ఆరోగ్యశాఖకు టీకా సవాల్‌!

ABN , First Publish Date - 2021-01-07T08:30:35+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆరోగ్యశాఖకు సవాలుగా మారనుంది. ఇప్పటి వరకూ కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా స్టీరింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్సులు, స్టోరేజీ సెంటర్ల సామర్థ్యం పెంపు వంటి వాటిపైనే దృష్టిపెట్టింది.

ఆరోగ్యశాఖకు టీకా సవాల్‌!

  • వ్యాక్సిన్‌ క్యారియర్లకు తీవ్ర కొరత 
  • సిద్ధంగా లేని సరఫరా వాహనాలు
  • ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు
  • హడావుడిగా టెండర్లు పిలిచే యోచన
  • 10వేల బాక్సుల కొనుగోలుకు ఏర్పాట్లు 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆరోగ్యశాఖకు సవాలుగా మారనుంది. ఇప్పటి వరకూ కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా స్టీరింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్సులు, స్టోరేజీ సెంటర్ల సామర్థ్యం పెంపు వంటి వాటిపైనే దృష్టిపెట్టింది. మరో పది రోజుల్లో అన్ని రాష్ట్రాలకు టీకాను పంపిణీ చేస్తామని ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్‌ నిల్వ కోసం కోల్డ్‌లైన్‌, ఐస్‌ బాక్స్‌లు, ఫ్రీజర్లు, వ్యాక్సిన్‌ క్యారియర్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ వీటిపై దృష్టి సారించని ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు తీరిగ్గా కళ్లు తెరిచారు. కేంద్రం అందించే మొత్తం డోస్‌లు తొలుత కృష్ణాజిల్లా గన్నవరంలోని రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ సెంటర్‌కు సరఫరా అవుతాయి. అక్కడినుంచి విశాఖ, గుంటూరు, కర్నూలు, కడపలోని రీజినల్‌ వ్యాక్సిన్‌ సెంటర్లకు తరలించాలి. దీనికోసం వ్యాక్సిన్‌ను 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి. అదే స్థితిలో రీజినల్‌ సెంటర్లకు తరలించాలి.


దీనికి అనుగుణంగా లారీలు, వ్యాన్లు అందుబాటులో లేవు. కేంద్రం సూచనల తర్వాత ఆరోగ్యశాఖ హడావుడిగా ఇప్పుడు దీనిపై కసరత్తు ప్రారంభించింది. ప్రైవేట్‌ వాహనాలు అద్దెకు తీసుకొని వ్యాక్సిన్‌ను జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. కానీ, ఈ విధమైన వాహనాలు అక్కడ కూడా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వ్యాక్సిన్‌ క్యారియర్‌ బాక్స్‌లు కూడా ఆరోగ్యశాఖ వద్ద పూర్తిస్థాయిలో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు, ఏఎన్‌ఎంల కోసం 10వేల బాక్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉండటంతో వాటికి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో టెండర్లకు వెళ్లాలని భావిస్తున్నారు. 


17 తర్వాతే టీకా? 

రాష్ట్రంలో ఈ నెల 17 తర్వాతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ అందించినా వెంటనే ప్రక్రియ ప్రారంభించే పరిస్థితి లేదు. రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్‌ సెంటర్లకు, అక్కడ నుంచి రీజినల్‌ సెంటర్లకు, ఆ తర్వాత జిల్లాలకు సరఫరా చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. మరోవైపు జనవరి 17న దేశ వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది. దీనిలో భాగంగా ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తాన్ని సన్నద్ధం చేసి, వారినే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో అధికారులున్నారు. మరోవైపు రాష్ట్రం లో హెల్త్‌ కేర్‌ వర్కర్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయినా ఫ్రం ట్‌లైన్‌ వర్కర్ల నమోదు ఇంకా ప్రారంభం కాలేదు.

Updated Date - 2021-01-07T08:30:35+05:30 IST