వచ్చే నెల 1 నుంచి వ్యాక్సినేషన్‌ వేగవంతం

ABN , First Publish Date - 2021-07-24T06:53:26+05:30 IST

జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు సూచించింది.

వచ్చే నెల 1 నుంచి వ్యాక్సినేషన్‌ వేగవంతం

 ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ అందుబాటులోకి వ్యాక్సిన్‌

జిల్లాకు సరఫరా అయ్యే డోసుల సంఖ్య పెంపు

నల్లగొండ అర్బన్‌, జూలై 23: జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మరిన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా జనరల్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఆగస్టు నుంచి ఆరోగ్య ఉపకేంద్రాల్లో సైతం వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 252 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యాక్సిన్‌ మరింత తొందరగా అందే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాకు ప్రతిరోజు 5వేల డోస్‌ల వ్యాక్సిన్‌ మాత్రమే సరఫరా అవుతోంది. ఈ మొత్తాన్ని 15వేలకు పెంచేలా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్న మేర వ్యాక్సిన్‌ సరఫరా అయితే ఉపకేంద్రాలతోపాటు గ్రా మాల్లో సైతం శిబిరాలు నిర్వహించి వ్యాక్సిన్‌ వేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,27,385 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇందులో మొదటి డోస్‌ 2,65,503 మంది వేసుకున్నారు. రెండో డోస్‌ 59,882 మందికి వేశారు. మొదటి డోస్‌ 30 శాతం పూర్తి కాగా, రెండోడోస్‌ 10శాతంలోపు మాత్రమే పూర్తయింది. నల్లగొండ జిల్లాలో 18ఏళ్లనుంచి ఆపై వయస్సు ఉన్న వారు 10,80,660 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ విధంగానే వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగితే మొదటి డోస్‌ పూర్తయ్యే సరికి ఇంకా ఆరు నెలల పైచిలుకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎదరుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న గ్రామాలు, వాటి పరిసర గ్రామాల్లో ప్రజలు మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఆరోగ్యకేంద్రాలు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు, వయస్సు పైబడిన వారు వ్యాక్సిన్‌ కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, రెండు డోస్‌లు ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి, వ్యాక్సిన్‌ వేయాలని ప్రజలు కోరుతున్నారు. 




ఆగస్టు నుంచి వ్యాక్సినేషన్‌ పెంచుతాం : డాక్టర్‌ అనిమళ్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్లగొండ

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చిన డోస్‌లను ఏ రోజుకు ఆ రోజు పంపిణీ చేస్తున్నాం. డోస్‌లు సరిపడా రాని కారణంగానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనుకున్నమేర చేయలేకపోతున్నాం. ఆగస్టు 1నుంచి డోస్‌ల సరఫరా పెరుగుతుంది. త్వరలోనే ఉపకేంద్రాల్లో, అవసరమైతే గ్రామాల్లో సైతం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తాం. వ్యాక్సిన్‌ సరఫరా డోస్‌లు అధికంగా వస్తే పెద్దఎత్తున వ్యాక్సిన్‌ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 

Updated Date - 2021-07-24T06:53:26+05:30 IST