వ్యాక్సిన్‌ తయారీ.. అంత వీజీ కాదు

ABN , First Publish Date - 2020-07-03T14:11:55+05:30 IST

భారత్‌ బయోటెక్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు భారత వైద్య మండలి ప్రకటించిన 52 రోజులకల్లా ఆ టీకా మానవ పరీక్షల దశకు వచ్చేసింది! మరో

వ్యాక్సిన్‌ తయారీ.. అంత వీజీ కాదు

భారత్‌ బయోటెక్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు భారత వైద్య మండలి ప్రకటించిన 52 రోజులకల్లా ఆ టీకా మానవ పరీక్షల దశకు వచ్చేసింది! మరో 3 నెలల్లో అందుబాటులోకి వస్తుందని భారత సంయుక్త డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఈశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఇది ఎలా సాధ్యమైంది? మామూలుగా అయితే ఒక ఔషధాన్ని తయారుచేసి, మార్కెట్లో విడుదల చేయడానికి 12 ఏళ్లు.. వ్యాక్సిన్‌కైతే 8 ఏళ్లు పడుతుందని వైద్యనిపుణులు చెబుతారు. కానీ, భారత్‌ బయోటెక్‌గానీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృ ద్ధి చేస్తున్న టీకా ఇంత త్వరగా మానవ పరీక్షల దశ కు ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు వైద్యనిపుణులు, పరిశోధకుల సమాధానమిది.


ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌: ఈ దశలో పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తారు. 


ఫేజ్‌ 1: అతి కొద్ది మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. సురక్షితమా కాదా? రోగ నిరోధక వ్యవస్థను పరిశీలిస్తారు.


ఫేజ్‌ 2: వందల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. పిల్లలు, వృద్ధులపై ఎలా ఉంటుంది? తదితర విషయాలు తెలుసుకుంటారు. 


ఫేజ్‌ 3: వేలాది మందికి వ్యాక్సిన్‌ను ఇస్తారు. ఏ తరహా జన్యుసమూహాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతోంది? వ్యాక్సిన్‌ ఎంత సమర్థం? వంటి అంశాలపై అవగాహన వస్తుంది. కొన్నిసార్లు ఔషధ నియంత్రణ సంస్థలు మరింత భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కోరతాయి. కానీ.. కరోనా లాంటి మహమ్మారులు విలయం సృష్టిస్తున్న సందర్భాల్లో ఔషధ నియంత్రణ సంస్థలు ట్రయల్స్‌ను వేగంగా చేయడానికి అనుమతిస్తాయి. వాటిని వేగవంతమైన పరీక్షలు(యాక్సిలరేటెడ్‌ ట్రయల్స్‌)గా వ్యవహరిస్తారు. మొదటి దశలో వాక్సిన్‌ ఎంతవరకూ సురక్షితం అనే అంశంపై, రెండో దశలో ఎంత డోసేజ్‌ ఇవ్వాలి అనే అంశంపై దృష్టి సారిస్తారు.


అత్యవసర సమయాల్లో..

ఫేజ్‌ 1: 50-100 మందిపై పరీక్షలు..

నాలుగు నెలల సమయం 


ఫేజ్‌ 2: 500-1000 మందిపై పరీక్షలు..

4 నెలల సమయం


అత్యవసర సందర్భాల్లో ఈ రెండు దశలనూ సమాంతరంగా సాగిస్తారు. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పరీక్షలు ఇలాగే సాగుతున్నాయి. యాక్సిలరేటెడ్‌ ట్రయల్స్‌ మూడో దశలో భాగంగా వ్యాక్సిన్‌ సమర్థతను వేర్వేరు జన్యుసమూహాలపై భారీ స్థాయిలో పరీక్షలు (మాస్‌ ట్రయల్స్‌) నిర్వహిస్తారు. 3 దశలూ పూర్తయ్యాక ఫలితాలను నియంత్రణ సంస్థకు సమర్పించేందుకు 6 నెలలు పడుతుంది.

Updated Date - 2020-07-03T14:11:55+05:30 IST