కరీంనగర్‌ జిల్లాలో 16న టీకా పండగ

ABN , First Publish Date - 2021-01-14T05:10:53+05:30 IST

పది నెలలుగా ప్రజలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి రోజులు దగ్గర పడ్డాయి.

కరీంనగర్‌ జిల్లాలో 16న టీకా పండగ

తొలివిడతలో 23,507 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు

ఉమ్మడి జిల్లాలో 99 టీకా కేంద్రాలు

16న 14 కేంద్రాల్లో శ్రీకారం

18నుంచి అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ

జిల్లాకు 27,409 టీకా వాయిల్స్

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పది నెలలుగా ప్రజలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి రోజులు దగ్గర పడ్డాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 16న టీకా పండగ ప్రారంభం కానున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేసిన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బందికి తొలి విడతలో టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 16 నుంచి టీకాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.  కరీంనగర్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో 99 కేంద్రాల్లో టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న 14 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున టీకాలు ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టనున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రి, హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రి, బుట్టిరాజారాం కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారంచుట్టనున్నారు. పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఆస్పత్రితోపాటు సుల్తానాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌, గోదావరిఖని ఏరియా ఆస్పత్రి, లక్ష్మీపూర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రితోపాటు వేములవాడ, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జగిత్యాల జిల్లాలో జగిత్యాల ఏరియా ఆస్పత్రి, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

తొలిరోజు 30 మందికి..

 ఒక్కో కేంద్రంలో తొలిరోజు 30 మందికి టీకాలు ఇస్తారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆ రోజు 420 మందికి టీకాలు ఇస్తారు. తిరిగి 18న టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారు. నాలుగు జిల్లాల పరిధిలో 99 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు వందమంది చొప్పున టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కేంద్ర ఆస్పత్రి, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రితోపాటు కరీంనగర్‌ పట్టణంలోని 6 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. జగిత్యాల జిల్లా ఆస్పత్రితోపాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జగిత్యాల సివిల్‌ డిస్పెన్సరీలో టీకాలు ఇస్తారు. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, సుల్తానాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, గోదావరిఖని ఏరియా ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు కలుపుకొని 26 కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో టీకాల కార్యక్రమం చేపట్టనున్నారు. నాలుగు జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అంగన్‌వాడి కార్యకర్తలకు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి టీకాలు తొలి విడతలోనే ఇస్తారు. ఇప్పటికే వీరందరిని గుర్తించి కొవిన్‌ యాప్‌లో నమోదు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో 12,419 మందికి, పెద్దపల్లి జిల్లాలో 3,491 మందికి, జగిత్యాల జిల్లాలో 4,115 మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,482 మందికి మొత్తం నాలుగు జిల్లాల్లో కలిపి 23,507 మందికి తొలి విడతలో టీకాలు ఇవ్వనున్నారు.

జిల్లాకు 27,409 వాయిల్స్‌ కేటాయింపు..

తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు ఇచ్చేందుకు వీలుగా 27,409 వాయిల్స్‌ టీకా జిల్లాకే కేటాయించారు. గురువారం ఉదయంలోగా ఈ టీకాలు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని డ్రగ్‌ సెంటర్‌కు చేరుకోనున్నాయి. 0.05 ఎంఎల్‌ సిరంజీలు కూడా ఇప్పటికే జిల్లాకు పంపించారు. టీకాలు తీసుకున్నవారిని అరగంటపాటు ఆయా కేంద్రాలలోనే అబ్జర్వేషన్‌లోనే ఉంచుతారు. టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రికి, హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి, వేములవాడ ఆస్పత్రి, పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి, గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి, జగిత్యాల జిల్లా ఆస్పత్రికి, మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి చికిత్సనందిస్తారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక వైద్యులను అందుకోసం నియమించారు. అన్ని జిల్లాల్లో అడ్‌వర్స్‌ ఈవెంట్‌ ఫాలోయింగ్‌ ఇమ్యూనైజేషన్‌ (ఏఈఎఫ్‌ఐ) టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఫిజీషియన్లు, పల్మనాలజిస్టులు, అనస్థీషియన్లు, గైనిక్‌, పీడియాట్రిషియన్‌లకు ప్రాధాన్యమిచ్చారు. ఈ బృందాలు ఆస్సత్రుల్లో ఉండి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన వారికి చికిత్సనందిస్తారు.

Updated Date - 2021-01-14T05:10:53+05:30 IST