్ల సంఖ్యను అందుకోవడం విశేషం. కాగా.. దేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. అప్పటినుంచి చూస్తే.. 8 నెలల్లో సగటున 80 కోట్ల టీకాలు పంపిణీ జరిగాయి. మరోవైపు రాష్ట్రాలు/యూటీలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 78 కోట్ల టీకాలను ఉచితంగా అందజేసింది. మరో 33 లక్షల టీకాలు త్వరలో ఇవ్వనుంది. రాష్ట్రాల వద్ద 6 కోట్లపైగా డోసులు నిల్వ ఉన్నాయి.


ఈ ఏడాది చివరికి 135 కోట్ల మందికి కనీసం ఒక డోసు అయినా టీకా ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందుకుతగినట్లు చర్యలు చేపడుతోంది. థర్డ్‌ వేవ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని మున్ముందు కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులోభాగంగా నెలకు 25 కోట్ల టీకాల కొనుగోలు ప్రణాళికల్లో ఉంది. ఈ నెలలోనే 20 కోట్ల డోసుల కొవిషీల్డ్‌, 3.5 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకాలు అందనున్నాయి. కాగా, రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి  రాజీవ్‌ గౌబా శనివారం సమీక్ష నిర్వహించారు. వైద్య సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలని, ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దేశంలో శుక్రవారం 35,662 మంది వైరస్‌ నిర్ధారణ కాగా, 281 మంది మృతి చెందారు. ఇందులో 23 వేల కేసులు, 131 మరణాలు కేరళవే ఉన్నాయి.


ఇప్పటికైతే ‘బూస్టర్‌’ అనైతికం: పూనావాలా

మన దేశంలో ఇంకా చాలామందికి రెండో డోసే అందని వేళ.. ప్రపంచ దేశాల్లో తొలి డోసు పంపిణీనే పూర్తి కాని ఈ సమయంలో బూస్టర్‌ డోసు ప్రణాళికల గురించి చర్చించడం అనైతికమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. ఇప్పటివరకైతే బూస్టర్‌ డోసు అవసరమని చెప్పే పరిస్థితి రాలేదని, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) కూడా ఈ మేరకు సిఫార్సు చేయలేదని పేర్కొన్నారు. అక్టోబరు నాటికి నెలకు 2 కోట్ల టీకాల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోగలమని చెప్పారు.