కరోనాపై వ్యాక్సిన్‌ వేటు!

ABN , First Publish Date - 2021-03-16T05:30:00+05:30 IST

ప్రతి వంద మందిలో 80 మందికి కరోనా వ్యాక్సిన్‌ పట్ల అనుమానాలు ఉంటున్నాయి! ఇందుకు కారణం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న అనధికారిక సమాచారమే! వాట్సా్‌పల ద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన నిరాధారమైన వార్తలెన్నో ప్రజల్లో

కరోనాపై వ్యాక్సిన్‌ వేటు!

  • కరోనా వ్యాక్సిన్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాం!
  • తీరా టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత వేయించుకోవడానికి వెనకాడుతున్నాం!
  • ఇందుకు కారణం వ్యాక్సిన్‌ పట్ల ప్రబలిన అర్థం లేని అపోహలు, భయాలే!
  • ‘కరోనా అంతమవ్వాలంటే టీకా గురించిన భయాలను వదిలేసి ప్రతి ఒక్కరూ  వ్యాక్సిన్‌ వేయించుకోవాలి ’ అంటున్నారు వైద్యనిపుణులు.


ప్రతి వంద మందిలో 80 మందికి కరోనా వ్యాక్సిన్‌ పట్ల అనుమానాలు ఉంటున్నాయి! ఇందుకు కారణం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న అనధికారిక సమాచారమే! వాట్సా్‌పల ద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన నిరాధారమైన వార్తలెన్నో ప్రజల్లో విస్తరించాయి. వీటికి అదనపు వదంతులు తోడై వ్యాక్సిన్‌ ప్రయోజనాల కన్నా దుష్ప్రభావాలే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనది వ్యాక్సిన్‌ వల్ల తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌! 


ఎలాంటి దుష్ప్రభావాలు?

ఎటువంటి టీకా వేయించుకున్నా లోకల్‌ రియాక్షన్‌, సిస్టమిక్‌ రియాక్షన్‌ అనే రెండు పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. 

లోకల్‌ రియాక్షన్‌: టీకా వేయించుకున్న ప్రదేశంలో వాపు, నొప్పి, జ్వరం వంటి తాత్కాలిక లక్షణాలు తలెత్తడం అత్యంత సహజం. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు కూడా  ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే  వంద మందిలో ఆరుగురిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించే వీలుంది.

సిస్టమిక్‌ రియాక్షన్‌: టీకా రక్తంలో కలవడం ద్వారా తలెత్తే రియాక్షన్‌ ఇది. టీకా అనేది ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ కాబట్టి, రక్తంలోకి వెళ్లిన తర్వాత కొందరిలో జ్వరం, మరికొందరిలో జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అరుదుగా లక్షలో ఒకరిని నాలుగైదు రోజుల పాటు జ్వరం, ఇన్‌ఫెక్షన్‌ వేధిస్తాయి. అయితే అత్యంత అరుదుగా కొంతమందికి టీకాతో ఎనాఫిలిటిక్‌ రియాక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అదే వ్యాక్సిన్‌ రియాక్షన్‌. ఎవరికైతే బాల్యంలో వ్యాక్సిన్‌తో రియాక్షన్‌ తలెత్తిన అనుభవం ఉందో, అలాంటివాళ్లకు మాత్రమే కొవిడ్‌ వ్యాక్సీన్‌తో కూడా రియాక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివాళ్లు తమకున్న వ్యాక్సిన్‌ రియాక్షన్‌ (వ్యాక్సీన్‌ అలర్జీ) తత్వం గురించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


ఇవి కూడా అపోహలే!

ఎలర్జీలు ఉంటే: వ్యాక్సిన్‌తో కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, పూర్వం టీకాతో రియాక్షన్‌కు గురైన వాళ్లు ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. అయితే ఆ విషయం ‘ఎలర్జీ ఉన్న ఏ ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోకూడదు’ అన్నట్టుగా ప్రచారం జరిగింది. దాంతో డస్ట్‌ ఎలర్జీ, దురదలు, ఆస్తమా... ఇతరత్రా ఎలర్జీలు ఉన్నవాళ్లందరూ వ్యాక్సిన్లకు దూరంగా ఉండిపోయారు. నిజానికి వ్యాక్సిన్‌ ఎలర్జీ మినహా, ఎటువంటి ఎలర్జీలు ఉన్నవాళ్లైనా నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 


రక్తం పలుచనయ్యే మందులు వాడుతూ ఉంటే: రక్తం గడ్డకట్టే తత్వం కలిగి ఉండే యాంటీ కాగ్యులెంట్‌ గ్రూప్‌నకు చెందినవాళ్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకుంటే ఐఎన్‌ఆర్‌ టెస్ట్‌ (ఇంటర్నేషనల్‌ నార్మలైజ్‌డ్‌ రేషియో) చేయించుకోవాలి. ఫలితం మూడు కన్నా తక్కువ ఉంటే టీకా వేయించుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ తీసుకుంటే, టీకా ఇచ్చిన చోట రక్తస్రావం జరుగుతుంది. ఇందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు టీకా ఇస్తారు. అంతేతప్ప ఇలాంటివాళ్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రాణాంతకం కాదు. కొవిడ్‌ సోకిన సమయంలో రక్తం గడ్డకట్టకుండా మందులు వాడుతున్నవాళ్లు, థ్రాంబోసిస్‌, పల్మొనరీ ఎంబాలిజం సమస్య ఉన్నవాళ్లు (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన వాళ్లు) ఈ కోవలోకి వస్తారు. 


ఇలా యాంటీ థ్రాంబోటిక్‌ కోవకు చెందినవాళ్లు పది లక్షల మందిలో ఒకరు ఉంటారు. వీళ్లు వ్యాక్సిన్‌ తీసుకునే ముందు తమ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు తెలియపరచాలి. వీళ్లకు ప్రత్యేక జాగ్రత్తలతో టీకా ఇస్తారు. అయితే ఈ కోవకు చెందిన వారి గురించి వైద్యుల చేసిన హెచ్చరికలు కూడా తప్పుదోవ పట్టి, రక్తం పలుచనయ్యే ఇతరత్రా మందులు వాడే గుండె జబ్బులు ఉన్నవాళ్లందరూ కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండిపోయారు. నిజానికి వీళ్లు నిరభ్యంతరంగా టీకా వేయించుకోవచ్చు. 12 ఏళ్ల కన్నా చిన్న పిల్లలు, గర్భిణులు తప్ప ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.


రెండు డోసులు ఎందుకు?

ఏ వ్యాక్సిన్‌ అయినా శరీరంలో యాంటీబాడీలను తయారుచేస్తుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను నాలుగు వారాల వ్యవధితో రెండు డోసుల్లో తీసుకోవడానికి కారణం వ్యాధినిరోధకశక్తిని పెంచేలా బలవంతమైన యాంటీబాడీల తయారీ కోసమే! రెండు దఫాల టీకాలతో రెండు రకాల యాంటీబాడీలు శరీరంలో తయారవుతాయి. మొదటి టీకాతో ఐజిఎమ్‌ (ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఎమ్‌), రెండో దఫా డోసుతో ఐజిజి (ఇమ్యునోగ్లోబ్యులిన్‌ జి) తయారవుతాయి. రెండో రకం ఐజిజి సరిపడా స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే కరోనా నుంచి పూర్తి రక్షణ దక్కుతుంది. ఇందుకు బూస్టర్‌ డోసు తీసుకున్న తర్వాత నాలుగు వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐజిఎమ్‌ నుంచి ఐజిజి తరహా యాంటీబాడీలు ఉత్పత్తయ్యే నాలుగు వారాల వ్యవధిలో, అలాగే బూస్టర్‌ డోస్‌ తీసుకున్న నాలుగు వారాల లోపు ఎప్పుడైనా కరోనా సోకే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యవధి... అంటే మొదటి డోసుతో పాటు, బూస్టర్‌ డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత (మొదటి టీకా తీసుకున్న ఎనిమిది వారాల తర్వాత) కరోనా వైరస్‌ నుంచి సంపూర్ణ రక్షణ దక్కుతుంది. ఐజిజి యాంటీబాడీలు శరీరంలో ఉన్నంతకాలం కరోనా సోకినా, వైరస్‌ అంతమవుతుందే తప్ప ఆరోగ్యం పాడవదు. 


రక్షణ ఎంతకాలం?

టీకా ఈమధ్యనే అందుబాటులోకి వచ్చింది కాబట్టి రక్షణ ఎంతకాలం వరకూ ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే కొవిడ్‌ టీకాతో ఆరు నెలల పాటు కనీస రక్షణ దక్కుతుందని చెప్పవచ్చు. ఉదాహరణకు హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ఫ్లూ) వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ ఇస్తూ ఉంటాం. ఈ టీకాకు కూడా ఇదే విధానాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ప్రతి ఏడాదీ కొవిడ్‌ టీకా వేయించుకోవడం అన్నివిధాలా సురక్షితం!


నిరంతర రక్షణ కోసమే..

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత కూడా ఫేస్‌ మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.   యాంటీబాడీల జీవితకాల వ్యవధి గురించి స్పష్టమైన సమాచారం లేదు కాబట్టి, ఈ జాగ్రత్తలు మున్ముందు కూడా కొనసాగించాలి.


పిల్లలకు వ్యాక్సిన్‌?

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు వ్యాధినిరోధకశక్తి పిల్లల్లో ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టం. వ్యాక్సిన్‌తో విపరీతమైన దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టే పిల్లల కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను తయారుచేస్తారు. ఎక్కువ శాతం దేశాల్లో పిల్లల మీద కొత్త మందుల ప్రభావాన్ని కనిపెట్టే పరీక్షలకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలవుతూ ఉంటాయి. అయితే మున్ముందు పిల్లల కోసం ఉద్దేశించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ 11 ఏళ్ల కంటే పెద్ద పిల్లలకు, ఫలితాలను బట్టి ఆ తర్వాత 6 ఏళ్ల కంటే పెద్ద పిల్లలకు, తర్వాత పసిపిల్లలకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారుచేసిన ఫైజర్‌ కంపెనీ ఇప్పటికే ఈ దిశగా ప్రయోగాలు చేపట్టింది. 


రెండూ సమర్థమైనవే!

కొవ్యాక్సిన్‌, కొవిషీల్డ్‌... రెండు వ్యాక్సిన్లు సమానమైన సామర్థ్యం కలిగినవే! రెండింటితో కొవిడ్‌ నుంచి 70ు కన్నా ఎక్కువ రక్షణ లభిస్తుంది. కాబట్టి వ్యాక్సిన్‌ ఎంపిక విషయంలో గందరగోళానికి గురవవలసిన అవసరం లేదు.


వీళ్లు టీకా తీసుకోవచ్చు!

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వాళ్లు, కోమార్బిడ్‌ కోవకు చెందిన 45 ఏళ్లు పైబడిన వ్యక్తులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.


వీళ్లు వేయించుకోకూడదు!

కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నవాళ్లు టీకా వేయించుకోకూడదు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత వారి శరీరంలో తయారైన యాంటీబాడీల మోతాదును పరీక్షించుకోవాలి. యాంటీబాడీ టెస్ట్‌ ఫలితంలో వారిలో సరిపడా యాంటీబాడీలు తయారుకాలేదని తేలినప్పుడు మాత్రమే, టీకా తీసుకోవలసి ఉంటుంది. 


హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రధానం!

వ్యాక్సిన్‌ సామర్థ్యం 74%! నూటికి నూరు శాతం రక్షణ దక్కాలంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం ఒక్కటే మార్గం. 60 - 70 శాతం ప్రజల్లో యాంటీబాడీలు తయారుకాగలిగితే, నూరు శాతం మందికీ రక్షణ దక్కినట్టే! కాబట్టి ఎవరికి వారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం మొదలుపెట్టినా, త్వరలోనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలుగుతాం. ‘యూనివర్సల్‌ పోలియో డే’ సందర్భంగా పిల్లలందరికీ పోలియో టీకా ఇప్పించడానికి వెనకున్న ఉద్దేశం కూడా ఇదే! పోలియో వ్యాక్సిన్‌ పూర్వం తీసుకున్నా, పిల్లలందరికీ ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా ఇప్పించడం వల్ల హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే వీలుంటుంది. ఇదే నియమం కరోనా టీకాకు కూడా వర్తిస్తుంది.


డాక్టర్‌. డి.రఘోత్తమ్‌ రెడ్డి

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.

Updated Date - 2021-03-16T05:30:00+05:30 IST