టీకా సక్సెస్‌

ABN , First Publish Date - 2021-01-17T05:51:34+05:30 IST

కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్‌ వేశారు. మొత్తం 23 కేంద్రాల్లో తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రశాంతంగా ముగిసింది.

టీకా సక్సెస్‌
వ్యాక్సినేషన్‌ విజయవంతంతో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ విజయకేతనం

  •  ఉమ్మడి జిల్లాలో తొలిరోజుసజావుగా సాగిన వ్యాక్సిన్‌ ప్రక్రియ
  • రంగారెడ్డి జిల్లాలో వేయాల్సిన టీకాలు 270..       వేసినవి 235 
  • మొయినాబాద్‌, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వ్యాక్సినేషన్‌
  • వికారాబాద్‌ జిల్లాలో 90 మందికి కొవిషీల్డ్‌ టీకా
  • మేడ్చల్‌ జిల్లాలో వేయాల్సిన టీకాలు 
  • 330 మందికి..  వేసినవి 296

కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్‌ వేశారు.  మొత్తం 23 కేంద్రాల్లో  తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా సజావుగా  కొనసాగింది. 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రశాంతంగా ముగిసింది. శనివారం 9 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 270 మందికి టీకా వేయాల్సి ఉండగా 235 మందికి వేశారు. మిగతా 35 మంది వివిధ కారణాలతో టీకా వేయించుకోలేదు. నార్సింగి పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. అక్కడ మొదటి టీకాను ఎఎన్‌ఎం జయమ్మకు వేశారు. కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్‌, హమీద్‌పటేల్‌ డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ ఝూన్సీ, జిల్లా మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సృజన, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథతో కలిసి ప్రారంభించారు. అక్కడ డాక్టర్‌ నాగరాజుకు తొలి టీకా వేశారు. షాద్‌నగర్‌ పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ కొందుటి నరేందర్‌ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. మొయినాబాద్‌ పీహెచ్‌సీలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమనగల్లు పీహెచ్‌సీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మైలార్‌దేవ్‌పల్లి పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను అదనపుజిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుభా్‌షచంద్రబోస్‌,  జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ప్రారంభించారు. తొలి టీకాను హెల్త్‌ సూపర్‌ వైజర్‌ కె.వెంకటరమణకు వేశారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న ప్రారంభించగా జేసీ హరీష్‌ సందర్శించారు. అక్కడ హెడ్‌నర్స్‌ మస్తాన్‌బీకి తొలిటీకా వేశారు. హఫీజ్‌పేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేటర్‌ పూజిత జగదీ్‌షగౌడ్‌ ప్రారంభించారు. ఇక్కడ తొలి టీకాను హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సునీతకు వేశారు. 

వ్యక్తిగత కారణాలతో..

ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీలో 30మందికి టీకా వేయాల్సి ఉండగా 23మందికి వేశారు. మిగిలిన వారిలో ఇద్దరు అందుబాటులో లేరు. మరో ముగ్గురు అనారోగ్య కారణాల వల్ల వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. మరో ఐదుగురు అందుబాటులో ఉన్నప్పటికీ టీకాకు హాజరు కాలేదు. ఆమనగల్లు పీహెచ్‌సీలో 30మందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలవల్ల  10మంది రాలేదు. షాద్‌నగర్‌ పీహెచ్‌సీలో 30 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. కానీ.. ఈరోజు వ్యాక్సినేషన్‌ చేయించుకోవాల్సిన ఆరుగురుఅందుబాటులో లేక పోవడంతో రేపు వేయించుకోవాల్సిన హెల్త్‌కేర్‌ వర్క ర్లు, అంగన్‌వాడీటీచర్లకు టీకా వేశారు. మైౖలార్‌దేవ్‌పల్లి పీహెచ్‌సీలో 30 మందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉండగా 23 మందికి టీకా చేశారు. ఆనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో మిగతా ఏడుగురు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నారు. హఫీజ్‌పేట్‌ పీహెచ్‌సీలో 30 మందికి  వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉండగా 19 మందికి వేశారు. మిగతా 11 మందిలో ఒకరు బాలింత, మరొకరికి జ్వరం, మిగతా వారు వ్యక్తిగత కారణాలచే వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. 

296 మందికి వ్యాక్సినేషన్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరిజిల్లాలో కరోనా టీకా పంపిణీ ప్రశాంతంగా ముగిసింది.  కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు శామీర్‌పేట్‌, షాపూర్‌నగర్‌ పీహెచ్‌సీల్లో టీకా ను ప్రారంభించారు. ఘట్‌కేసర్‌ మండలం నారపల్లి పీహెచ్‌సీలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి,  వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో 330 మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం 295 మంది టీకా వేసుకున్నారు. 35 మంది గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల వల్ల వీరంతా టీకా తీసుకోలేదని వైద్యులు వెల్లడించారు. టీకా ఇచ్చిన అరగంట వరకు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కూర్చోబెట్టారు. జిల్లాలో సైడ్‌ ఎఫెక్ట్‌ వచ్చిన సంఘటనలు ఏమీ లేవు. టీకా వేసుకున్న వారికి ఇంటికెళ్లాక కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చోటు చేసుకోలేదు. అన్ని కేంద్రాల్లోనూ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

 అంతా సవ్యమే

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు  టీకా వేసుకున్న వారిలో ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా సజావుగా కొనసాగింది. మొత్తం  90 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, పరిగి సీహెచ్‌సీలో ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి, తాండూరులో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే, పరిగి పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసు పరిశీలించారు.              తాం డూరు జిల్లా ఆసుపత్రిలో గర్భిణి, పాలిచ్చే తల్లులు వివిధ కారణాలతో ఐదుగురు హెల్త్‌కేర్‌ వర్కర్లు తాము వ్యాక్సినేషన్‌ చేసుకోలేమని రాతపూర్వకంగా రాసివ్వడంతో వారి స్థానంలో ఆ తరువాత స్థానాల్లో ఉన్న వారికి టీకాలు వేశారు. జిల్లాలోని వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎవరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు.  తమ కంటే ముందు టీకా వేసుకున్న వారికి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో మిగతా సిబ్బంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు సంతోషంతో ముందుకు రావడం విశేషం. కాగా, ప్రధాన మంత్రి ప్రసంగం ముగియగానే వ్యాక్సినేషన్‌ ప్రారంభించాల్సి ఉండగా, ముఖ్యఅతిథుల రాక ఆలస్యం కావడంతో జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యమైంది. ఉదయం11 గంటలకు ప్రారంభం కావాల్సిన వ్యాక్సినేషన్‌ అరగంట నుంచి గంట వరకు ఆల స్యం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యాదయ్యకు తొలిటీకా ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ గదిలో యాదయ్యకు వైద్య సిబ్బంది టీకా వేసేందుకు సన్నద్ధమవుతుండగా, డాక్టరైన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆయనకు వ్యాక్సినేషన్‌ చేశారు. 

Updated Date - 2021-01-17T05:51:34+05:30 IST