నేటి నుంచే టీకా

ABN , First Publish Date - 2021-01-16T08:36:51+05:30 IST

దాదాపు ఏడాదిగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై సిసలైన పోరాటం శనివారం ప్రారంభం కానుంది! సంక్రాంతి పండుగ అయిపోగానే.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా

నేటి నుంచే టీకా

రాష్ట్రంలో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా

కొవిన్‌లో నమోదు చేసుకున్నవారు 3.15 లక్షల మంది

దుష్ప్రభావాలు కనిపించిన వారి చికిత్సకు 57 ఆస్పత్రులు

టీకా కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన వైద్య శాఖ

గాంధీలో టీకా తీసుకోనున్న మంత్రి ఈటల రాజేందర్‌

నార్సింగ్‌, గాంధీ పారిశుధ్య కార్మికులతో మోదీ మాటామంతి

లబ్ధిదారులకు సందేశాలు.. టీకా తీసుకుంటే వేలిపై సిరా

నిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై

తిలక్‌నగర్‌లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేటీఆర్‌

భయాందోళనలు వద్దు.. నేనూ టీకా తీసుకుంటా: ఈటల


హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఏడాదిగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై సిసలైన పోరాటం శనివారం ప్రారంభం కానుంది! సంక్రాంతి పండుగ అయిపోగానే.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా పండుగ మొదలవుతోంది!! శనివారం ఉదయం 10.30 గంటలకు దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగతా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత 139 కేంద్రాల్లోనే టీకా కార్యక్రమం నిర్వహిద్దామని ప్రభుత్వం అనుకున్నప్పటికీ.. నిమ్స్‌లో కూడా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య 140కి పెరిగింది.


కాగా, ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. దుష్ప్రభావాలు కలిగితే చికిత్స చేయడానికి వ్యాక్సిన్‌ కేంద్రంలో అందుబాటులో వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ఇక.. అన్ని కేంద్రాల్లో తొలి రోజు వ్యాక్సిన్‌ తీసుకునే 30 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వారి సెల్‌ ఫోన్‌లకు శుక్రవారమే వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మేసేజ్‌లు వెళ్లాయి. గాంధీలో టీకా తీసుకునే 30 మంది లబ్ధిదారుల్లో 50 శాతం పారిశుధ్య కార్మికులు, 25 శాతం పారామెడికల్‌ సిబ్బంది, మరో 25 శాతం వైద్య సిబ్బంది ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, తొలి రోజు 30 మంది కూడా టీకా తీసుకునేందుకు రాకపోవచ్చన్న ఉద్దేశంతో.. వైద్యశాఖ ముందుజాగ్రత్తచర్యలు తీసుకుంది. కచ్చితంగా వచ్చి టీకాలు తీసుకుంటామనే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలంటూ శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాలకూ సమాచారం ఇచ్చింది. అలా వచ్చిన జాబితాల్లోని వారికే శుక్రవారం మేసేజ్‌లు పంపారు. ఇక.. గాంధీ ఆస్పత్రిలో వైద్య మంత్రి ఈటల రాజేందర్‌, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తొలి రోజు కొవిడ్‌ టీకా తీసుకోనున్నారు. నార్సింగ్‌, గాంధీ ఆస్పత్రుల్లో టీకా తీసుకునే పారిశుధ్య కార్మికులతో ప్రధాని మోదీ వర్చువల్‌ మోడ్‌లో మాట్లాడనున్నారు. మిగిలిన 138 కేంద్రాల్లో ప్రధాని ప్రసంగాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. 


ఇవీ లెక్కలు..

రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో తొలి రోజు టీకా కార్యక్రమం ప్రారంభం.

టీకా కోసం నమోదు చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది.. 3.15 లక్షల మంది.

తొలి రోజు ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4200 మందికి శనివారం టీకా.

రాష్ట్రానికి చేరుకున్న టీకా డోసులు.. 3.84 లక్షలు( కొవిషీల్డ్‌ 3.64, కొవాగ్జిన్‌ 20 వేల డోసులు)

జిల్లాలకు 55,270 డోసుల పంపిణీ

మొదటి వారంలో 55,270 మంది వైద్య సిబ్బందికి టీకా

రాష్ట్రవ్యాప్తంగా 866 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌

5 కోట్ల డోసులు నిల్వ చేసే విధంగా కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యవస్థ (హైదరాబాద్‌లో 3, జిల్లాల్లో 2 కోట్లు)

దశలవారీగా మొత్తం 1213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

టీకా కేంద్రంలో అంబులెన్స్‌, 14 రకాల మెడిసిన్స్‌తో ఎమర్జెన్సీ కిట్లు

టీకా తీసుకున్న తర్వాత దుష్ఫ్రభావానికి గురైతే చికిత్స అందించేందుకు 57 ప్రభుత్వ ఆస్పత్రులు గుర్తింపు. వాటిల్లో 10 పడకల ఏర్పాటు( ఆక్సిజన్‌, అత్యవసర మందులతో కలిపి).


  టీకా ఇలా వేస్తారు.. 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే రోజు రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలకు టీకాలు వేసే ప్రక్రియ సాగుతుందిలా..  

నిర్దేశిత సమయానికి టీకా కేంద్రానికి చేరుకోవాలి. 

తొలుత కొవిన్‌ పోర్టల్‌లో లబ్ధిదారుడి పేరు నమోదై ఉందో లేదో పరిశీలిస్తారు. 

మొదటి వెయిటింగ్‌ హాల్‌కు పంపించి, ఒక్కొక్కరిని భౌతికదూరం ఉండేలా కూర్చోబెడతారు. 

టీకా కోసం వచ్చిన వారు తమ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను చెబుతుంటే డాటా ఎంట్రీ ఆపరేటర్‌  ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తారు. 

లబ్ధిదారుడిని వ్యాక్సిన్‌ ఇచ్చే గదిలోకి పంపిస్తారు. పీపీఈ కిట్లు ధరించిన వైద్యుడు, ఏఎన్‌ఎం అతని వివరాలను మరోమారు పరిశీలించి టీకా ఇస్తారు.  

అనంతరం పర్యవేక్షణ గదిలో అరగంట కూర్చోవాలి. 

వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యనిపుణులు పర్యవేక్షిస్తుంటారు. 

టీకా వేసుకున్న వ్యక్తికి తలనొప్పి, జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. 

ఆరోగ్య సమస్యలు తలెత్తకుంటే అబ్జర్వేషన్‌ సమయం ముగియగానే ఇంటికి పంపుతారు. 

టీకా కేంద్రంలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉంటాయి. 

Updated Date - 2021-01-16T08:36:51+05:30 IST