టీకా పేరిట టోకరా..!

ABN , First Publish Date - 2021-06-25T05:48:56+05:30 IST

టీకా పేరిట టోకరా..!

టీకా పేరిట టోకరా..!

పీహెచ్‌సీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో అవినీతి దందా

ఒక డోస్‌ రూ.1,000కు విక్రయాలు

జిల్లాలోని 50 శాతం పీహెచ్‌సీల్లో ఇదే తంతు

మెడికల్‌ ఆఫీసర్లే కీలకం

జిల్లా ఉన్నతాధికారి కన్నుసన్నల్ల్లోనే యథేచ్ఛగా అమ్మకాలు

ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం స్పందించాలని డిమాండ్‌

ఇందుగలదు అందులేదని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతి కలదు. అవును.. చివరికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను కూడా వదలకుండా అక్రమంగా దోచుకుతింటున్నారు. పీహెచ్‌సీలే కేరాఫ్‌గా సాగుతున్న ఈ అవినీతి తంతులో మెడికల్‌ ఆఫీసర్లే  అన్నీ తామై నడిపిస్తుండగా, వైద్యశాఖ ఉన్నతాధికారులు వెనకుండి  చక్రం తిప్పుతున్నారు. 

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యాక్సిన్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఉచితంగా అందించే వ్యాక్సిన్‌ను డబ్బు చెల్లించి వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలోని చాలా పీహెచ్‌సీల్లో ఈ దందా సాగుతోంది. కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో మెడికల్‌ ఆఫీసర్లు వ్యాక్సిన్‌లో కొంతభాగాన్ని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు అమ్మేస్తున్నారు. మరికొంతమంది పీహెచ్‌సీకి సంబంధించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ (సీవీసీ) పోర్టల్‌ను ఇంటి వద్ద ఓపెన్‌ చేసి లబ్ధిదారుల్లా రిజిస్ట్రేషన్‌ అవుతున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే లబ్ధిదారుల దగ్గర నుంచి రూ.1,000 తీసుకుని వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. దీనివల్ల పీహెచ్‌సీ పరిధిలోని స్థానిక ప్రజలకు చెందాల్సిన వ్యాక్సిన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఇళ్ల వద్ద ఉన్నవారికి, పట్టణ ప్రజలకు చేరుతోంది. జిల్లాలోని చాలా పీహెచ్‌సీల్లో ఇదే పరిస్థితి.

మెడికల్‌ ఆఫీసర్ల దందా.. ఉన్నతాధికారుల అండ..

గుడివాడ డివిజన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. వ్యాక్సిన్‌ మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వ్యవహారం తొలుత ఒకటి, రెండు పీహెచ్‌సీలకే పరిమితమైంది. ఇప్పుడు జిల్లాలోని 50 శాతం పీహెచ్‌సీల్లో ఇదే వ్యాపారం జరుగుతోంది. ఇదంతా జిల్లా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ వ్యాపారంపై పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవట్లేదు. పైగా ఫిర్యాదులు బుట్టదాఖలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్‌ ఆఫీసర్లకు వైద్యాధికారులు అండదండలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధిక వ్యాక్సిన్‌ జిల్లాకు వస్తుంది. ఇందులో సగం వ్యాక్సిన్‌ ఇలా మెడికల్‌ ఆఫీసర్లు బయటకు తరలిస్తున్నారు. దీనిని కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు అమ్ముకుంటుండగా, మరికొంతమంది ఎవరికీ అనుమానం రాకుండా లబ్ధిదారులను ఇంటి వద్దకు పిలిపించుకుని వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇలా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. దీనిలో జిల్లా ఉన్నతాధికారులకు వాటాలు వెళ్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 

మామూళ్ల మత్తు

జిల్లాలో వ్యాక్సిన్‌ వ్యాపారంపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం ఉంది. కానీ, ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆదేశాలు రాకపోవడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. జి.కొండూరు పీహెచ్‌సీలో ప్రారంభమైన వ్యాక్సిన్‌ తరలింపు ప్రక్రియ గుడివాడ సమీపంలోని రుద్రపాక పీహెచ్‌సీలో మరింత విస్తరించింది. దీనికి ఆ పీహెచ్‌సీ పరిధిలో కొంతమంది సిబ్బంది సహకారం అందిస్తున్నారు. దీని వెనుక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. వారి కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సదరు పీహెచ్‌సీ నుంచి 2వేల నుంచి 3వేల డోస్‌లు బయటకు తరలిపోయినట్లు అంచనా.

సీవీసీని పరిశీలించాలి

రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల సీవీసీ పోర్టల్‌ను పరిశీలిస్తే తప్ప వ్యాక్సిన్‌ వ్యాపారం బయటపడదు. వ్యాక్సిన్‌ ఇంటికి ఎత్తుకెళ్లే మెడికల్‌ ఆఫీసర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పీహెచ్‌సీ నుంచి వ్యాక్సిన్‌ ఇంటికి తీసుకెళ్లాక, అదే పీహెచ్‌సీకి చెందిన సీవీసీని ఇంటి వద్ద ఓపెన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తున్నారు. దీనివల్ల వ్యాక్సిన్‌ ఎక్కడికి తీసుకెళ్లినా, ఎంత మొత్తానికి అమ్మినా వారికి సంబంధించిన పీహెచ్‌సీ సీవీసీలోనే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. కాబట్టి ఎవరికీ అనుమానం ఉండదు. ఈ స్కామ్‌ను బయటకు తీయాలంటే సీవీసీని పరిశీలించాలి. ఒక పీహెచ్‌సీ సీవీసీని ఓపెన్‌ చేసి ఎంతమంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేశారు, చిరునామాలు పరిశీలిస్తే బండారం బయటపడుతుంది. జిల్లాలోని చాలా పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లు విజయవాడ తీసుకొచ్చి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 50 శాతం పీహెచ్‌సీల్లో జరిగిన వ్యాక్సినేషన్‌లో సగం విజయవాడ అడ్రస్‌లే. ముఖ్యంగా గుడివాడ, దాని చుట్టుపక్కల  పీహెచ్‌సీల్లో ఇలాంటి దందా ఎక్కువగా నడుస్తోంది. దీనిపై ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం దృష్టిసారిస్తే తప్ప గుట్టురట్టు కాదు. 




Updated Date - 2021-06-25T05:48:56+05:30 IST