సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-08T05:00:43+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ నిర్వహించేందుకు

సర్వం సిద్ధం

  • వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌కు ఏర్పాట్లు పూర్తి
  • ఆసుపత్రులను సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ 
  • కొవిడ్‌ టీకా వేయడంపై నేడు ప్రయోగాత్మక అవగాహన


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీకా వేసే సమయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగాలనే లక్ష్యంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. తాండూరులోని జిల్లా ప్రభుత్వాఆసుపత్రితోపాటు వికారాబాద్‌, మర్పల్లి ప్రాంతీయ ఆసుపత్రులు, పరిగి, కొడంగల్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో తొలి విడత ఎంత మందికి వ్యాక్సిన్‌ వేయాలనేది ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది వివరాలు సేకరించారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌పై వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 


డమ్మీ వ్యాక్సినేషన్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడానికి ముందు మందు లేకుండా డమ్మీ వ్యాక్సినేషన్‌ పేరుతో డ్రైరన్‌ నిర్వహిస్తారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమైతే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైన చికిత్స అందించేలా మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నారు. డ్రైరన్‌ కోసం ఎంపిక చేసిన వైద్య సిబ్బంది పేర్లు, ఆధార్‌కార్డు వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డ్రైరన్‌ నిర్వహించే శుక్రవారం వ్యాక్సినేషన్‌ తీసుకోవాలనే సమాచారం వారి ఫోన్లకు వస్తుంది. తమకు కేటాయించిన పీహెచ్‌సీ, ఆసుపత్రికి వెళ్తారు. మొదట వెయిటింగ్‌ హాల్‌లోకి వెళ్లగానే వ్యాక్సిన్‌ కోసం వచ్చినవారి పేరు, చిరునామా, ఇతర వివరాలు తెలుసుకుని ఆధార్‌, గుర్తింపు కార్డు పరిశీలిస్తారు. వ్యాక్సిన్‌ ఇచ్చే గదిలోకి వెళ్లిన తరువాత వెబ్‌సైట్‌లో నమోదైన వివరాలు, ఆధార్‌కార్డుతో పోల్చి చూస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన తరువాత వ్యాక్సినేషన్‌కు పంపిస్తారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డాక్టర్ల పరిశీలనలో అరగంటపాటు ఓ గదిలో ఉంచుతారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోతే ఆ వ్యక్తిని ఇంటికి పంపిస్తారు. ఏమైనా సమస్యలు తలెత్తితే అత్యవసర వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటారు. వ్యాక్సినేషన్‌ కోసం వచ్చి, తిరిగి వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్‌ సమయంలో సక్రమంగా కొనసాగేలా సిబ్బందికి అవగాహన కల్పించడానికి నేడు డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-01-08T05:00:43+05:30 IST