దేశం నలుమూలలకూ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-14T07:15:54+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి అంకం వేగంగా సాగుతోంది. దేశం నలుమూలలకూ టీకాల సరఫరా జోరందుకుంది. తొలిరోజు పెద్ద నగరాలకు టీకాలు తరలించగా.. రెండోరోజైన బుధవారం చిన్న నగరాలకు, ప

దేశం నలుమూలలకూ వ్యాక్సిన్‌

జోరందుకున్న టీకాల తరలింపు

11 నగరాలకు కొవాగ్జిన్‌ టీకాలు

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తరలించిన భారత్‌ బయోటెక్‌

13 నగరాలకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు కేటాయింపులో వివక్ష లేదు: కేంద్రం


న్యూఢిల్లీ, జనవరి 13: ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి అంకం వేగంగా సాగుతోంది. దేశం నలుమూలలకూ టీకాల సరఫరా జోరందుకుంది. తొలిరోజు పెద్ద నగరాలకు టీకాలు తరలించగా.. రెండోరోజైన బుధవారం చిన్న నగరాలకు, పట్టణాలకు వ్యాక్సిన్లు చేరాయి. ఇప్పటిదాకా 56 లక్షల కొవిషీల్డ్‌ టీకాలు 13 నగరాలకు తరలగా.. కొవాగ్జిన్‌ టీకాలు 11 నగరాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌ అందుకున్న 1.1 కోట్ల డోసుల ఆర్డర్‌లో 95 శాతం మేర సరఫరా అయినట్టు సమాచారం. మిగిలిన లక్ష డోసుల టీకాను త్వరలోనే పంపనున్నారు. ఇక.. ప్రభుత్వం నుంచి 55 లక్షల డోసులకు ఆర్డర్‌ అందుకున్నామని.. తొలి బ్యాచ్‌ టీకాలను సరఫరా చేశామని భారత్‌ బయోటెక్‌ సంస్థ బుధవారం ప్రకటించింది. తమ వ్యాక్సిన్లను గన్నవరం, గువాహటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్‌, జైపూర్‌, చెన్నై, లఖ్‌నవు నగరాలకు పంపామని వెల్లడించింది. కేంద్రం నుంచి తొలి దశ టీకా కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్‌ డోసులు అందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం నుంచి టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.


కాగా.. బుధవారం తాము ముంబై, పుణె, హైదరాబాద్‌ నుంచి 131 పెట్టెల్లో 3.5 టన్నుల వ్యాక్సిన్లను 11 నగరాలకు సరఫరా చేశామని స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించింది. మొత్తంగా 69,600 వయల్స్‌ను సరఫరా చేయనున్నట్టు గోఎయిర్‌ ప్రకటించగా.. వ్యాక్సిన్ల తరలింపులో కొత్తగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ కూడా చేరింది. బుధవారం పలు నగరాలకు తాము కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేసినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు బాక్సుల కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి, 16 బాక్సుల కొవిషీల్డ్‌ను విస్తారా విమానాలు ముంబై నుంచి వారణాసికి తరలించాయి. కాగా.. టీకాల కేటాయంపులో ఏ రాష్ట్రం పట్లా ఎలాంటి వివక్షా చూపలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సేకరించిన 1.65 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యసంరక్షణ సిబ్బంది డేటాబేస్‌ ఆధారంగా సరఫరా చేశామని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. టీకాలకు కొరత ఉందన్న వార్తలను తోసిపుచ్చింది. కాగా కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కొవాగిజన్‌కు ఉందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సమీరన్‌ పాండా పేర్కొన్నారు.

Updated Date - 2021-01-14T07:15:54+05:30 IST