కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-05-08T05:09:43+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభ దశలో ఆసక్తి చూపని జనం ఇటీవల కేసులు అధికంగా నమోదవుతుండడంతో టీకానే సంజీవనిగా భావిస్తున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపు
చిత్తలూరు పీహెచ్‌సీలో రెండో డోసు వ్యాక్సిన్‌ కార్యక్రమం

 కొరతతో రెండో డోసు వారికే ప్రాధాన్యం

 వైద్యశాలల చుట్టూ ప్రదక్షణలు

చేజర్ల, మే 7: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభ దశలో ఆసక్తి చూపని జనం ఇటీవల కేసులు అధికంగా నమోదవుతుండడంతో టీకానే సంజీవనిగా భావిస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి అది కూడా రెండోడోసు వారికే వేస్తున్నారు. 45 ఏళ్లు నిండి ఇంకా మిగిలిన వారికి మొదటి డోసు, 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ వేయాల్సిన నేపథ్యంలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కొరత ఉండడంతో వైద్యశాలల చుట్టూ వారంతా ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ వేసిన వ్యాక్సిన్‌లో అత్యధిక శాతం కోవిషీల్డ్‌ వేయగా, తక్కువ మందికి మాత్రమే కోవాగ్జిన్‌ వేశారు. ప్రస్తుతం గ్రామాల్లోని పీహెచ్‌సీలలో ఎక్కువ భాగం కోవిషీల్డ్‌ ఆందుబాటులో ఉంది. గత పది రోజుల క్రితం వరకూ పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా ప్రస్తుతం కొరత తీవ్రంగా ఉంది. పీహెచ్‌సీలకు వచ్చే వారికి రెండో డోస్‌ వేయించుకునే వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు మూడురోజుల్లో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా వాటిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన క్రమంలో సాధారణ జనానికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుతుందా అన్న సందేహం నెలకుంది. 

Updated Date - 2021-05-08T05:09:43+05:30 IST