తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ABN , First Publish Date - 2022-01-13T12:20:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా విజృంభణతో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు. కోవిడ్ ఉధృతి దృష్ట్యా పలు ఆలయాల్లో వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి.


తిరుమలలో ..

తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ రితురాజ్‌..ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌ యాదవ్‌, వెల్లంపల్లి, బాలినేని..అవంతి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, రంగనాథరాజు, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్‌..ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, సీఎం రమేష్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప తెలంగాణ మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణలతో  తిరుమలకొండలు మార్మోగుతున్నాయి. 


 భద్రాద్రిలో.. 

భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు వారాల నగలతో సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఉత్తరద్వార దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. 


ధర్మపురిలో..

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. యోగ, ఉగ్ర నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామికి మహా క్షీరాభిషేకం చేశారు. స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దర్శించుకున్నారు. 


 శ్రీశైలంలో..

కర్నూలు: శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనమిస్తుంది. ఆలయ మాడవీధుల్లో రావణ వాహనంపై స్వామిఅమ్మవార్ల ఊరేగింపు సాగుతుంది. ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.


సింహాచలంలో..

విశాఖ: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తొలిపూజకు అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు హాజరుకాలేదు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. 

Updated Date - 2022-01-13T12:20:05+05:30 IST