మందులు వాడుతున్నా వ్యాక్సిన్‌ ఓకే!

ABN , First Publish Date - 2021-04-13T06:32:58+05:30 IST

45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అయితే ఇతరత్రా వ్యాధులు, చికిత్సల్లో భాగంగా మందులు తీసుకునే వాళ్ల మాటేమిటి? వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత ఆ మందులను ఆపేయాలా? లేదంటే వాటిని కొనసాగిస్తూనే కొవిడ్‌ వ్యాక్సిన్‌

మందులు వాడుతున్నా వ్యాక్సిన్‌ ఓకే!

45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అయితే ఇతరత్రా వ్యాధులు, చికిత్సల్లో భాగంగా మందులు తీసుకునే వాళ్ల మాటేమిటి? వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత ఆ మందులను ఆపేయాలా? లేదంటే వాటిని కొనసాగిస్తూనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? 


మనలో మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు మందులు వాడే వాళ్లు ఉన్నారు. వ్యాధినిరోధకశక్తిని అణచి ఉంచే మందులు తీసుకునేవాళ్లూ ఉంటారు. స్టాటిన్స్‌ మొదలు యాంటీకాగ్యులెంట్స్‌, ఇమ్యునోసప్రెసెంట్స్‌, షుగర్‌, బీపీ మాత్రలు... ఇలా వీటిలో ఏదో ఒక రకం మందులను జీవితాంతం వాడేవాళ్లూ ఉంటారు. వేర్వేరు ఆరోగ్య సమస్యలకు వేర్వేరు మందులు వాడుతున్న వాళ్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొనే విషయంలో ఇలా నడుచుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, మూర్ఛ, ఉబ్బసం, ఎలర్జీ... ఎక్కువ శాతం మంది కలిగి ఉండే ఆరోగ్య సమస్యలు. 


మధుమేహం, అధిక రక్తపోటు: ఈ మందులు (టాబ్లెట్లు, ఇంజెక్షన్లు) వాడేవాళ్లు వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత కూడా వాటిని కొనసాగించాలి. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పుడే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. ఒకవేళ షుగర్‌ అదుపుతప్పి ఉంటే, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మందులతో షుగర్‌ను సరి చేసుకుని, ఆ తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 


మూర్ఛ మందులు: మూర్ఛ మందులు వాడేవాళ్లు కూడా యధాతధంగా మందులు వాడుకుంటూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే మూర్ఛ వస్తుందనేది అపోహ మాత్రమే.  


గుండెపోటు బాధితులు: ఈ కోవకు చెందిన వారు జీవితాంతం రక్తం పలుచనయ్యే మందులు వాడుతూ ఉంటారు. అలాగే గుండెపోటు బాధితుల్లో కొందరు కొలెస్ర్టాల్‌, అధిక రక్తపోటు, మధుమేహాలకు సంబంధించిన మందులు కూడా వాడుతూ ఉంటారు. ఎకోస్ర్పిన్‌ లేదా యాస్ర్పిన్‌ అనే రక్తం పలుచనయ్యే మందులు వాడేవాళ్లు వ్యాక్సిన్‌ తీసుకుంటే ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రదేశంలో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందనేది నిజం కాదు. కాబట్టి ఈ మందులు వాడేవాళ్లు వాటిని కొనసాగిస్తూనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.


బ్రెయిన్‌ స్ట్రోక్‌: మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల, మెదడులోని రక్తనాళం పగిలిపోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తూ ఉంటుంది. అయితే రక్తం గడ్డకట్టే వాళ్లు కూడా రక్తం పలుచనయ్యే ఎకోస్ర్పిన్‌ లేదా యాస్ర్పిన్‌ మందులు వాడుతూ ఉంటారు. వీళ్లు కూడా ఎటువంటి భయాలు లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. 


ఇతరత్రా కీలక మందులు: రక్తం పలుచన చేసే మందుల్లో కొన్ని ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కాళ్లలోని రక్తనాళాల్లో, మెదడులో రక్తపు గడ్డలు ఉన్నవాళ్లు, గుండె కవాటాల సమస్యల వల్ల గుండెలో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవాళ్లు ఇలాంటి ఎక్కువ తీవ్రత కలిగిన మందులు వాడుతూ ఉంటారు. అసిట్రోమ్‌, ఎలిక్విస్‌, రివరోక్సాబ్యాన్‌ మందులు వాడేవాళ్లలో వ్యాక్సిన్‌తో కొంత మేరకు రక్తస్రావం జరిగే అవకాశాలు ఉండవచ్చని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఈ మందులు వాడేవాళ్లు వ్యాక్సిన్‌ గురించి వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. 


కొవిడ్‌ బాధితులు: కొవిడ్‌ వచ్చి, తగ్గిన తర్వాత ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు ఏర్పడకుండా, రక్తం పలుచన చేసే ఎక్కువ తీవ్రత కలిగిన మందులను కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు వాడవలసి ఉంటుంది. ఈ మందులు వాడుతున్న వాళ్లు కూడా అంతకాలం పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోకూడదు. 


మానసిక వ్యాధులు: ఇందుకోసం మందులు వాడుతున్న వాళ్లు కూడా ఆ మందులు కొనసాగిస్తూనే వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.


ఇమ్యునోసప్రెసెంట్స్‌: అవయవ మార్పిడి చేయించుకోవడం మూలంగా వ్యాధినిరోధకశక్తిని అణచి ఉంచే మందులు వాడేవాళ్లు, కేన్సర్‌ చికిత్స ఫలితంగా వ్యాధినిరోధకశక్తి తగ్గినవాళ్లకు ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. 


పి.టి ఐ.ఎన్‌.ఆర్‌ పరీక్ష

ఎక్కువ మందితో కలిసి పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు, కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండే కోవలకు చెందినవాళ్లకు వ్యాక్సిన్‌ తప్పనిసరి. అయితే వీరిలో రక్తం పలుచన చేసే ఎక్కువ మోతాదు మందులు వాడేవాళ్లు ఉంటే, వారికి పిటి ఐఎన్‌ఆర్‌ (ప్రొథ్రాంబిన్‌ టైమ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ నార్మలైజ్‌డ్‌ రేషియో) పరీక్ష చేసి, ఫలితాన్ని బట్టి వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చు. ఈ పరీక్ష ద్వారా రక్తస్రావం జరిగే అవకాశాల తీవ్రత ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఫలితంలో రిస్క్‌ తక్కువ అని తేలిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.


దుష్ప్రభావాలు మంచివే!

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు రెండు నుంచి మూడు రోజుల పాటు కొందరిని వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలకు భయపడి వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఇష్టం చూపనివాళ్లు ఉన్నారు. నిజానికి ఈ లక్షణాలన్నీ వ్యాక్సిన్‌ శరీరంలో మెరుగ్గా పనిచేస్తుంది అనడానికి సూచనలే! వాక్సిన్‌తో శరీరంలో రియాక్షన్‌ మొదలవుతుంది. ఆ రియాక్షన్‌కు శరీరం జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలతో స్పందిస్తుంది. కొవిషీల్డ్‌లో ఇనాక్టివేటెడ్‌ అడినోవైరస్‌, కొవ్యాక్సిన్‌లో కిల్ల్‌డ్‌ కరోనావైరస్‌ ఉన్నాయి. ఇలా వైరస్‌లతోనే వ్యాక్సిన్‌ తయారవుతుంది కాబట్టి దాన్ని తీసుకున్నప్పుడు వైరస్‌లను ఫారెన్‌ బాడీగా భావించిన శరీర రక్షణ వ్యవస్థ వాటిని తరిమికొట్టడం కోసం పోరాటం మొదలుపెడుతుంది. ఆ క్రమంలో శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. వ్యాక్సిన్‌ తయారీ ఉద్దేశం అదే! ఇలా తయారయ్యే యాంటీబాడీలు బయట నుంచి దాడి చేసే కొవిడ్‌ వైరస్‌తో సమర్థంగా పోరాడి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఇవే లక్షణాలు కనిపించాలి. కానీ కొందరిలోనే దుష్ప్రభావాలు తలెత్తడానికి కారణం వారిలో ఎక్కువ మోతాదులో యాంటీబాడీలు తయారవడమే! కాబట్టి వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ మంచివేనని భావించాలి.


అపోహలు వీడండి!  

కొవిడ్‌ వ్యాక్సిన్‌తో మెదడులో రక్తం గడ్డలు ఏర్పడతాయనీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుందనే పలు రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాళ్లకు పూర్వం నుంచే అందుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండి ఉండవచ్చు. యాధృచ్ఛికంగా వ్యాక్సిన్‌ తీసుకున్న సమయంలోనే అనారోగ్యం తీవ్రమై సమస్యలు బయటపడుతూ ఉండిఉండవచ్చు. కాబట్టి ఆ రుగ్మతలకు వ్యాక్సిన్‌తో ముడిపెట్టడం సరి కాదు.


వీళ్లు కూడా అర్హులే!

  • గుండెపోటు వచ్చినవారు
  • పేస్‌ మేకర్‌ అమర్చుకున్నవారు
  • అవయవమార్పిడి చేయించుకున్నవారు
  • బైపాస్‌ సర్జరీ చేయించుకున్నవారు
  • స్టెంట్‌ వేయించుకున్నవారు
  • మెదడులో రక్తం గడ్డకట్టడం మూలంగా స్ర్టోక్‌ వచ్చినవారు


ఇలాంటప్పుడు వ్యాక్సిన్‌ ఆచి తూచి!

జ్వరంతో బాధపడుతున్నా, మరేదైనా ఇన్‌ఫెక్షన్‌ (వాంతులు, విరేచనాలు, డయేరియా) కలిగి ఉన్నా ఆ సమయాల్లో వ్యాక్సిన్‌ తీసుకోకూడదు. రుగ్మతలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే టీకా తీసుకోవాలి. 


డాక్టర్‌ జగదీష్‌ కుమార్‌ కనుకుంట్ల సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, మెడికవర్‌ హాస్పిటల్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - 2021-04-13T06:32:58+05:30 IST