టీకాకు ఓటీపీ

ABN , First Publish Date - 2021-05-08T09:10:54+05:30 IST

వ్యాక్సినేషన్‌ స్థాయికి సంబంధించిన డేటా ఎంట్రీ లోపాలను తగ్గించే చర్యల్లో భాగంగా శనివారం నుంచి కొవిడ్‌ వ్యవస్థలో నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు.

టీకాకు ఓటీపీ

నేటి నుంచి కొవిన్‌లో కొత్త ఆప్షన్‌

4 అంకెల సెక్యూరిటీ కోడ్‌ తప్పనిసరి


న్యూఢిల్లీ, మే 7: వ్యాక్సినేషన్‌ స్థాయికి సంబంధించిన డేటా ఎంట్రీ లోపాలను తగ్గించే చర్యల్లో భాగంగా శనివారం నుంచి కొవిడ్‌ వ్యవస్థలో నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని మూలంగా పౌరులకు అసౌకర్యం కలగకుండా ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిన్‌ పోర్టల్‌ ద్వారా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకున్న వారు షెడ్యూల్డ్‌ తేదీ నాడు వ్యాక్సినేషన్‌ కోసం వెళ్లకపోయినప్పటికీ వారికి వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చినట్టుగా ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్‌ వచ్చిన కొన్ని సంఘటనలు మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయి. వ్యాక్సినేటర్‌ సంబంధిత వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా తప్పుగా మార్కింగ్‌ చేయడం వల్ల ఇది జరుగుతున్నట్టు గుర్తించారు. ఇలాంటి లోపాలను తగ్గించే చర్యల్లో భాగంగా నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను కొవిన్‌ అప్లికేషన్‌లో మే 8 నుంచి ప్రవేశపెడుతున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వెరిఫికేషన్‌ తర్వాత లబ్ధిదారుడు వ్యాక్సినేషన్‌కు అర్హుడని గుర్తిస్తే వ్యాక్సిన్‌ డోస్‌ ఇవ్వడానికి ముందు వెరిఫయర్‌/వ్యాక్సినేటర్‌ లబ్ధిదారుడిని తన నాలుగు అంకెల కోడ్‌ను అడుగుతారు. వ్యాక్సినేషన్‌ స్టేట్‌సను సరిగ్గా రికార్డు చేయడానికి ఆ కోడ్‌ను కొవిన్‌ సిస్టమ్‌లో ఎంటర్‌ చేస్తారు. వ్యాక్సినేషన్‌ స్లాట్‌ కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే ఈ కొత్త ఫీచర్‌ వర్తిస్తుంది.


అపాయింట్‌మెంట్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌పైన నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను ప్రింట్‌ చేస్తారు. ఇది వ్యాక్సినేటర్‌కు తెలియదు. అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌ తర్వాత లబ్ధిదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వచ్చే కన్ఫర్మేషన్‌ ఎస్‌ఎంఎ్‌సలో కూడా ఈ కోడ్‌ ఉంటుంది. పౌరులు తమ అపాయింట్‌మెంట్‌ స్లిప్‌కు సంబంధించిన డిజిటల్‌ లేదా ఫిజికల్‌ కాపీని, అపాయింట్‌మెంట్‌ కన్ఫర్మేషన్‌ ఎస్‌ఎంఎ్‌సతో ఉన్న రిజిస్టర్డ్‌ మొబైల్‌ను వెంట తీసుకువెళ్లాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యాక్సినేషన్‌ రికార్డింగ్‌ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. 

Updated Date - 2021-05-08T09:10:54+05:30 IST