రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-05T05:27:17+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే ప్రజలకు పెద్దసవాల్‌గా మారింది. నేరుగా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చే వారికి టీకా ఇచ్చే విధానానికి వైద్యఆరోగ్యశాఖ స్వస్తి పలికింది.

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే వ్యాక్సిన్‌
చేర్యాల పీహెచ్‌సీలో 45 ఏళ్లు ఉన్నవారికి మాత్రమే అని యాప్‌లో చూపిస్తున్న దృశ్యం

 ‘కొవిన్‌’ యాప్‌లో వివరాలు నమోదైతేనే టీకా

 స్పాట్‌ రిజిస్ట్రేషన్లకు స్వస్తి

 పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడుతున్న జనం

 ఒక ఆస్పత్రిలో రోజుకు వంద మందికే టీకా 

 స్లాట్‌ కోసం మీసేవా కేంద్రాలకు వెళ్లాలని వైద్యాధికారుల సూచన 


సంగారెడ్డిఅర్బన్‌/చేర్యాల మే 4 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే ప్రజలకు పెద్దసవాల్‌గా మారింది. నేరుగా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చే వారికి టీకా ఇచ్చే విధానానికి వైద్యఆరోగ్యశాఖ స్వస్తి పలికింది. ముందస్తు స్లాట్‌ బుక్‌ చేసుకుని వ్యాక్సిన్‌ కోసం రిజిస్ర్టేషన్‌ చేసుకుంటేనే టీకా ఇవ్వనున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ ప్రక్రియ సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితం వ్యాక్సిన్‌ కోసం నేరుగా వచ్చే వారికి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసి టీకా ఇచ్చి పంపేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియను నిలిపేశారు. దీంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారు పరిజ్ఞానం లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్‌లైన్‌ పరిజ్ఞానం లేని వారితో పాటు నిరక్ష్యరాస్యులు, స్మార్ట్‌ఫోన్‌ ఉండి ఇంటర్నెట్‌ సౌకర్యం లేని చాలా మంది టీకా కోసం ఆస్పత్రులకు వచ్చి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. 


రోజుకు వంద మందికే టీకా 

ఇటీవల వైద్యఆరోగ్యశాఖ నిత్యం ఆస్పత్రి, పీహెచ్‌సీకి 100 మంది చొప్పున మాత్రమే టీకా వేయాలని నిర్ణయించింది. 45ఏళ్లపై బడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీనికి తోడు మొదటి, రెండు డోసుల టీకా తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ తేల్చిచెప్పింది. కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తామని, గతంలో మాదిరిగా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ఉండబోదని స్పష్టం చేసింది. స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు భౌతికదూరం సాధ్యం కావడం లేదని, తద్వారా వైర్‌సవ్యాప్తికి అవకాశాలు ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. నిత్యం వంద మందికే టీకా వేయడం, అందులోనూ స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తున్న క్రమంలో ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయడం సవాల్‌గా మారిందని పలువురు పేర్కొంటున్నారు. మీసేవా కేంద్రాలకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని వైద్యసిబ్బంది తేల్చిచెబుతున్నారు. మరోవైపు స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం కావడంతో వరుసగా నాలుగైదు రోజుల పాటు ఆయాఆస్పత్రుల్లో నమోదుకు ‘స్లాట్‌ఫుల్‌’ అని దర్శనమిస్తుందని, దీంతో చేసేందేమీ లేక ఆన్‌లైన్‌లో చూపించిన తేదీ నాడే బుక్‌ చేసుకుంటున్నామని,  సాంకేతికలోపాలు తలెత్తుతుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

కరోనావ్యాప్తి నివారణకు కేంద్రం మూడో విడతగా 18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న వారికి టీకావేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ వ్యాక్సిన్‌ కొరతతో పాటు, ఇప్పుడు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కొర్రీలు పెడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌ లో 18-45 ఏళ్లలోపు ఉన్న వారి వివరాలు నమోదు చేసిన అనంతరం టీకా వేసుకునే తేదీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. పిన్‌కోడ్‌ లేదా జిల్లా ప్రామాణికంగా ప్రభుత్వ ఆసుపత్రి, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేసుకుని తేదీ ఖరారు చేసుకునే క్రమంలో 45 ఏళ్లు ఉన్న వారికి మాత్రమే అని యాప్‌లో సూచిస్తుంది. తక్కువ వయస్సు ఉన్న వారికి స్లాట్‌ బుక్‌ అవ్వడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల సాంకేతికపరంగా సమస్యలు తలెత్తుతుండడంతో టీకాకు నోచుకుంటామో లేదోనని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యసిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదని చెబుతుండటంతో అయోమయానికి గురవుతున్నారు. ఈవిషయమై సంబంధితశాఖ అధికారులు స్పందించి స్లాట్‌ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుం డా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్లాట్‌బుకింగ్‌ను రద్దు చేయాలని లేదా ఆస్పత్రుల్లోనే స్లాట్‌ బుకింగ్‌ కోసం వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు అధికారులను  వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-05-05T05:27:17+05:30 IST