టీకా కోసం చలో... చలో!

ABN , First Publish Date - 2020-12-01T09:19:04+05:30 IST

గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రికి ఇప్పుడు ఐఏఎస్‌ అధికారులు క్యూ కడుతున్నారు. ఖరీదైన బెంజ్‌ కార్లలో వస్తున్న

టీకా కోసం చలో... చలో!

కొవాగ్జిన్‌ ట్రయల్స్‌కు పెద్దల క్యూ 


గుంటూరు(మెడికల్‌), నవంబరు 30: గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రికి ఇప్పుడు ఐఏఎస్‌ అధికారులు క్యూ కడుతున్నారు. ఖరీదైన బెంజ్‌ కార్లలో వస్తున్న బ్యూరోక్రాట్లతో పాటు బడా వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు నేరుగా ఆస్పత్రిలోకి వెళ్లి వలంటీర్లుగా పేరు నమోదు చేయించుకుంటున్నారు. కరోనా నివారణకు తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా వేయించుకుంటున్నారు. ఐసీఎంఆర్‌ సౌజన్యంతో భారత్‌ బయోటె క్‌ ఆధ్వర్యంలో కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌  ట్రయల్స్‌ గత గురువారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యాయి. మొత్తం వెయ్యి మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించగా తొలి 3రోజుల్లోనే 150మందికి టీకాలు వేశారు. వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిలో అత్యధికులు ఐఏఎస్‌, పెద్దస్థాయి అధికారులు, ప్రైవేట్‌ డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం.


కరోనా భయం ఇంకా వదలకపోవడం, ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్‌ కాబట్టి వ్యాక్సిన్‌ దుష్ప్రభావం ఉండదని భావించి వీరు ముందుకు వస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి వలంటీర్‌కు 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ ఇంట్రామస్క్యులర్‌గా ఇస్తారు. జీరో డే, 28వ రోజున రెండుసార్లు టీకా వేసిన అనంతరం 60వ రోజున వీరిలో కరోనా యాంటీబాడీలు, ఇమ్యునోగ్లోబులిన్‌ స్థాయులను పరిశీలిస్తారు. ఇవి నిర్దేశిత ప్రమాణంలో ఉంటే వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్లుగా నిర్ధారిస్తారు. 

Updated Date - 2020-12-01T09:19:04+05:30 IST