‘టీకా’న లేదు!

ABN , First Publish Date - 2021-04-12T05:00:03+05:30 IST

ఉత్సవ వాతావరణంలో ‘టీకా ఉత్సవ్‌’ను నిర్వహించండి. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ టీకా అందించండి. ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేయండి. అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం వ్యాక్సిన్లు మాత్రం సరిపడా అందించలేదు. దీంతో టీకా లేకుండానే..జిల్లాలో టీకా ఉత్సవం ప్రారంభమైంది.

‘టీకా’న లేదు!
గరుగుబిల్లి మండలం చిలకాంలో వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం






వ్యాక్సిన్ల కొరతతో ప్రారంభంకాని టీకా ఉత్సవ్‌

జిల్లావ్యాప్తంగా నిండుకున్న నిల్వలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఉత్సవ వాతావరణంలో ‘టీకా ఉత్సవ్‌’ను నిర్వహించండి. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ టీకా అందించండి. ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేయండి. అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం వ్యాక్సిన్లు మాత్రం సరిపడా అందించలేదు. దీంతో టీకా లేకుండానే..జిల్లాలో టీకా ఉత్సవం ప్రారంభమైంది. ఆదివారం నుంచి ఈ నెల 14 వరకూ మూడు రోజుల పాటు టీకా ఉత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు లేకపోవడంతో ఆదివారం కూడా కార్యక్రమం ప్రారంభం కాలేదు. వ్యాక్సిన్లు కావాలని సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండెంట్‌ వెళ్లినా అందించలేకపోయారు. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా టీకా ఉత్సవ్‌ను ప్రారంభించలేకపోయారు.  ప్రస్తుతం కొన్ని సీహెచ్‌సీలు, ప్రాఽథమిక ఆరోగ్య కేందాల్లో కొద్దిపాటు వాక్సినేషన్‌ నిల్వలున్నాయి. ఆదివారం వేయడంతో కొన్నిచోట్ల నిల్వలు నిండుకున్నాయి.టీకా ఉత్సవ్‌ విషయంలో అధికారులు ప్రచారానికి వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. భోగాపురం సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. అక్కడ కూడా టీకా ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. టీకా ఉత్సవ్‌ అన్నది గ్రామస్థాయిలో సచివాలయాల కేంద్రాలుగా నిర్వహించాలి. కానీ సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సైతం టీకా ఉత్సవ్‌గా చూపుతున్నారు. 


నేడు నిల్వలు చేరుకునే అవకాశం

 వ్యాక్సిన్‌ నిల్వలు  సోమ, మంగళవారాల్లో జిల్లాకు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. అప్పుడే టీకా ఉత్సవ్‌ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే అవకాశముంది. మరోవైపు మొదటి దశ టీకా వేయించుకున్న వారు సైతం...రెండో టీకా వేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. మొదటి డోసు వేసుకున్నవారు తప్పనిసరిగా రెండో డోసు వేసుకోవాలని అధికారులు సూచించడంతో ఎక్కువ మంది పీహెచ్‌సీలకు వస్తున్నారు. ఇటు కొత్తవారికి, ఒక డోసు వేసుకున్నవారు సైతం వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 2.10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేనిచోట పక్క పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నుంచి సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి దాదాపు అన్నిచోట్ల వ్యాక్సిన్లు నిండుకున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ నిల్వలు వస్తే కానీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. 


కరోనా కేసులు ఉధృతం

మరోవైపు జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం 193 కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒకటో దశ తరువాత జిల్లా గ్రీన్‌జోన్‌గా మారింది. రోజుకు పదిలోపు కేసులే నమోదయ్యేవి. దీంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే సెకెండ్‌ వేవ్‌లో కేసులు పెరుగుతుండడంతో అంతా భయపడుతున్నారు. గత వారంరోజులుగా పరిశీలిస్తే కేసులు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. గత సోమవారం కేవలం రెండు కేసులే నమోదుకాగా..మంగళవారం 49, బుధవారం 47, గురువారం 46, శుక్రవారం 49, శనివారం 97 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఏకంగా రెండు వందలకు చేరువయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 573 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 66 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.




Updated Date - 2021-04-12T05:00:03+05:30 IST