16 నుంచి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-10T07:18:49+05:30 IST

యావత్‌ భారతదేశం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కరోనా టీకా కార్యక్రమం జనవరి 16న ప్రారంభమవనుంది. దేశంలో కరోనా వ్యాప్తి స్థితిగతులపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన

16 నుంచి వ్యాక్సిన్‌

  • ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన సమావేశంలో నిర్ణయం
  • ఇది చరిత్రాత్మకం
  • ప్రపంచం చూపు.. మన వైపే 
  • భారత్‌ టీకాలపైనే దేశాలన్నీఆశలు పెట్టుకున్నాయి: ప్రధాని
  • చౌక, సురక్షిత టీకాలు అందిస్తాం: కేంద్ర ఆరోగ్యశా


కొవిడ్‌-19పై పోరులో భాగంగా భారత్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. సాహసోపేతంగా సేవలు అందించిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, సఫాయి కార్మికులు సహా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అందరికీ ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం దక్కుతుంది.

- ప్రధాని మోదీ ట్వీట్‌


న్యూఢిల్లీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): యావత్‌ భారతదేశం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కరోనా టీకా కార్యక్రమం జనవరి 16న ప్రారంభమవనుంది. దేశంలో కరోనా వ్యాప్తి స్థితిగతులపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈనెల రెండోవారంలో జరగనున్న లోహ్రి, మకర సంక్రాంతి, పొంగల్‌, మాఘ్‌ బిహు మొదలైన పర్వదినాలు పూర్తయిన వెంటనే టీకా పంపిణీకి శ్రీకారం చుట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. టీకా కార్యక్రమం కోసం  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతపైనా సమీక్షించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


దేశవ్యాప్తంగా 3 విడతల్లో డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించినందు కు ప్రధాని ప్రశంసించారని పేర్కొంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన 16వ ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ ప్రారంభోత్సవ ప్రసంగంలోనూ ఆయన టీకా కార్యక్రమం గురిం చి ప్రధానంగా ప్రస్తావించారు. అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను భారత్‌ ఎలా చేపట్టబోతుందో చూడటానికి యావత్‌ ప్రపంచం సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచ ఫార్మసీగా వెలుగొందుతున్న భారత్‌లో అభివృద్ధి చేసిన కరోనా టీకాల కోసం దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయన్నారు. రెండు(కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌) మేడ్‌ ఇన్‌ ఇండియా కరోనా వ్యాక్సిన్లతో మానవత్వ పరిరక్షణకు నడుం బిగించినట్లు తెలిపారు. 




ప్రవాసులూ.. ‘బ్రాండ్‌ ఇండియా’కు దన్నుగా నిలవండి

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘పీఎం-కేర్స్‌’ నిధికి విరాళాల ద్వారా చేయూత అందించిన ప్రవాస భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మేడ్‌ ఇన్‌ ఇండియా వస్తువులను సాధ్యమైనంత ఎక్కువగా వాడాలని వారిని కోరారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణం దిశగా తాము వేస్తున్న అడుగులకు అండగా నిలవాలని, ‘బ్రాండ్‌ ఇండియా’కు దన్నుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


దేశం వినిపించిన ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్‌’ నినాదం ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతోందన్నారు. కాగా, భారత్‌ కేంద్రంగా యావత్‌ ప్రపంచానికి చౌక, సురక్షిత, ప్రభావశీలమైన టీకాలు అందాలనే కృత నిశ్చయానికి కట్టుబడి ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కోసం ‘కొవిన్‌’ డిజిటల్‌ ప్లాట్‌ఫాం సిద్ధంగా ఉందన్నారు. 


Updated Date - 2021-01-10T07:18:49+05:30 IST