రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా!

ABN , First Publish Date - 2021-05-04T07:59:32+05:30 IST

రాష్ట్రంలో ఇక టీకా తీసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే! కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా!

  • రెండో డోసుకూ బుకింగ్‌ తప్పనిసరి
  • ఒక్కో సెంటర్‌లో 100 మందికే వ్యాక్సిన్‌
  • ఈ నెలంతా స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం
  • మీసేవలోనూ బుక్‌ చేసుకోవచ్చు: గడల
  • 18-44 ఏళ్ల వారికి ప్రైవేటులోనూ నో!
  • రాష్ట్రానికి మరో 4 లక్షల డోసులు 

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక టీకా తీసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే! కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అది కూడా 45 ఏళ్లు పైబడిన వారికేనని తెలిపింది. తొలి డోసు అయినా రెండో డోసైనా బుక్‌ చేసుకుంటేనే టీకా దొరుకుతుందని తేల్చిచెప్పింది. స్లాటు బుక్‌ చేసుకోకుండా టీకా కేంద్రాల వద్దకు రావొద్దని సూచించింది. ఇప్పటికే కొవిన్‌ పోర్టల్‌లో టీకా లభించే కేంద్రాలతో పాటు అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అప్‌లోడ్‌ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4లోపు టీకా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వ్యాక్సిన్‌ నిల్వలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతోపాటు టీకా కేంద్రాల వద్ద భారీ రద్దీ నేపథ్యంలోనే వైద్యశాఖ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది.

 

తొలి డోసు వారే బుక్‌ చేసుకుంటే..?

రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కొవిన్‌లో రిజిస్టర్‌ చేసుకోకపోయినా, కేంద్రాలకు నేరుగా వచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరడంతో ప్రస్తుతం టీకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్టర్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్యశాఖ స్పష్టం చేసింది. ఇక రెండో డోసుకు కూడా స్లాట్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరంగా మారింది. మరోవైపు రెండో డోసు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుందామంటే సోమవారం ఉదయం వరకు ‘‘టీకా కేంద్రాలు అందుబాటులో లేవు’’ అని కొవిన్‌ పోర్టల్‌లో చూపింది. దీనిపై సోమవారం వైద్య ఆరోగ్యశాఖకు పెద్దయెత్తున ఫిర్యాదులు రావడంతో వెంటనే కేంద్రాల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. సాయంత్రానికి రెండో డోసు స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు వీలు కలిగింది. అయితే స్లాట్లన్నీ తొలి డోసు వారే బుక్‌ చేసుకుంటే రెండో డోసు వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల చివరి నాటికి 11 లక్షల మందికి రెండో డోసు వేయాల్సి ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే చాలా మంది రెండో డోసు కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే ప్రత్యేకంగా ఒకట్రెండు రోజులు కేటాయించాలని వైద్య శాఖ నిర్ణయించింది.


ఒక్కో కేంద్రంలో 100 మందికే..!

టీకా నిల్వలు తక్కువగా ఉండడం, కేంద్రం నుంచి వచ్చే డోసులు సరిపడా లేకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రా ల్లో రోజుకు 100 మందికే టీకా ఇవ్వనుంది. అది కూడా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలకు రాష్ట్రానికి కేంద్రం కేవలం 8.35 లక్షల డోసులే పంపుతామని సమాచారం ఇచ్చింది. సరిగ్గా వేస్తే అవి మూడు రోజులకే సరిపోతాయి. కేంద్రం ఈ డోసులను ఒకేసారి పంపదు. ఒకవేళ రోజూవారీ వేసినా మే నెలకు కేటాయించిన డోసుల ప్రకారం రోజుకు 27833 టీకాలే వేయవచ్చు. ఈ నెలంతా అర్హులందరూ టీకా కోసం రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చని వైద్యశాఖ వెల్లడించింది.


18 పైబడిన వారికి ప్రైవేటులోనూ లేదు!

రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వకూడదని సర్కారు నిర్ణయించింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లోని టీకా కేంద్రాల్లోనూ ఆ వయసు పైబడిన వారికి టీకా బుకింగ్‌ వద్దని వైద్య ఆరోగ్యశాఖ  ఆదేశాలు జారీ చేసింది. ఇక కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటికీ స్లాట్లు బుక్‌ కావని, ప్రభుత్వం ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే 18 ఏళ్లు పైబడిన వారికి టీకా అందుబాటులోకి వస్తుందని వైద్యశాఖ వెల్లడించిం ది. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం టీకాల సరఫరాను ఈనెల 1నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు వారు ఉత్పత్తి కంపెనీల నుంచి టీకాను నేరుగా కొనుగోలు చేసుకోవచ్చంటూ కేంద్రం స్పష్టతనిచ్చింది. దాంతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు టీకాలు కొనుగోలు చే శాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 101 ప్రైవేటు వ్యాక్సి న్‌ కేంద్రాల్లో టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డ్యాష్‌బోర్డులో వెల్లడించారు. మరోవైపు రంగారెడ్డిజిల్లాల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిన్‌ పోర్టల్‌ ద్వారా 45 ఏళ్లు పైబడిన వారికి టీకాల స్లాట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ కా ర్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇంకా టీకా కార్యక్రమం మొదలు కాలేదు. 


రాష్ట్రానికి మరో 4 లక్షల డోసులు

సోమవారం రాష్ట్రానికి మరో 4 లక్షల టీకా డోసులు వచ్చాయి. టీకా నిల్వలు తగినంత లేకపోవడంతో శని, ఆదివారం వ్యాక్సినేషన్‌ నిలిపివేశారు. తాజాగా వచ్చిన టీకా డోసులను వెంటనే జిల్లాలకు పంపారు. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో బుక్‌ చేసుకున్న స్లాట్స్‌ ఆధారంగా టీకాలిస్తారు. కాగా, తెలంగాణలో సోమవారం సాయంత్రం వరకు మొత్తం 48,13,565 డోసులిచ్చారు. సోమవారం కేవలం 25,747 మందికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. 


అక్కడక్కడా వ్యాక్సినేషన్‌

మూడు రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ కోసం ప్రజలు చక్కర్లు కొడుతున్నారు. సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని నగర వాసులు ఆరోగ్య కేంద్రాల వద్దకు పరుగులు తీశారు. కానీ, హైదరాబాద్‌లోని మెజారిటీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహించలేదు. కొన్ని వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 45 ఏళ్లు మించిన వారికి రెండో డోసు వేశారు. కొన్ని చోట్ల మొదటి డోసు వేశారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌చేసుకున్న వారికి మాత్రమే టీకాలు వేశారు.


మీ సేవ, ఇంటర్నెట్‌ కేంద్రాల్లో బుక్‌ చేసుకోవచ్చు 

ఇక నుంచి టీకా కోసం 45 పైబడిన వారంతా తప్పకుండా కొవిన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. లేకపోతే టీకా ఇవ్వడం సాధ్యం కాదు. తొలి డోసు తీసుకున్న వారు సైతం రెండో డోసుకు తప్పక స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఒకవేళ నిరక్షరాస్యులైతే సమీపంలోని మీసేవ, లేదా ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ఉండి, చదువుకొన్న వారెవరైనా కొవిన్‌ పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

Updated Date - 2021-05-04T07:59:32+05:30 IST