ప్రజల వద్దకే వ్యాక్సినేషన్‌ బృందాలు

ABN , First Publish Date - 2021-12-03T05:05:32+05:30 IST

జిల్లాలో ఏ ఒక్కరూ కూడా వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజల వద్దకే వ్యాక్సిన్‌ టీమ్‌లు వెళ్లి టీకా వేస్తున్నట్లు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు.

ప్రజల వద్దకే వ్యాక్సినేషన్‌ బృందాలు
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
పట్టణంలో వ్యాక్సినేషన్‌ పరిశీలన

ఆదిలాబాద్‌టౌన్‌; డిసెంబరు 2 : జిల్లాలో ఏ ఒక్కరూ కూడా వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజల వద్దకే వ్యాక్సిన్‌ టీమ్‌లు వెళ్లి టీకా వేస్తున్నట్లు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో వ్యాక్సినేషన్‌ నిర్వాహణ తీరును అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్‌ పరిధిని 28, 29, 30, 31 వార్డుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారి ఇంటికి వెళ్లి వైరస్‌ వ్యాప్తిపై వివరించారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను స్వయంగా కలెక్టర్‌ నివృత్తిచేస్తూ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా ప్రోత్సహించారు. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, బాలింతలు, గర్భవతులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని వైద్యాధికారులు, వైద్య, మున్సిపల్‌ సిబ్బంది ఆయా వార్డుల్లోని ప్రజలకు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3.50లక్షల మందికి వ్యాక్సినేషన్‌ వేసినట్లు తెలిపారు. దీంతో 76శాతం వ్యాక్సిన్‌ పూర్తయిందని, ఇంకా 24 శాతం మందికి మొదటి డోసు అందించేందుకు ఇంటింటి సర్వే చేస్తూ టీమ్‌లు ఈ నెల 2 నుంచి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు అర్హత కలిగిన 15 మందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉందని, వారికి కూడా వేస్తామని తెలిపారు. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వస్తుందనే ముందస్తులో భాగంగా జిల్లాలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 31లోగా అందించేందుకు జిల్లా యంత్రాంగం సీనియర్‌ అధికారులతో టీమ్‌లను ఏర్పాటు చేయడం, పర్యవేక్షించడం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు ఆయా వార్డులోని ప్రజలను చైతన్యం చేసి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ప్రత్యేకాఽదికారులు, వైద్య, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌పై అపోహ వద్దు...
వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అపోహ వద్దని ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని ఖానాపూర్‌, మొగులాలిగుట్ట, బొక్కలగూడలో ఏర్పాటుచేసిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి మున్సిపల్‌ చైర్మన్‌ పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ వైద్య బృందంతో కలిసి ఇంటింటికీ కాలినడకనతిరుగుతూ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేసుకోవాలని కోరారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ వైరస్‌ చాపకింద నీరులా వేగంగా విస్తరించి అంతటా అతలాకుతలం చేసిన విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:05:32+05:30 IST