రేపు లక్షమందికి వ్యాక్సిన్‌: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-19T06:06:35+05:30 IST

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం లక్ష డోసుల కొవిషీల్డ్‌, కొవాక్సిన్‌ వ్యాక్సిన్లు వేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు.

రేపు లక్షమందికి వ్యాక్సిన్‌: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 18: జిల్లా వ్యాప్తంగా ఆదివారం లక్ష డోసుల కొవిషీల్డ్‌, కొవాక్సిన్‌ వ్యాక్సిన్లు వేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కమిషనర్లతో టెలి  కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన , ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులుగా ఉండి ఇంకా వ్యాక్సిన్‌ వేసుకోని వారి జాబితాను 24 గంటల్లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. లక్ష డోసుల వ్యాక్సినేషన్‌ గురించి అర్హులందరికీ వివరించి టీకా వేసుకునేలా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఎంఅండ్‌ హెచ్‌వో శ్రీహరి, డీపీవో దశరథరామిరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో శ్రీహరి తన కార్యాలయం నుంచి వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆదివారం 7గంటల నుంచి వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టి సాయంత్రం వరకు కొనసాగించాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. 




ఇంత చేస్తున్నా పాజిటివ్‌ కేసుల పెరుగుదలా? 


కొవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా కొన్ని మండలాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. పుత్తూరు అర్బన్‌, రూరల్‌, ఐరాల, ములకలచెరువు, వరదయ్యపాళెం, నాగలాపురం, గంగవరం, బంగారుపాళ్యం, పాలసముద్రం, పలమనేరు అర ్బన్‌, రూరల్‌, తవణంపల్లె మండలాల్లో అత్యధిక కేసులు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులు కంటైన్మెంట్‌ జోన్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. పలమనేరులో అత్యధిక కేసులు ఉండటం వల్ల, హోం ఐసోలేషన్‌లోని వారినీ కొవిడ్‌ సెంటర్లకు తరలించాలని సూచించారు. కేసుల నియంత్రణలో అలక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. జేసీ వీరబ్రహ్మం, డీఎంహెచ్‌వో శ్రీహరి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు.


ఇక రాత్రి మాత్రమే కర్ఫ్యూ


21 నుంచీ నెలాఖరు దాకా


చిత్తూరు కలెక్టరేట్‌: కర్ఫ్యూ వేళలను సడలిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు కొనసాగుతోంది. సోమవారం నుంచి ఈ సడలింపును సాయంత్రం 6గంటల వరకు పొడిగించారు. నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకల్లా మూసివేయాలని అధికారులు స్పష్టంచేశశరు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మాత్రం సాధారణ సమయాల్లోనే పనిచేస్తాయి. జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ఈ నిబంధనలను సడలించింది.


చిత్తూరులో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ప్రారంభం


చిత్తూరు రూరల్‌: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ప్రారంభమైంది. ఇక్కడ బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స చేసే వైద్య నిపుణలు అందుబాటులో ఉన్నప్పటికీ మందులు, పరికరాలు లేకపోవడంలో అనుమానిత కేసులను తిరుపతి రుయాకు రెఫర్‌ చేస్తూ వచ్చారు. చిత్తూరులోనూ బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స చేయాలన్న కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాలతో ఇక్కడి ప్రత్యేక వార్డులో 15 బెడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకున్నారు. మందులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, శుక్రవారం బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత వ్యక్తిని అడ్మిట్‌ చేసుకున్నారు. సీటీ స్కానింగ్‌ ఆధారంగా అడ్మిట్‌ చేసుకున్నామని, బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణకు మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని బెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

Updated Date - 2021-06-19T06:06:35+05:30 IST