Abn logo
Mar 24 2021 @ 00:46AM

టీకా అసమానతలు

ఏప్రిల్‌ ఒకటినుంచి నలభైఐదేళ్ళు పైబడినవారందరినీ కరోనాటీకాకు అర్హులనుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వయసువారు ఇంతవరకూ అర్హులు. అరవైయేళ్ళు పైబడినవారిమాదిరిగానే ఇకపై వీరంతా నేరుగా పోయి వాక్సిన్‌ వేయించుకోవచ్చు. ప్రపంచంలోనే వాక్సిన్‌ వేగంగా వేస్తున్న దేశంగా భారత్‌కు పేరుంది. వాక్సిన్‌ ప్రక్రియ విస్తృతంగా సాగుతూ, ఐదుకోట్ల మందికి దానిని అందించగలిగినప్పటికీ, మరోపక్క కరోనా కేసులు కూడా అంతేవేగంగా పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది.


సెకండ్‌ వేవ్‌ విషయంలో ఇక ఏ సంశయాలూ అక్కరలేదనీ, దేశం మొత్తాన్ని వైరస్‌ చుట్టుముట్టే ప్రమాదం అనతికాలంలోనే ఉన్నదని కొందరు హెచ్చరిస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌, వారంతపు కర్ఫ్యూలతో వైరస్‌ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నందున లక్షలాదిమంది ఉపాధి దెబ్బతినే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కరోనా ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టినప్పుడు తమ ప్రతిభేనని చెప్పుకున్న పాలకులు ఇప్పుడు దాని విజృంభణకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు చేస్తున్నారు. 


వాక్సినేషన్‌ ప్రక్రియను చాలా దేశాలు వేగవంతం చేశాయి. అమెరికా వంటి ధనికదేశాలైతే అతికొద్దినెలల్లోనే ప్రతీపౌరుడికీ టీకా రక్షణ కల్పించబోతున్నాయి. అదేసమయంలో ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగా టీకా అసమానతలు కూడా స్పష్టంగా బయటపడుతున్నాయి. పేద, ధనిక దేశాల మధ్య టీకా పంపిణీలో తేడా వేలాదిమంది ప్రాణాలు హరిస్తున్నది. ఉత్పత్తి అయిన మొత్తం టీకాలో మూడువంతుల భాగాన్ని పట్టుమని పదిదేశాలు తరలించుకుపోగా, కనీసం ముప్పయ్‌దేశాలు ఇప్పటివరకూ ఒక్క వ్యక్తికి కూడా వాక్సిన్‌ వేయలేని స్థితి. ధనికదేశాల్లోని తొలివరుస యోధులకు వాక్సిన్‌ ఎప్పుడో అందితే, ఇప్పటికీ ఆ రక్షణలేక ఆఫ్రికాలోని వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోతున్నారు. కెన్యా, మొజాంబిక్‌, జింబాబ్వే, నైజీరియా వంటి దేశాల్లో వైద్యసిబ్బంది మరణంతో ఆరోగ్యవ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచజనాభాలో 17శాతం ఉన్న ఆఫ్రికా ఖండానికి మొత్తం వాక్సిన్‌లో 2శాతం కూడా దక్కలేదు. తయారైన వాక్సిన్‌ అంతా ఉత్తరార్థగోళంలోని ధనికదేశాలు ఎత్తుకుపోగా, ఆఫ్రికా


ఖండంలో కాస్తంత డబ్బున్న కెన్యాకు కూడా అనుకున్నదానికంటే నెలరోజులు ఆలస్యంగా ఇరవైరోజుల క్రితమే వాక్సిన్‌ మొదటి లక్షడోసులు చేరాయి. ఇకపై వాక్సిన్‌ రాక వేగవంతమవుతుందనుకున్నా, దేశజనాభాలో మూడోవంతుమందికి టీకా వేయడానికి దానికి కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా. 


అమెరికా, బ్రిటన్‌ ఇత్యాది దేశాల్లో వాక్సినేషన్‌ వేగం ఈ పేదదేశాల ఊహకు కూడా అందనిది. పేద దేశాలకు సైతం టీకా సరఫరాలో అన్యాయం జరగకుండా ఉద్దేశించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ కార్యక్రమం ‘కోవాక్స్‌’మీద ఇవన్నీ ఆధారపడ్డాయి. కానీ, టీకా తయారీ సంస్థలతో ధనికదేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదర్చుకున్న కారణంగా సరఫరాకు విఘాతం ఏర్పడి ఈ కార్యక్రమం ఎదురుదెబ్బలు తింటున్నది. అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ టీకా ఉత్పత్తి సంస్థలు ధనికదేశాలకు దరఖాస్తులు చేయడం, అనుమతి సంపాదించి సరఫరాలు జరపడం ఒక పద్ధతి ప్రకారం సాగిపోతోంది. ధనికదేశాల్లో ఆరోగ్యంగా ఉన్న యువకులు కూడా వాక్సిన్‌ వేయించుకుంటే, పేదదేశాల్లో వైద్యులకు కూడా వాక్సిన్‌ దక్కనిస్థితి నేడున్నది. దక్షిణాఫ్రికా రకం వైరస్‌ విజృంభణతో ఆఫ్రికాఖండం కరోనా ముప్పును మరింత తీవ్రంగా  ఎదుర్కొంటున్నది. వాక్సిన్‌ సరఫరాలో జాప్యం వల్ల వేలాది ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉన్నది. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలతో ఈ దేశాలు ప్రజారోగ్యాన్ని పరిరక్షించలేని స్థితిలో ఉన్నాయి. వాక్సిన్‌ సరఫరాలో జాప్యం వీటిని మరింత దెబ్బతీస్తుంది. వాక్సిన్‌ను భారీగా కొనుగోలు చేసి, నిల్వచేస్తున్న ధనికదేశాలు రోగాన్ని మొత్తం భూమండలం మీదే నిర్మూలించాల్సిన వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి. కరోనా టీకా సరఫరాలో అసమానతలున్నప్పుడు వైరస్‌ ఏదో ఒక మూలనుంచి కొత్తరూపాల్లో దండయాత్రలు చేస్తుందనీ, అది అందరికీ ప్రమాదమని గ్రహించాలి.