టీకా ఉన్నా.. జనమే లేరు!

ABN , First Publish Date - 2021-09-13T05:10:34+05:30 IST

టీకా ఉన్నా.. జనమే లేరు!

టీకా ఉన్నా.. జనమే లేరు!
టీకాపై అవగాహనకు కళాజాత నిర్వహిస్తున్న దృశ్యం

అపోహలా.. లేదంటే నిర్లక్ష్యమా?

వ్యాక్సిన్‌పై జనంలో సన్నగిల్లిన ఆసక్తి 

మూడో దశ ముప్పున్నా.. మారని ధోరణి 

‘నాకు టీకా అవసరం లేదు. నాకు వద్దంటే వద్దు’ ఇదీ ఖమ్మం రూరల్‌ మండలం గుదిమళ్లకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధుడు చెబుతున్న మాట. వారింట్లో అందరూ టీకా వేయించుకున్నా... ఆయన మాత్రం తనకు వద్దంటే.. వద్దని భీష్మించుకు కూర్చున్నాడు.. కుటుంబసభ్యులు కూడా చేసేదేం లేక వదిలేశారు.

‘నేను బలంగా ఉన్నా. నాకు టీకా వేసుకోవాలన్న ఆసక్తి లేదు’ అని ఖమ్మం అర్బన్‌ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి చెబుతున్న మాటలు. అదేమని అడిగితే తాను బలంగా ఉన్నానని, తనకు ఎలాంటి కరోనా రాదని గట్టిగా చెబుతున్నాడు. 

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 12: మే, జూన్‌ నెలల్లో టీకా కోసం జనం పరుగులు పెట్టారు. కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో వైద్య సిబ్బంది ఊపిరి కూడా పీల్చుకోకుండా తమకు కేటాయించినంత వరకు టీకాలు వేశారు. అంతేకాదు ఆ సమయంలో ఒక్కో సారి టీకాల డోసులు చాలకపోవడంతో ఆందోళనలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు అయితే వర్షాన్నీ కూడా లెక్క చేయకుండా టీకాల కోసం జనం బారులు తీరారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.. టీకాపై ఇంకా జనంలో అపోహలు ఉన్నాయో? లేదంటే ప్రస్తుతం రెండోదశ అయిపోయింది కదా ఏంకాదులే అన్న ధీమానో తెలియదు కానీ టీకాలు తీసుకునే విషయంలో జనంలో నిర్లిప్తత ఏర్పడిందన్నది స్పష్టమవుతోంది. ఖమ్మం జిల్లాలో నూరుశాతం వాక్సినేషన్‌ లక్ష్యంతో ప్రభుత్వం సరిపడా డోసులను పంపిణీ చేస్తుండగా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీకాలను అందుబాటులో ఉంచుతోంది. కరోనా రెండో దశలో జిల్లాలో అధికారికంగా 700 మంది అనధికారికంగా 1500 మంది చనిపోయినట్టు సమాచారం. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిల్లాడారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో వ్యాక్సిన్‌ కోసం విపరీతమైన జనం కేంద్రాలకు పోటెత్తారు. కానీ రెండు నెలలుగా కేసులు తగ్గిపోవడంతో టీకా విషయంలో ప్రజలు కొంత నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు జనం వ్యవసాయ పనుల్లో బిజీ కావడం కూడా గ్రామాల్లో టీకాపై ఆసక్తి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. అయితే వ్యాక్సిన్‌ అవసరం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యఆరోగ్యశాఖ ద్వారా కళాజాతాలను  నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహ లను తొలగించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితం రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూటికి నూరుశాతం టీకాలు వేసే లక్ష్యంతో తమ శాఖ పనిచేస్తోందని ఖమ్మం డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మాలతి చెబుతున్నారు.

సాధారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ..

ఖమ్మం జిల్లాలో నిత్యం 34పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 20 నుంచి 30వేల టీకాలను అందుబాటులో ఉంచు తున్నారు. కానీ నిత్యం 10 నుంచి 12వేల టీకాలు మాత్రమే వేస్తున్నారు. అంటే జనం టీకా కేంద్రాలకు రావడంలేదని స్పష్టమవుతోంది. గతంలో పట్టణాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లి మరీ టీకా వేయించుకున్న జనం ఇప్పుడు కేంద్రాల వైపుకూడా చూడటం లేదని, దాంతో తాము సబ్‌సెంటర్లకు జనాన్ని పిలిచి మరీ టీకాలు వేయాల్సి వస్తోందని ఓ ఏఎన్‌ఎం వాపోతోంది.

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్‌ 

విభాగం మొదటి డోస్‌ రెండో డోస్‌

హెల్త్‌ వర్కర్లు 9201 7182

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 6077 3281

60ఏళ్ల పైబడిన వారు 43,841 15,126

18 నుంచి 44 ఏళ్లు 3,66,856 15,126

45 నుంచి 59 ఏళ్లు 1,32,858 36,285

మొత్తం 5,58,833 1,33,106

టీకా నిల్వల వివరాలు..

టీకా రకం వచ్చిన డోస్‌లు వేసిన డోస్‌   ప్రస్తుత నిల్వ

కోవిషీల్డ్‌ 11,00,380 6,87,240 3,83,140

కోవాగ్జిన్‌ 68,080 63,970 4,110



Updated Date - 2021-09-13T05:10:34+05:30 IST