వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-11T08:32:28+05:30 IST

వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి రెండు రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్‌ లేదనే కారణంతో టీకా నిరాకరించడంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని

వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్‌

రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయండి

ఆధార్‌ లేదని టీకా నిరాకరణపై నివేదిక ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వ్యాక్సిన్‌ నిరాకరణపై జేసీలను నివేదిక కోరతాం

నిర్ధారణైతే బాధ్యులపై చర్యలు: ప్రభుత్వం


అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి రెండు రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్‌ లేదనే కారణంతో టీకా నిరాకరించడంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. గుర్తింపు కార్డులు లేకున్నా టీకా వేయాలనే  ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నా, వ్యాక్సిన్‌ వేసే సిబ్బందికి ఈ విషయంపై అవగాహన ఉండాలి కదా! అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సిబ్బందికి రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలనిఆదేశించింది. విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కరోనాకు సంబంధించిన వివిధ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమే్‌షతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 


రాష్ట్రంలో 1,975 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) సి.సుమన్‌, కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌(ఏఎ్‌సజీ) వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తిన అంశాలపై వివరాలను మెమో రూపంలో అందజేశామని కోర్టుకు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, ఇంజెక్షన్ల సరఫరా వివరాలను కోర్టు ముందుంచామని, ఏపీకి తాజాగా ఈ నెల 9న 12,400 వయల్స్‌ కేటాయించామని, ఇప్పటివరకు మొత్తం 34,010 వయల్స్‌ అందజేశామని ఏఎ్‌సజీ వివరించారు. ఫంగస్‌ కేసుల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం ఇంజెక్షన్లు కేటాయిస్తోందన్నారు. ఎస్‌జీపీ సుమన్‌ స్పందిస్తూ...రాష్ట్రంలో ఇప్పటివరకు 1,975 బ్లాక్‌ ఫంగస్‌ కేసులుండగా, వీరిలో 110 మంది మృతి చెందారని, మరికొందరు కోలుకున్నారని, ప్రస్తుతం 1,350 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. 


80 ఏళ్ల వయసులో ఎక్కడికెళ్తారు?

అమికస్‌ క్యూరీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఆధార్‌ కార్డు లేదనే కారణంతో వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి వ్యాక్సిన్‌ వేయడానికి నిరాకరిస్తున్నారన్నారు. ఇతర రాష్ర్టాల్లో గుర్తింపు కార్డు లేకున్నా వృద్ధాశ్రమంలో ఉన్నవారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారని, ఏపీలో మాత్రమే నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో ఆధార్‌ కార్డు కోసం వారు ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. అలాగే, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఎస్‌జీపీ సుమన్‌ స్పందిస్తూ.. ఆధార్‌ లేదని వ్యాక్సిన్‌ నిరాకరించారంటూ వచ్చిన కథనాలపై విచారణ జరిపిస్తామని,   సంబంధిత జిల్లా జాయింట్‌ కలెక్టర్ల నుంచి నివేదిక కోరతామని,  వ్యాక్సిన్‌ నిరాకరణ నిజమని తేలితే బాధ్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో వృద్ధాశ్రమంలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. మిగిలిన జిల్లాల్లో 50 శాతం ప్రక్రియ పూర్తయిందని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. రోజుకు 1.20 లక్షల కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, గత మూడు రోజులుగా 95 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ఆధార్‌ లేకుంటే వ్యాక్సిన్‌ వేయట్లేదన్న వార్తలపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాశ్రమాలలో ఉన్నవారికి 2రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.


మిస్సీ బాధితులకు ఆరోగ్యశ్రీ చికిత్స: ఎస్‌జీపీ

కొవిడ్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రాతిపదికన 26,325 మంది మెడికల్‌ సిబ్బందిని నియమించామని, కలెక్టర్లు నియామక ప్రక్రియ చేపడుతున్నారని ఎస్‌జీపీ వివరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలందించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని, టాస్క్‌ ఫోర్స్‌ ఇచ్చిన నివేదిక మేరకు పిల్లల చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలను కొనుగోలు చేస్తోందని, మిస్సీ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. దీంతో పూర్తి వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ధర్మాసనం ఎస్‌జీపీని ఆదేశించింది.


వైద్య సిబ్బందికి 3 నెలలుగా జీతాల్లేవ్‌..

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాస్‌, పొత్తూరు సురే్‌షకుమార్‌ వాదనలు వినిపిస్తూ... వివిధ ప్రాంతాల్లో ఉన్న  వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. దీనిపై ఎస్‌జీపీ విభేదించడంతో, ఎవరికి జీతాలు చెల్లించట్లేదో వివరాలను మెమో రూపంలో కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించింది.


Updated Date - 2021-06-11T08:32:28+05:30 IST