టీకా నో స్టాక్‌..!

ABN , First Publish Date - 2021-05-05T05:29:57+05:30 IST

జిల్లాలో జనవరి 16న కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

టీకా నో స్టాక్‌..!
కడప నగరంలోని నకాష్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో ఇటీవల కోవాగ్జిన్‌ టీకా రెండో డోసు కోసం ఎగబడ్డ జనం

రెండో డోసు కోసం 2.56 లక్షల మంది నిరీక్షణ

8,21,482 మందికి గాను మొదటి డోసు వేసుకున్నది 3,42,925 మంది మాత్రమే

వీరందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే 12.4 లక్షల డోసులు అవసరం

18-45 ఏళ్ల వయసున్న 15 లక్షలమందికి వ్యాక్సిన్‌ ఎప్పుడో..?


(కడప-ఆంధ్రజ్యోతి): కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో అందరూ వ్యాక్సిన్‌ కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే.. టీకా పంపిణీలో అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రాలకు వెళితే స్టాక్‌ లేదని వైద్యాధికారులు అంటున్నారు. మొదటి డోసు కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్న 52 వేల మంది రెండవ డోసు కోసం నిరీక్షిస్తున్నారు. నాలుగు వారాల గడువు ముగిసినా రెండవ డోసు అందడం లేదు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్న 2,56,871 మందికి రెండో డోసు వేయాల్సి ఉంది. హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారి కోసం 12,13,985 డోసుల వ్యాక్సిన్‌ అవసరం ఉంది. అవసరానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోవడంతో టీకా వచ్చిందని తెలియగానే కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో కొవిడ్‌-19 టీకా తాజా పరిస్థితి ఇది.


జిల్లాలో జనవరి 16న కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి విడత 24,589 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు, రెండో విడతలో 44,390 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, మూడో విడతలో 60 ఏళ్లు పైబడిన 3,00,813 మంది, నాలుగో విడతలో 45-60 ఏళ్ల మధ్య ఉన్న 4,51,690 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రభుత్వం గుర్తించింది. ఈ లెక్కన 8,21,482 మందికి టీకా వేయాలి. అయితే.. మొదట్లో ప్రజల్లో అపోహ కారణంగా చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రాలేదు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. భయమో.. ఇతర కారణాలో వారికే ఎరుక. వామ్మో.. వ్యాక్సినా అంటూ దూరంగా ఉన్నారు. ఇప్పటివరకు 3,42,925 మంది వ్యాక్సిన్‌ వేయించుకోగా.. వారిలో కేవలం 86,054 మందే రెండో డోసు వేయించుకున్నారు. 2,56,871 మంది రెండవ డోసు కోసం నిరీక్షిస్తున్నారు. మొదటి డోసు వేసుకున్న వారిలో సగానికి పైగా నాలుగు, ఆరు వారాల గడువు ముగిసినా రెండవ డోస్‌ ఇవ్వలేదు. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు..?

12.14 లక్షల డోసులు అవసరం

ప్రభుత్వం గుర్తించిన హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారు మొత్తం 8,21,482 మందిలో ఇప్పటికీ 4,78,557 మందికి మొదటి డోసు కూడా ఇవ్వలేదు. వారికి రెండు విడతలు కలిపి 9,57,114 డోసుల వ్యాక్సిన్‌ అవసరం ఉంది. అలాగే... మొదటి డోసు టీకా వేసుకున్న వారిలో 2,56,871 మందికి రెండో డోసు ఇవ్వాలి. ఈ లెక్కన ప్రభుత్వం గుర్తించిన మొదటి ప్రాధాన్యత వ్యక్తులకు రెండు డోసులు పూర్తిగా ఇవ్వాలంటే 12,13,985 డోసుల వ్యాక్సిన్‌ అవసరముంది. 1-2 శాతం లాస్‌తో కలిపితే 12.38 లక్షల డోసులు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. 


18-45 ఏళ్ల వారికి ఎప్పుడో..?

మే ఒకటో తారీఖు నుంచి 18-45 ఏళ్ల వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ప్రకటించాయి. రిజిస్ట్రేషన్‌ కోసం ఒక వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌ ఓపన్‌ చేస్తే 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. మాకెప్పుడు వ్యాక్సిన్‌ అంటూ మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 18-45 ఏళ్ల వారు 2011 గణాంకాల ప్రకారం 12.95 లక్షల మంది ఉన్నారు. ఈ పదేళ్లలో పెరిగిన జనాభా దృష్ట్యా 15 లక్షలు దాటి ఉంటుందని అంచనా. వీరందరికి టీకా ఇవ్వాలంటే మరో 30 లక్షల డోసుల వ్యాక్సిన్‌ అవసరముంది. ప్రభుత్వం గుర్తించిన మొదటి ప్రాధాన్యత వ్యక్తులు 4,78,557 మంది, రెండో డోసు ఇవ్వాల్సిన 2,56,871 మందికి ఇంకా 12.14 లక్షల డోసులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన ప్రతిసారి 20-40 వేల డోసులకు మించి ఇవ్వడం లేదు. ఈ లెక్కన 18-45 ఏళ్ల మధ్య వయస్సు వారందరికి టీకా వేయాలంటే ఎన్ని నెలలు ఆగాలో..? ఓ పక్క వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. మరో పక్క వ్యాక్సిన్‌ కొరతతో జనం ఆందోళన చెందుతున్నారు.


కోవాగ్జిన్‌ టీకా వేసుకున్న వారి పరిస్థితేంటి..?

జిల్లాలో దాదాపుగా 52 వేల మంది కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు. వీరిలో 10-15 శాతం మంది రెండో డోసు వేసుకున్నారు. మిగిలిన 85-90 శాతం మందికి రెండో డోసు టీకా వేయాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది నాలుగు వారాల గడువు పూర్తి అయింది. కొందరికి ఐదు వారాలు దాటింది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో రెండో డోస్‌ అందుతుందా..? వేయకపోతే మా పరిస్థితి ఏమిటి..? అంటూ మొదటి డోస్‌ కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక డోస్‌ వేశాక.. రెండో డోసు ముందస్తుగా నిల్వ చేసి ఉంచాలి. జిల్లా అధికారులు ముందుగా అదే విధానం పాటించారు. అయితే.. టీకాకు ఢోకా లేదు.. అడిగిన వారందరికీ వేయండి, రెండో డోస్‌ సరఫరా చేస్తామని రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పడంతో వచ్చిన వ్యాక్సిన్లన్నీ మొదటి డోసుకు వేసేశారు. ఇప్పుడు వీరంతా రెండో డోస్‌ కోసం నిరీక్షించాల్సి వస్తోంది.  


వ్యాక్సిన్‌ వస్తుంది.. ఆందోళన వద్దు

- డాక్టరు మల్లేశ్వరి, డీఐఓ, కడప

వ్యాక్సిన్‌ అయిపోయిన మాట వాస్తవమే. తక్షణ సరఫరాకు రాష్ట్ర అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాగానే జిల్లాలో 132 వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు సరఫరా చేసి టీకా వేసే కార్యక్రమం కొనసాగిస్తాం. కోవాగ్జిన్‌ టీకా మొదటి డోసు 52 వేల మందికి వేశాం. వారందరికి రెండో డోసు వేసేందుకు చర్చలు తీసుకుంటున్నాం. కోవాగ్జిన్‌ టీకా కూడా వస్తుంది. 


గుడువు దాటిన రెండు వారాల్లోగా వేసుకోవచ్చు

- డాక్టరు అనిల్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,

కోవాగ్జిన్‌ టీకా వేసుకున్న వారికి నాలుగు వారాలు, కోవిషీల్ట్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారు ఆరు వారాలు దాటిన వెంటనే రెండో డోసు టీకా వేయించుకోవాలి. అయితే.. గడువు తీరిన తరువాత రెండు వారాల్లోగా రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు. ఎవరూ అందోళన చెందనవసరం లేదు. అందరికి రెండో డోస్‌ టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటాం. 


టీకా వివరాలు

----------------------------------------------------------------------------------------------------

క్యాటగిరి గుర్తించిన మొదటి డోసు రెండో డోసు డెండో బ్యాలెన్స్‌ 

వ్యక్తులు వేసుకున్నది తీసుకున్నది ఉన్నవారు (సుమారుగా)

--------------------------------------------------------------------------------------------------

హెల్త్‌ కేర్‌ వర్కర్లు 24,589 20,001 11,000 9,001

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు 44,390 39,812 19,906 19,906

45-60 ఏళ్ల మధ్య 4,51,690 1,47,524 28,030 1,19,494

60 ఏళ్లు పైబడివారు 3,00,813 1,35,588 27,118 1,08,470

--------------------------------------------------------------------------------------------------

మొత్తం 8,21,482 3,42,925 86,054 2,56,871

-------------------------------------------------------------------------------------------------- 

Updated Date - 2021-05-05T05:29:57+05:30 IST