తొలి రోజు 126 మందికి టీకా

ABN , First Publish Date - 2021-03-02T05:18:04+05:30 IST

తొలి రోజు 126 మందికి టీకా

తొలి రోజు 126 మందికి టీకా
టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నభద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

ఇరు జిల్లాలో ప్రారంభమైన కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌

ఖమ్మంలో మూడు కేంద్రాల్లో 37మందికి

కొత్తగూడెంలో ఒకే కేంద్రంలో 89 మందికి వ్యాక్సిన్‌ 

ఖమ్మం సంక్షేమవిభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 1: కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో మూడు, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కేంద్రం ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా వైద్యఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కరోనా హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ విభాగంలో రాష్ట్రంలోనే ముందు వరసలో నిలిచిన భద్రాద్రి జిల్లా కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌లోనూ తొలిరోజు సత్తాచాటింది.భద్రాద్రి జిల్లాలో ఒకే కేంద్రంలో 89మంది వరకు వ్యాక్సినేషన్‌ తీసుకొని భేష్‌ అనిపించుకున్నారు. కమ్యూనిటీ వ్యాక్సినేషన్‌ మొదటి రోజు భద్రాద్రి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిందని వైద్యశాఖలో చర్చ జరిగింది. సోమవారం సాయంత్రం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఉచిత వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆ జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. 

ఇరు జిల్లాలో 126మందికి వ్యాక్సిన్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిటీ కరోనా వ్యాక్సినేషన్‌కు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఖమ్మం జిల్లాలో మూడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే కేంద్రం అధికారికంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మమత జనరల్‌ ఆసుపత్రి, శ్రీరక్ష ఆసుపత్రిలో ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 126మంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో 60ఏళ్లు పైబడినవారు 80మంది కాగా 45ఏళ్ల పైబడిన వారు 46మంది ఉన్నారు. ఎంతో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో మాత్రం 45ఏళ్లు పైబడిన వారు ఒకే ఒక్కరు టీకా తీసుకోవటం చర్చనీయాంశమైంది.

వ్యాక్సినేషన్‌ కేంద్రం తీసుకున్నవారి సంఖ్య

కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల 89

ఖమ్మం జిల్లా ఆసుపత్రి 07

మమత జనరల్‌ ఆసుపత్రి 20

శ్రీరక్ష హాస్పిటల్‌ 10

Updated Date - 2021-03-02T05:18:04+05:30 IST