టీకా నిల్వలు ప్రతి పీహెచ్‌సీలో

ABN , First Publish Date - 2021-01-11T07:12:40+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ (పీహెచ్‌సీ) కొవిడ్‌ టీకాల నిల్వల కోసం వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న 850 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్‌

టీకా నిల్వలు ప్రతి పీహెచ్‌సీలో

రాష్ట్రంలో 850 చోట్ల వ్యాక్సిన్‌ నిల్వ

జనవరి 18 నుంచి 1200 కేంద్రాల్లో 

1400 సెషన్స్‌ టీకా కార్యక్రమం

ఒక్కో సెషన్‌లో 100 మందికి టీకా 

1200 కేంద్రాల్లో 170 ప్రైవేటువి

నేడు పుణె నుంచి 300 టీకా ట్రక్కులు 

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ 

కొవిడ్‌ టీకా పంపిణీపై కార్యాచరణ

17న పల్స్‌ పోలియో వాయిదా

అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమాచారం

కొవిడ్‌ టీకా నేపథ్యంలో నిర్ణయం

గాంధీ, నార్సింగ్‌ రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ సిబ్బందితో ముచ్చటించనున్న ప్రధాని


హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ (పీహెచ్‌సీ) కొవిడ్‌ టీకాల నిల్వల కోసం వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న 850 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్‌ (ఐఎల్‌ఆర్‌)లలో టీకాలను నిల్వ చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. టీకాలు తొలుత హైదరాబాద్‌ కోఠీలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడి కోల్డ్‌ స్టోరేజ్‌లో వాటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాల మీదుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాటిని పంపుతామని వైద్య వర్గాలు వెల్లడించాయి. అలాగే కొన్ని కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రాల్లోనూ టీకా నిల్వలను ఉంచనున్నారు.


జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో టీకా స్టోరేజ్‌ ఉండదని వైద్య వర్గాలు వెల్లడించాయి. టీకాలు చేరుకున్నాక.. జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకా కార్యక్రమం 139 కేంద్రాల్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. అందులో 40 ప్రైవేటు ఆస్పత్రులు కాగా, 99 ప్రభుత్వ ఆస్పత్రులు. హైదరాబాద్‌లో ఆరు ప్రైవేటు, ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మేడ్చల్‌ జిల్లాల్లో 8 ప్రైవేటు, 3 ప్రభుత్వ.. రంగారెడ్డిలో 5 ప్రైవేటు, 4 ప్రభుత్వ కేంద్రాల్లో తొలిరోజు టీకా వేయనున్నారు. జగిత్యాల, జనగాం జల్లాల్లో కేవలం రెండేసి కేంద్రాల్లోనే తొలి రోజు వ్యాక్సినేషన్‌ ఉండనుంది. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో 1400 సెషన్స్‌లో టీకాలివ్వనున్నారు. ఈ 1200 కేంద్రాల్లో 170 సెంటర్స్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. వందమందికి మించి వైద్య సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 100లోపు వైద్య సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల స్టాఫ్‌ మాత్రం స్థానికంగా ఉన్న ప్రభుత్వ కేంద్రాలకు వచ్చి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక రోజుకు ఒక సెషన్‌లో 100 మందికి టీకాలిస్తారు. రెండు వారాల్లో వైద్య సిబ్బంది అందరికీ టీకాల కార్యక్రమం పూర్తి చేస్తామని, వారానికి కేవలం నాలుగు రోజులే వ్యాక్సినేషన్‌ ఉంటుంని వైద్య వర్గాలు వెల్లడించాయి.


ప్రధాని మోదీతో..

కొవిడ్‌ టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా.. గాంధీ ఆస్పత్రితో పాటు నార్సింగ్‌ రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్య సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడనున్నారు. అందుకోసం వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తోంది. ప్రధాని మాటలను అందరూ వినేలా ఇతర చోట్ల టీవీలను వైద్య శాఖ ఏర్పాటు చేస్తోంది.


నేటి సాయంత్రం నుంచే సరఫరా!

పుణె, జనవరి 10: ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమంలో అత్యంత కీలకమైన టీకాల సరఫరా సోమవారం సాయంత్రం (జనవరి 11) లేదా మంగళవారం (జనవరి 12) ఉదయం నుంచి ప్రారంభం కానుంది. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌ఐఐ) నుంచి టీకాల రవాణా ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎస్‌ఐఐ కొత్త ప్లాంటు ఉన్న మంజరి ప్రాంతం నుంచి 300 టీకా ట్రక్కులు బయల్దేరుతాయని ఆ వర్గాలు వివరించాయి. అన్ని ట్రక్కులకూ జీపీఎస్‌ అమర్చినట్టు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా మరో 500 ట్రక్కులను కూడా సిద్ధం చేస్తున్నట్టు  తెలిపాయి. 

Updated Date - 2021-01-11T07:12:40+05:30 IST