కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2021-05-08T05:49:24+05:30 IST

కరోనా విజృంభిస్తున్నవేళ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలకు అగచాట్లు తప్పడంలేదు. ఇప్పటికే మొదటిడోస్‌ వేసుకుని.. రెండోడోస్‌ కోసం వేచిచూస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొదటిడోస్‌ కోవ్యాక్సిన్‌ తీసుకున్నవారికి గడువు తీరినా రెండోడోసు కోసం అదేరకం టీకా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. తప్పని తిప్పలు
తూప్రాన్‌ పీహెచ్‌సీ వద్ద వాక్సిన్‌ కోసం క్యూ

కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజల పాట్లు


నర్సాపూర్‌, మే 7: కరోనా విజృంభిస్తున్నవేళ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలకు అగచాట్లు తప్పడంలేదు. ఇప్పటికే మొదటిడోస్‌ వేసుకుని.. రెండోడోస్‌ కోసం వేచిచూస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొదటిడోస్‌ కోవ్యాక్సిన్‌  తీసుకున్నవారికి గడువు తీరినా రెండోడోసు కోసం అదేరకం టీకా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నర్సాపూర్‌ ప్రాంతంలో మొదటిడోస్‌ కోవ్యాక్సిన్‌ తీసుకున్నవారికి రెండోడోసు సమయం వచ్చింది. అయినా వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో నర్సాపూర్‌ ఆస్పత్రికి కోవ్యాక్సిన్‌ స్టాక్‌ వచ్చినట్టు తెలిసి శుక్రవారం పలువురు స్థానికులు రెండోడోసు కోసం వచ్చారు. వ్యాక్సిన్‌ కోసం పెద్ద సంఖ్యలో క్యూలైన్‌లో వేచియున్నారు. కొద్దిసేపటి అనంతరం ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్‌ వేయడం లేదని చెప్పారు. జిల్లా అధికారులు ఈరోజు వ్యాక్సిన్‌ ఇవ్వద్దని సూచించారని స్పష్టం చేశారు. దీంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చినవారు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులకు ఎమ్మెల్యే ఫోన్‌ చేయడంతో 40 మందికి కోవ్యాక్సిన్‌ ఇచ్చారు. మరోవైపు కోవిషీల్డు మొదటిడోస్‌ తీసుకున్నవారు రెండోడోస్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆస్పత్రికిరాగా వ్యాక్సిన్‌ లేదని తిప్పిపంపారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని స్లాట్‌ కేటాయించి, తీరా ఆస్పత్రికి వచ్చిన అనంతరం ఇవ్వకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


గ్రామీణ పీహెచ్‌సీలకు నగరవాసులు

తూప్రాన్‌, మే 7: వ్యాక్సిన్‌ కోసం నగరవాసులు గ్రామీణ పీహెచ్‌సీల బాటపడుతున్నారు. కొవిన్‌ యాప్‌లో ముందస్తు బుకింగ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి రావడంతో ఏ పీహెచ్‌సీలో ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయో అందరికీ తెలుస్తున్నది. వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరగడం, పరిమిత సంఖ్యలోనే టీకాలు ఇస్తుండడంతో నగరవాసులు శివారు ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో వాక్సినేషన్‌ తీసుకోవడం కష్టం కావడంతో నగరానికి సమీపంలో ఉన్న తూప్రాన్‌ను ఎంచుకుని స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. తూప్రాన్‌ పట్టణంలోని దవాఖానాల్లో మూడురోజులుగా నగర పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులే అధికంగా వాక్సినేషన్‌ కోసం వస్తున్నారు. ఉదయాన్నే ఆస్పత్రుల వద్దకు చేరుకుని క్యూలైన్లలో వేచియుంటున్నారు. ఈక్రమంలో కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. భౌతికదూరం పాటించకుండా వాక్సిన్‌  వేయించుకోవడానికి ఎగబడుతున్నారు. దీంతో వాక్సినేషన్‌ కేంద్రాల్లోనే కరోనా విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ధేశించిన 100 డోసులు నగరవాసులకే సరిపోతున్నది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సంగతి తెలియని స్థానికులు వాక్సిన్‌ కేంద్రాల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగుతున్నారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం రద్దుచేసి గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటుచేసి వాక్సినేషన్‌ చేయాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. 


తీరని వ్యాక్సినేషన్‌ చింత

చేర్యాల, మే 7: చేర్యాలలో వ్యాక్సినేషన్‌ కోసం ముందుకువస్తున్న ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ కేంద్రాలవద్ద ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ వివరాలు కనిపించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 4న స్లాట్‌ బుక్‌చేసుకున్నావారి వివరాలు ఆన్‌లైన్‌లో చూపకపోవడంతో తిరిగి 7వ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కానీ మరోసారి అదే సమస్య తలెత్తడంతో శుక్రవారం చేర్యాల పెద్దమ్మగడ్డ శిబిరం వద్ద గందరగోళం నెలకొన్నది. ప్రజలు నిలదీస్తుండటంతో వైద్యసిబ్బందికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. 

Updated Date - 2021-05-08T05:49:24+05:30 IST