ఏమిటీ..కాలక్షేపం?

ABN , First Publish Date - 2021-04-11T05:50:47+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో యంత్రాంగం తగిన ప్రణాళిక రూపొందించలేదా? వ్యాక్సిన్లు అందించడంలో విఫలమయ్యారా? దిగువ స్థాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేయలేకపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శనివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో లోపాలు వెలుగుచూశాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలిచే పారిశుధ్య కార్మికులు, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉ

ఏమిటీ..కాలక్షేపం?

ఏమిటీ..కాలక్షేపం?

-ప్రణాళికా లోపం!

-ప్రత్యేక డ్రైవ్‌లోనూ వ్యాక్సిన్‌ కోరత

- అనేక మండలాలకు అందని టీకాలు

-ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు

- రోజంతా తప్పని పడిగాపులు 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో యంత్రాంగం తగిన ప్రణాళిక రూపొందించలేదా? వ్యాక్సిన్లు అందించడంలో విఫలమయ్యారా? దిగువ స్థాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేయలేకపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శనివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో లోపాలు వెలుగుచూశాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలిచే పారిశుధ్య కార్మికులు, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి టీకాలు వేయాలని సంకల్పించారు. ఇందుకుగాను ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. కానీ గజపతినగరం, రామభద్రపురం, బాడంగి, ఎల్‌.కోట, ఎస్‌.కోట తదితర మండలాలకు సరిపడా వ్యాక్సిన్లు అందించలేకపోయారు. శుక్రవారం శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో టీకా అందించలేకపోయారు. శనివారం వంద మందికి మాత్రమే అందించగలిగారు. 


పెరుగుతున్న కేసులు

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా పదుల సంఖ్యలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఏకంగా 97 కేసులు నమోదయ్యాయి. రెండో దశలో భాగంగా కేసులు పెరుగుతుండడంతో జిల్లా యంత్రాంగంలో కలవరపాటు ప్రారంభమైంది. పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా కేసుల నియంత్రణ సాధ్యమని భావిస్తోంది. కొవిడ్‌ టీకాలు వేయడం ద్వారానే అడ్డుకట్ట వేయగలమని... వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అయితే సరిపడినంతగా టీకా నిల్వలు లేకపోవడం కలవరపరుస్తోంది. అదీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అందకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. గత రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. దీన్ని చూసి సామాన్య జనం తమకు టీకా అందుతుందో...లేదోనని కలవరపడుతున్నారు. ఇప్పటివరకూ 1.8 లక్షల మందికి టీకా వేశారు. 27 వేల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు విజయవంతంగా పూర్తిచేసి..సాధారణ జనాలకు టీకా అందించాలని ముందుకు సాగుతున్నారు. గతంలో కంటే వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన పెరిగింది. ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకొస్తున్నారు. కొవిడ్‌ మొదటి వేవ్‌ తరువాత కొన్నాళ్లుగా జిల్లా గ్రీన్‌ జోన్‌గా ఉంది. కానీ మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 412.  58 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. 


సర్వేకు ఏర్పాట్లు

 కరోనా టీకా పనిచేస్తున్న తీరు తెన్నులను పరిశీలించేందుకు సిరో సర్వెలెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య శాఖ సన్నద్ధవుతోంది. వైరస్‌ ప్రబలినా.. ప్రత్యక్షంగా ప్రభావం చూపకుండా నయమైన పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా సిరో సర్వెలెన్స్‌ సర్వే నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17 వరకూ మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రక్రియ చేపట్టనున్నారు. టీకా వేయించుకున్న వారు... వేయించుకోని వారి నుంచి వేర్వేరుగా రక్తనమూనాలు సేకరిస్తారు. ఒక్కొక్కరి నుంచి 5 ఎమ్‌ఎల్‌ రక్తాన్ని సేకరించి ప్రత్యేకంగా భద్రపరుస్తారు. వీటిని చెన్నైలోని ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ సిరో సర్వేలెన్స్‌ పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్టులను జిల్లాకు పంపిస్తారు. దీని ద్వారా టీకా వేయించుకున్న వారిలో యాంటీ బాడీలు ఏవిధంగా వృద్ధి చెందుతున్నది అధ్యయనం చేస్తారు.



Updated Date - 2021-04-11T05:50:47+05:30 IST