వృథా చేస్తే కోతే!

ABN , First Publish Date - 2021-06-09T07:28:02+05:30 IST

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు,

వృథా చేస్తే కోతే!

రాష్ట్రాలకు టీకాల పంపిణీకి ప్రాతిపదికలివే..

అందరూ ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకోవచ్చు

డబ్బు చెల్లించగలిగేవారు ప్రైవేటుకు వెళ్లొచ్చు

ప్రైవేటు ఆస్పత్రులకు సంస్థలే ధరలు నిర్ణయిస్తాయి

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

21 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడి

కొవిషీల్డ్‌ రూ.780.. కొవాగ్జిన్‌ రూ.1410

ప్రైవేటులో టీకా డోసుల గరిష్ఠ ధరల ఖరారు


న్యూఢిల్లీ, జూన్‌ 8: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా టీకాలు సరఫరా చేస్తామన్న కేంద్రం.. అందుకు కొన్ని ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రాల జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌ పురోగతినిబట్టి టీకాలను కేటాయిస్తామని వెల్లడించింది. టీకాల వృథాను కూడా లెక్కలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వృథా ఎక్కువగా ఉంటే కేటాయింపుల్లో కోత పెడతామని పరోక్షంగా హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తుందని తెలిపింది.


వ్యాక్సిన్‌ సరఫరా ఆధారంగా ఆయా రాష్ట్రాలే 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యాలను నిర్ణయించుకొని వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని పేర్కొంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేలా తయారీదారులను ప్రోత్సహించేందుకే నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలను విక్రయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. అయితే నెలవారీ ఉత్పత్తయ్యే టీకాల్లో 25 శాతం మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా వేయించుకునే వారు చెల్లింపుల కోసం బదిలీకి వీల్లేని(నాన్‌ ట్రాన్స్‌ఫరబుల్‌) ఎలకా్ట్రనిక్‌ ఓచర్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.


ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల ధరలను టీకాల ఉత్పత్తి సంస్థలే ఖరారు చేస్తాయంది. ధరల్లో ఏమైనా మార్పులుంటే ముందుగానే తెలియజేయాలని సూచించింది. తమ ఆదాయాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఉచిత టీకాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. డబ్బు చెల్లించే స్థోమత ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొచ్చని తెలిపింది. కొవిన్‌ పోర్టల్‌లో ఎవరైనా ముందుగానే వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్లను బుక్‌ చేసుకోవచ్చని.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించింది. కాల్‌సెంటర్లు, కామన్‌ సర్వీసు సెంటర్ల ద్వారా కూడా వ్యా క్సిన్‌ కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని రాష్ట్రాలకు తెలిపింది. తాజా మార్గదర్శకాలు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. వ్యాక్సిన్లను వృథా చేయొద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. గత నెలలో జార్ఖండ్‌ 37 శాతం, ఛత్తీస్‌గఢ్‌ 30 శాతం, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో 11ు డోసులు వృథా అయినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్రం లెక్కలు సరికాదని, తమ వద్ద వ్యాక్సిన్ల వృథా 5ు లోపేనని ఆ మూడు రాష్ట్రాలు తెలిపాయి. 



44 కోట్ల టీకాల కొనుగోలు

కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. మంగళవారం పుణేలోని సీరం సంస్థకు 25 కోట్ల కొవిషీల్డ్‌ డోసులు, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థకు 19 కోట్ల కొవాగ్జిన్‌ డోసుల ఆర్డర్‌ ఇచ్చింది. 


ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ అసాధ్యం

దివ్యాంగులు, మంచానికి పరిమితమైన రోగులు, చక్రాల కుర్చీలో తిరిగేవారు, వృద్ధులకు ఇళ్లకే వెళ్లి టీకాలు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ అసాధ్యమని జాతీయ నిపుణుల బృందం కూడా తేల్చిందని కేంద్రం తెలిపింది. టీకా కేంద్రాలకు రాలేని వారికి, వారి ఇళ్ల సమీపంలో వ్యాక్సినేషన్‌ చేపట్టవచ్చని పేర్కొంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులతో కలిసి రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ)లు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 


వేయాన్‌.. వంద శాతం వ్యాక్సినేషన్‌

జమ్ముకశ్మీర్‌లోని బందిపొరా జిల్లా కేంద్రానికి 28 కి.మీ. దూరంలో ఉన్న వేయాన్‌.. కొండలు, గుట్టల్లోని ఒక హామ్లెట్‌ గ్రామం. వెళ్లాలంటే 18 కిలోమీటర్లు కాలినడకే శరణ్యం. అక్కడి ప్రజలంతా సంచార జాతుల వారే. ఇంటర్నెట్‌ కూడా సరిగా లేదు! అయినా దేశంలో 100ు వ్యాక్సినేషన్‌ పూర్తయిన తొలి గ్రామంగా నిలిచింది. ఈ ఊరిలోని 362 మంది అర్హులకూ కరోనా టీకా పంపిణీ పూర్తయింది. ఆరోగ్య శాఖ అధికారుల చొరవతో ఇది సాధ్యమైంది. మేత కోసం పశు సంపదను తోలుకుని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే స్థానికులను గుర్తించి వ్యాక్సిన్‌ ఇవ్వడం వ్యాక్సినేషన్‌ ఆరోగ్య కార్యకర్తలకు పెద్ద సవాల్‌గా మారింది. వివరాల నమోదుకు ఇంటర్నెట్‌ సౌకర్యం కొరవడినా శ్రమించి దాన్ని అధిగమించారు.


‘ప్రైవేటు’ టీకాల గరిష్ఠ ధరల ఖరారు

ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా డోసులకు గరిష్ఠ ధరలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. దేశ వ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌, వచ్చే దీపావళి వరకు ఉచిత రేషన్‌ ఇస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వంపై అదనంగా రూ.1.45 లక్షల కోట్ల భారం పడనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రకటిచింనట్లుగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలంటే రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుంది. వ్యాక్సినేషన్‌ కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిన రూ.35 వేల కోట్ల కన్నా ఇది చాలా ఎక్కువ కానుంది.


ఇక దేశంలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకు నవంబరు వరకు ఇస్తామన్న ఉచిత రేషన్‌కు రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ.1.13 లక్షల కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటికి కలిపి సుమారు రూ.1.45 లక్షల కోట్లు అదనంగా ఖర్చు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం వద్ద ఇందుకు సరిపడా నిధులు ఉ న్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది. ఉచిత వ్యాక్సిన్‌, రేషన్‌ అందించేందుకు ఈ ఆదాయం సరిపోయే అవకాశం ఉంది. కాగా, వ్యాక్సిన్లను ప్రభుత్వం ఎ క్కడి నుంచి కొనుగోలు చేస్తుందన్న విషయంపై మాత్రం ఆ వర్గా లు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తు తం సీరం సంస్థ, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన టీకాలతోపాటు రష్యా టీకా స్పుత్నిక్‌ వినియోగానికి అనుమతి ఉంది. ఇతర విదేశీ టీకా సంస్థలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా.. ఫైజర్‌, మోడెర్నా వంటి టీకా సంస్థలతో పలు కారణాలతో అవి ముందుకు సాగడంలేదు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ నుంచి 30 కోట్ల డోసులను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం గతవారమే ప్రకటించింది.


కాగా.. ఉచిత వ్యాక్సినేషన్‌కు తగినన్ని నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఇప్పుటికిప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్లు అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేటు రంగానికి 25% వ్యాక్సి న్‌ రిజర్వేషన్‌ను ఉపసంహరించుకోవాలని వామపక్షాలు కోరాయి. ఇక, ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న కొత్త రకం వేరియంట్ల నుంచి రక్షణకు వ్యాక్సినేషనే పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మైఖేల్‌ ర్యాన్‌ వ్యాఖ్యానించారు. కనీసం 80ు వ్యాక్సినేషన్‌ ద్వారా మాత్రమే బయటపడగలమన్నారు. కాగా, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) ఒక్కొక్క పోలియో వ్యాక్సిన్‌ డోస్‌కు రూ.188 కోట్‌ చేసింది. ఇది గతంలోని రూ.91 కంటే చాలా ఎక్కువ.




Updated Date - 2021-06-09T07:28:02+05:30 IST