నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

ABN , First Publish Date - 2021-12-02T05:35:32+05:30 IST

నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నిఖిల

  • వికారాబాద్‌ కలెక్టర్‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశం

వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటి,, రెండవ డోస్‌లు వందశాతం పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా కలెక్టర్‌ నిఖిలను ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై బుధవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ష్ఫరెన్స్‌లో మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీ్‌షరావు మా ట్లాడుతూ ఇతర దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యా ప్తి చెందుతున్న నేపథ్యంలో మూడవ దశ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. డిసెంబరు చివరినాటికి జిల్లాలో రెండు డోసుల వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ తక్కువ శాతం వ్యాక్సినేషన్‌ జరిగిందో గుర్తించి ఆ ప్రాంతాల్లో కలెక్టర్‌, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తిస్థాయిలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోస్‌ 82 శాతం, రెండవ డోస్‌ 20 శాతం పూర్తయినట్లు చెప్పారు. మొదటి డోస్‌ తీసుకుని రెండో డోస్‌కు అర్హులైన 27,646 మందికి గురువారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఆమె మంత్రికి వివరించారు. జిల్లాలో 8 పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సినేషన్‌ తక్కువ శాతం నమోదవగా, వాటి లో 4 పీహెచ్‌సీల పరిధిలో గురువారం నుంచి జిల్లా యంత్రాంగం దృష్టి సారించి అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చైతన్యపరుస్తామని ఆమె చెప్పారు. వ్యాక్సినేషన్‌లో ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులను భాగస్వాములను చేయాలని, రోజూ లక్ష్యాల ప్రగతిపై రోజూ సమీక్షించాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారికి టీకాలు వేసి లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ మంజులరమేష్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఎంహెచ్‌వో తుకారాంభట్‌, డీఈవో రేణుకాదేవి, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో మల్లారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T05:35:32+05:30 IST