అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా

ABN , First Publish Date - 2021-03-03T07:44:02+05:30 IST

ఇకపై అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేయించుకోవచ్చు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు రంగంలోని ఆస్పత్రుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో

అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా

కేంద్ర, రాష్ట్ర పథకాలతో ఎంప్యానెల్‌ కాకున్నా అవకాశం

ప్రకటన జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

సమృద్ధిగా వ్యాక్సిన్‌ డోసులు

బఫర్‌ స్టాక్‌ అవసరం లేదని స్పష్టీకరణ

రాష్ట్రంలో టీకా కోసం ప్రైవేటుకు బారులు

ప్రభుత్వ ఆస్పత్రుల కంటే వాటిపైనే ఆసక్తి

కొన్నిచోట్ల నెల రోజుల స్లాట్‌ బుకింగ్‌

రెండో రోజు 8,523 మందికి వ్యాక్సిన్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఇకపై అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేయించుకోవచ్చు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు రంగంలోని ఆస్పత్రుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ.. ఎక్కువ శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ చేరేలా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలోనూ టీకా ఉచితంగా ఇస్తున్నా.. ప్రజలు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నారు. రూ.250 చెల్లించి మరీ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలతో ఎం ప్యానెల్‌ కాని ప్రైవేటు ఆస్పత్రులు సైతం కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ‘‘టీకా ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది, వ్యాక్సిన్‌ అనంతరం వేచి ఉండేందుకు తగిన స్థలం, నిల్వకు తగినంత కోల్డ్‌చైన్‌ వ్యవస్థ, టీకా తర్వాత వ్యక్తుల్లో తలెత్తే ప్రభావాలను ఎదుర్కొనగల సామర్థ్యం ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు.. ఆయుష్మాన్‌ భారత్‌, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌), రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలతో ఎంప్యానెల్‌ కానప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలు (సీవీసీ)గా వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తున్నాం’’ అంటూ ప్రకటన జారీచేసింది. పూర్తి స్థాయిలో వీటి సామర్థ్యాన్ని వాడుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో బఫర్‌ స్టాక్‌ పేరిట టీకాను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని, తమదగ్గర సరిపడా డోసులు ఉన్నాయని.. అవసరం మేర సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.


తెలంగాణలో రెండు రోజుల పంపిణీ తీరును గమనిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు టీకా తీసుకునేందుకే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సోమవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,005 మంది, ప్రైవేటులో 2,553 వ్యాక్సిన్‌ వేయించుకోగా.. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,528 (74 శాతం), ప్రైవేటులో 4,995 (94 శాతం) మంది తీసుకున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నెల రోజుల స్లాట్‌లు బుకింగ్‌ అయిపోయాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో మార్చి 28 వరకు స్లాట్స్‌ బుక్‌ అయ్యాయి. కాగా, ప్రజల మొగ్గును గమనించిన వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఎంప్యానెల్‌ అయిన 215, ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎంప్యానెల్‌ అయిన 12, సీజీహెచ్‌ఎస్‌ అమలు చేసే 17 ప్రైవేటు ఆస్పత్రులకు టీకా పంపిణీకి అనుమతిచ్చింది. అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు ముందు జరిగింది.


రూ.100 సర్వీస్‌ చార్జి వద్దంటూ..

రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు టీకాను సర్వీస్‌ చార్జి లేకుండానే ఇస్తున్నాయి. డోసుకు అసలు ధర రూ.150, సర్వీస్‌ చార్జి రూ.100 కాగా హైదరాబాద్‌లోని యశోదా, విరించి, అపోలో ఆస్పత్రులు అసలు ధరనే తీసుకుంటున్నాయి. ఇదే బాటలో మరికొన్ని నడిచే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, మంగళవారం రాష్ట్రంలో 45 ఏళ్లుపైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, 60 ఏళ్లు దాటినవారిలో 8,523 మంది తొలి డోసు తీసుకున్నారు. 135 కేంద్రాల్లో పంపిణీ జరిగింది. ఇక ఆరోగ్య కార్యకర్తల్లో 484 మందికి తొలి, 1,923 మంది రెండో డోసు ఇచ్చారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌లో 125 మందికి తొలి డోసు వేశారు. ఇప్పటివరకు 3,01,008 మంది డోసు, 1,49,639 మంది రెండో డోసు తీసుకున్నారు.

Updated Date - 2021-03-03T07:44:02+05:30 IST