Jun 14 2021 @ 17:50PM

సీసీసీ ఆధ్వర్యంలో టీవీ ఆర్టిస్టులకు కరోనా వ్యాక్సిన్

కరోనా క్రైసిస్ ఛారిటి(సీసీసీ) ఆధ్వ‌ర్యంలో గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్‌కు సంబందించిన సినీ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. తాజాగా టీవీ ఆర్టిస్టులకు కూడా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం సోమవారం నుంచి జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో టీవీ ఆర్టిస్టులకు కూడా అందించేందుకు సీసీసీ ముందుకు వచ్చిన సందర్బంగా  ప్రముఖ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ‘‘సీసీసీ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు, ఆర్టిస్టులకు వాక్సిన్ వేసే కార్యక్రమం విజయవంతగా సాగుతుంది. ఇందులో భాగంగా టీవీ ఆర్టిస్టులకు కూడా ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం వర్తింప చేయాలనీ నేను అన్నయ్య చిరంజీవిగారిని అడిగినప్పుడు అయన వెంటనే ఓకే అన్నారు. ఈ రోజు నుండి టీవీ ఆర్టిస్ట్ అందరికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం. ఈ సందర్బంగా ఈ అవకాశం కల్పించిన అన్నయ్యకు అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు, సీసీసీ, అపోలో వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా అందరూ ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.