టీకా ‘లేని’ ఉత్సవ్‌!

ABN , First Publish Date - 2021-04-11T08:22:29+05:30 IST

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్‌.. సరిపడా వ్యాక్సిన్‌ డోసులు లేకుండానే రాష్ట్రంలో

టీకా ‘లేని’ ఉత్సవ్‌!

రాష్ట్రవ్యాప్తంగా డోసుల కొరత

అన్ని జిల్లాల్లో మొత్తం లక్షా 35 వేలు 

ఒక్కరోజుకూ సరిపడని డోసులు 

15 వరకూ రాష్ట్రానికి నో వ్యాక్సిన్‌

నేటి నుంచి 14 వరకూ ఉత్సవ్‌ 

టీకా లేకుండా నిర్వహణ ఎలా? 

ముందస్తు ప్రణాళిక లేని ఆరోగ్యశాఖ 

రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం


అమరావతి/విజయవాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్‌.. సరిపడా వ్యాక్సిన్‌ డోసులు లేకుండానే రాష్ట్రంలో మొదలవుతోంది. ఆదివారం నుంచి ఈ నెల 14 వరకూ టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని మోదీ ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 45 ఏళ్లు దాటిన వారిని స్వయంగా వ్యాక్సిన్‌ కేంద్రాలకు తీసుకువచ్చి టీకా వేయాలి. ప్రధాని ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ టీకా ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేసింది.


కానీ టీకా ఉత్సవ్‌కు ముఖ్యంగా కావాల్సింది టీకా. ఇప్పుడు రాష్ట్రంలో అది పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న టీకా డోసుల సంఖ్య లక్షా 35 వేలు మాత్రమే. ఇవి పూర్తిగా ఒక్క రోజుకు కూడా చాలని పరిస్థితి. సాధారణ రోజుల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ అందిస్తుంది. ఇక టీకా ఉత్సవ్‌ అంటే కనీసం 10 లక్షల మందికైనా టీకా వేయాలి. శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ ఏ జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో డోసులు అందుబాటులో లేవు. ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలు సరిగ్గా వేసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.


ఏపీకి వెంటనే కోటి డోసులు పంపించాలని సీఎం దగ్గర నుంచి ఆరోగ్య శాఖ కమిషనర్‌ వరకూ ప్రతి ఒక్కరూ కేంద్రానికి లేఖలు రాశారు. కాగా కేంద్రం కేవలం రెండు లక్షల డోసులే పంపించింది. ఈ నెల 8వ తేదీన రెండు లక్షల డోసులు ఏపీకి చేరుకున్నారు. రాష్ట్రంలో టీకా ఉత్సవ్‌ నిర్వహించడం కష్టమని అధికారులు చేతులెత్తేశారు. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 15వ తేదీ వరకూ రాష్ట్రానికి టీకాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్‌ ఎలా నిర్వహిస్తారు? ఎంతమందికి డోసులు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


బెజవాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ 

కృష్ణా జిల్లాలో కరోనా బాధితులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు దోపిడీకి తెర తీశారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లతో అనధికార ఒప్పందాలు కుదుర్చుకుని కరోనా నిర్ధారణ పరీక్షలకు బాధితుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు కృష్ణా జిల్లాలో అపోలో ప్రైవేట్‌ ల్యాబ్‌కు, మణిపాల్‌ ఆసుపత్రిలోని ల్యాబ్‌లకు మాత్రమే ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు జారీ చేసింది. ఇప్పుడు నగరంలోని అనేక ప్రైవేటు ఆసుపత్రులలో అనధికారికంగా కరోనా పరీక్షలు, చికిత్సలు కూడా చేస్తూ దోచుకుంటున్నారు. 

Updated Date - 2021-04-11T08:22:29+05:30 IST