మార్చి నాటికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-09-16T07:07:09+05:30 IST

‘‘వచ్చే ఏడాది మార్చినాటికి కరోనా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మార్చి నాటికి  వ్యాక్సిన్‌

అప్పటిదాకా అన్ని జాగ్రత్తలూ పాటించాల్సిందే

లక్షణాలు లేనివారు వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

ఒకసారి సోకితే ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం

వారు నిర్లక్ష్యంగా ఉంటే మరింతమందికి వైరస్‌!

‘ఆంధ్రజ్యోతి’తో డాక్టర్‌ కె. శ్రీనాథరెడ్డి


‘‘వచ్చే ఏడాది మార్చినాటికి కరోనా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కాబట్టి  మరి కొన్ని నెలల పాటు ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలూ పాటించాలి. లేకుంటే ప్రమాదం’’ అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సారథి డాక్టర్‌ కె. శ్రీనాథ్‌ రెడ్డి హెచ్చరించారు. ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం అధిపతిగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్ర సలహా సంఘ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన కరోనాపై ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు..


కరోనా వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా వచ్చే  అవకాశం ఉంది?

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం 160కి పైగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 26 సంస్థలుటీకాలను మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి. మ్యూకోజెల్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ఇంత విస్తృతంగా పరిశోధనలు జరగడం శుభపరిణామం. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ వస్తుందని చెబుతున్నా చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని మార్కెట్‌లోకి వచ్చేందుకు ఆ తరువాత మరో రెండు నెలలు పడుతుంది.


అంటే.. దాదాపు మార్చి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి రావడం ఎంత ప్రధానమో అది అవసర మైన వారందరికీ, ముఖ్యంగా అల్పాదాయ, పేద దేశాల ప్రజలకు కూడా చేరడం అంతకన్నా ముఖ్యం. అందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.


వ్యాక్సిన్‌ తయారీలో పోటీ ధోరణి కనిపిస్తోంది. అది వేరే ప్రమాదాలకు దారితీసే అవకాశం లేదా?

‘‘వ్యాక్సిన్‌ మేమే ముందు తయారు చేస్తాం’’ అనే ధోరణి మంచిదే. కానీ ‘‘మా ప్రమాణాలకు అనుగుణంగానే వ్యాక్సిన్‌ తయారు  చేసుకుంటాం’’ అనే ధోరణి మంచిది కాదు. ఉదాహరణకు.. రష్యా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేయకండానే తమ వ్యాక్సిన్‌ సురక్షితమని చెబుతోంది. మిత్ర దేశాలకు పంపిణీ చేసేందుకూ సిద్ధమవుతోంది.


కానీ.. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉ న్న సమస్య. అంతర్జాతీయ ప్రమాణాలు లేకుండా వ్యాక్సిన్‌ త యారు చేసి, పంపిణీ చేస్తే దాన్ని ఉపయోగించిన దేశాల ప్రజల నుంచి ఇతర దేశాలకు మళ్లీ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది.


రాజకీయ ఒత్తిడుల ప్రభావం వ్యాక్సిన్‌ నాణ్యతపై పడే అవకాశం ఉందంటారా?

రాజకీయాలు, వ్యాపారం వేరు, పరిశోధనలు వేరు. రాజకీయ, వాణిజ్య అవసరాల కోసం పరిశోధనల్లో రాజీపడే అవకాశం ఉందని నేను అనుకోను. శాస్త్రీయ  ప్రమాణాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ తయారు కాకపోతే అది మొత్తం మానవాళిపై దుష్ప్రభావం చూపుతుంది. కరోనా ప్రపంచానికి ఒక పాఠం నేర్పింది. ప్రపంచదే శాలన్నీ కలిసి పోరాడాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. మన ఆరోగ్య వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా చాటిచెప్పింది.


అందుకే ప్రపంచదేశాలన్నీ ఉమ్మడిగా కరోనాను కట్టడిచేసే వ్యాక్సిన్‌ కోసం కృషి చేయాలి. వ్యాక్సిన్‌ తయారయ్యాక.. అందరికీ సరిపోయే పరిమాణంలో ఉత్పత్తి చేయడం మొదట్లో సాధ్యం కాదు. ఆ సమయంలో వ్యాక్సిన్‌ కోసం పోటీ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో సంపన్న దే శాలు పేద దేశాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదముంది. అందుకే.. అల్పాదాయ, పేద దేశాల ప్రజలు నష్టపోకుండా వ్యాక్సిన్‌ సమా ఖ్య గావితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి ప్రారంభించాయి. 




కరోనా లక్షణాలు లేని కేసులు పెరుగుతున్నాయి కదా.. వాటి ప్రభావం ఎలా ఉండొచ్చు?

గతంలో పోల్చితే ఇప్పుడు వైరస్‌ ఉప్పెనలా దాడి చేయట్లేదు. అది క్రమంగా తన స్వభావాన్ని మార్చుకుంటున్నది. పాజిటివ్‌ వచ్చిన చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడానికి ఇదో కారణం. అయితే.. ‘లక్షణాలు లేవు కదా? అదే వచ్చి పోతుందిలే’ అనే ఽఉదాసీన దోరణి ప్రమాదకరం.


జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్దేశించిన సమయం ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో వారి నుంచి వేరేవారికి సోకి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. లక్షణాలు కనిపించకున్నా ఒకసారి వైరస్‌ ప్రవేశిస్తే గుండె, ఊపిరితిత్తులపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. 


కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరగడానికి కారణం?

లాక్‌డౌన్‌ సడలింపు తరువాత జీవనం సాధారణ స్థాయికి చేరింది. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించకపోవడమే కేసులు పెరగడానికి కారణం. భారత్‌లోనే కాదు ఇటలీ, బ్రిటన్‌లలో కూ డా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. వైరస్‌ అంతమయ్యే వరకూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది.

- స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-09-16T07:07:09+05:30 IST