Abn logo
Feb 14 2021 @ 03:17AM

ప్రేమా.. జిందాబాద్‌!

ప్రేమికుల రోజు స్పెషల్


రెండు మనసులు జంట పక్షుల్లా.... ఒక్కటిగా సాగే అందమైన ప్రయాణం ప్రేమ. అందుకే ప్రేమ కథలు ఎప్పుడూ తాజా పరిమళంలా మనసును హత్తుకుంటూనే ఉంటాయి. ధనిక, పేద, కులం, మతం అడ్డుగోడలను చెరిపేస్తూ ప్రేమకు పట్టం కట్టిన సినిమాలు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాయి. ఇప్పటికీ ‘ప్రేమా జిందాబాద్‌’ హిట్‌ ఫార్ములాతో ప్రతి ఏడాది కొత్త ప్రేమకథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రేమ, విరహం వంటి కథాంశాలతో అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఒకప్పటి, ఇప్పటి కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం...


మొఘల్‌ ఎ అజామ్

‌దర్శకుడు: కె.ఆసిఫ్‌

విడుదలైన సంవత్సరం: 1960


ప్రేమ కథాంశంతో తెరకెక్కిన మొఘల్‌ ఎ అజామ్‌ హిందీ సినిమా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం లిఖించింది. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కుమారుడు సలీం, ఆస్థాన నర్తకి అనార్కలీతో ప్రేమలో పడడం, వారి ప్రేమను అక్బర్‌ తిరస్కరించడం చరిత్రలో చదువుకున్నదే. ఈ కథను వెండితెర మీద అత్యద్భుతంగా ఆవిష్కరించింది దిలీప్‌ కుమార్‌, మధుబాల జంట. ఆస్థాన నర్తకి అయిన అనార్కలీ చాలా అందగత్తె. ఆమె అందానికి దాసోహమైన సలీం ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వీరి ప్రేమ విషయం ఆనోటా ఈనోటా అక్బర్‌ చెవిన పడుతుంది. వీరి ప్రేమకు అంగీకరించని అక్బర్‌ అనార్కలిని జైలులో బంధిస్తాడు. తన ప్రేయసిని బంధించారని తెలుసుకున్న సలీం తండ్రి మీద యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో సలీంని ఓడించి మరణశిక్ష విధిస్తాడు అక్బర్‌.


ఆ శిక్ష  రద్దు చేయాలంటే సలీం బదులు అనార్కలి మరణించాలని షరతు పెడతాడు. సలీం కోసం తన ప్రాణాలు ఇచ్చేందుకు అనార్కలీ సిద్ధపడుతుంది. అయితే తనకు మరణశిక్ష విధించే ముందు కొంత సమయమైనా సలీం భార్యగా ఉండేందుకు అనుమతించాలని కోరుతుంది.  చివరకు అనార్కలి తల్లి విజ్ఞప్తి మేరకు అక్బర్‌ తన గూఢాచారుల సాయంతో తల్లీకూతుళ్లను రహస్య ప్రదేశానికి పంపిస్తాడు. అనార్కలి బతికి ఉందనే విషయం సలీంకు ఎప్పటికీ తెలియనివ్వడు. ప్రేమ, త్యాగం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేమ కథా చిత్రాల్లో మైలురాయిగా నిలిచింది. సంగీతం, కాస్ట్యూమ్స్‌, సెట్స్‌ పరంగా ఒక అద్భుత దృశ్యమాలిక అయిన మొఘల్‌ ఎ అజామ్‌ ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. 


ప్రేమదేశం

దర్శకుడు: కదీర్‌

విడుదలైన సంవత్సరం: 1996


కాలేజీ రోజుల్లో ముగ్గురి ప్రేమికుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రెండు కాలేజీల విద్యార్థుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కార్తీక్‌కి ఎవరూ ఉండరు. తమ కాలేజీ ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌ తనే. చక్కగా కవితలు రాస్తాడు, తన కలల సుందరి గురించి ఊహల్లో విహరిస్తూ ఉంటాడు. అరుణ్‌ది ధనవంతుల కుటుంబం. అతడు కూడా వాళ్ల కాలేజీ ఫుట్‌బాల్‌ జట్టు నాయకుడు. ఒకసారి కాలేజీ గొడవల్లో అరుణ్‌, కార్తీక్‌ ప్రాణాలు కాపాడతాడు. అందుకు తన వంతు సాయంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అరుణ్‌ జట్టు గెలిచేందుకు కారణమవుతాడు. ఆ తరువాత ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు.


దివ్య అనే అమ్మాయి వీరి జీవితంలోకి వస్తుంది. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు దివ్యను పిచ్చిగా ప్రేమిస్తారు. చివరకు ఇద్దరూ ఒక అమ్మాయినే ప్రేమించడం తెలిసి, కార్తిక్‌, అరుణ్‌ గొడవపడతారు. స్నేహితులు కాస్త శత్రువులు అవుతారు. తమలో ఎవరో ఒకరిని దివ్య పెళ్లి చేసుకుంటుందని అనుకుంటారు ఇద్దరూ. కానీ చివర్లో దివ్య తనకు ఇద్దరూ ఇష్టమే కానీ, వాళ్ల స్నేహం చెడకూడదనే ఆలోచనతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అప్పటి నుంచి దివ్యతో కార్తిక్‌, అరుణ్‌ ఫ్రెండ్స్‌గా ఉంటారు. స్నేహితులుగా, విఫల ప్రేమికులుగా వినీత్‌, అబ్బాస్‌ నటన ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే దివ్యగా టబు అభినయం, పాటలు, సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. తమిళం, తెలుగు రెండు భాషల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది.


దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే

దర్శకుడు: ఆదిత్యా చోప్రా

విడుదలైన సంవత్సరం: 1995


బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన ఈ సినిమా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. రాజ్‌ (షారుక్‌ ఖాన్‌), సిమ్రన్‌ (కాజోల్‌) ఇద్దరూ లండన్‌లో నివసిస్తుంటారు. స్నేహితులతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్లిన రాజ్‌, సిమ్రన్‌ ప్రేమలో పడతారు. అయితే ఈ విషయం తెలిసిన సిమ్రన్‌ తండ్రి తన స్నేహితుడి కుమారుడితో ఆమె వివాహం జరిపించాలనుకుంటాడు. మరుసటి రోజే కుటుంబంతో సహా ఇండియాకు ప్రయాణమవుతారు. కానీ ముఖ పరిచయం కూడా లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సిమ్రన్‌కు ఇష్టం ఉండదు.ఇండియా వచ్చిన రాజ్‌ సిమ్రన్‌ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో సిమ్రన్‌  యూరప్‌లో ప్రేమించిన అబ్బాయే రాజ్‌ అని అందరికీ తెలుస్తుంది. తన కూతరును రాజ్‌ కన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని అర్థం చేసుకున్న సిమ్రన్‌ తండ్రి ఇద్దరి ప్రేమను అంగీకరిస్తాడు. కుటుంబ బంధాలను, అందమైన ప్రేమ కథను చాలా చక్కగా ఆవిష్కరించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసింది.


ప్రేమమ్‌

దర్శకుడు: అల్‌ఫొన్సే పుథ్రేన్‌

విడుదలైన సంవత్సరం: 2015

నటీనటులు: నివిన్‌ పౌలీ, అనుపమా పరమేశ్వరన్‌, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్‌.


ఒకరి జీవితంలో మూడు దశల్లోని ప్రేమ కథలను ఆద్యంతం అసక్తికరంగా చెప్పిన చిత్రం ప్రేమమ్‌. జార్జ్‌ డేవిడ్‌ అనే కుర్రాడు మేరీ అనే స్కూలు అమ్మాయిని ఇష్టపడతాడు. తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ వాళ్ల నాన్న భయంతో వెనకడుగు వేస్తాడు. అయితే మేరీ మరో అబ్బాయిని ప్రేమిస్తుందనే విషయం తెలిసి జార్జ్‌ ఎంతో బాధపడతాడు. అంతేకాదు తమ ఇంట్లో తెలియకుండా ఆ అబ్బాయితో కలిసేందుకు సాయం చేయాల్సిందిగా మేరీ జార్డ్‌ను అడగుతుంది. అక్కడితో ఇక చదువు మీద దృష్టి పెడతాడు జార్జ్‌. అయిదేళ్ల తరువాత డిగ్రీలో చేరిన  జార్జ్‌ కొత్తగా వచ్చిన మలర్‌ అనే టీచర్‌ మీద మనసు పారేసుకుంటాడు. ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకొని కొన్నాళ్లకు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సెలవుల్లో కొడైకెనాల్‌లోని తమ ఇంటికి వెళ్లిన మలర్‌కు ఒక ప్రమాదంలో కాలు విరుగుతుంది. దాంతో కాలేజీలో ఉద్యోగం మానేస్తుంది. ఈ విషయం తెలియగానే జార్జ్‌ స్నేహితులతో కలిసి మలర్‌ను చూసేందుకు కొడైకెనాల్‌ వెళతాడు. ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల మలర్‌ గతం మర్చిపోతుంది. జార్జ్‌ను కూడా గుర్తుపట్టదు. కొన్ని రోజులకు తన కజిన్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఇక మూడో ప్రేమకథ జార్జ్‌ కేఫ్‌ మొదలెట్టిన తర్వాత మొదలవుతుంది.


ఒకరోజు కేఫ్‌కి వచ్చిన సెలిన్‌ అనే అమ్మాయిని చూడగానే జార్జ్‌ ఆమె స్కూల్‌ డేస్‌లో మేరీ స్నేహితురాలని అర్థమవుతుంది. ఆమెకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ అప్పటికే సెలిన్‌కు వేరొకరితో పెళ్లి నిశ్చయమైతుంది. డ్రగ్స్‌ అలవాటు ఉన్న అతడు సెలిన్‌ను అవమానపరుస్తూ మాట్లాడడం నచ్చని జార్జ్‌ కోపంతో అతడి మీద చేయిచేసుకుంటాడు. దాంతో ఆ పెళ్లి ఆగిపోతుంది. చివరకు సెలిన్‌ జార్జ్‌ పెళ్లి చేసుకుంటారు. తెలుగులో నాగచైతన్య, శ్రుతిహాసన్‌ తమ నటనతో మెప్పించారు.


రోజా

దర్శకుడు: మణిరత్నం

విడుదలైన సంవత్సరం: 1992

తీవ్రవాదుల చేతుల్లో బంధీగా ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు ఒక భార్య ఎంతగా ప్రయత్నించిందో రోజా సినిమాలో చూడొచ్చు. శ్రీనగర్‌లో కశ్మిర్‌కు చెందిన ఒక తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. భారత సైన్యంలోని రీసెర్చ్‌ అనాలసిస్‌ విభాగంలో పనిచేసే రిషికుమార్‌తో రోజా అక్కకు పెళ్లి చేయాలనుకుంటారు పెద్దలు. అయితే అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్న ఆమె ‘అందరి ముందు నేను నచ్చలేదని చెప్పండి’ అని రిషికి చెబుతుంది. దాంతో  రోజాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రిషి. ఈ విషయం తెలియని రోజా రిషిపై కోపంగా ఉంటుంది. పెళ్లి తరువాత ఇద్దరూ కశ్మిర్‌లో కాపురం పెడతారు. కొన్ని రోజులకు తన అక్క చెబితే గానీ రిషి ఆరోజు ఎందుకలా చేశాడో రోజాకు తెలియదు. అప్పటి నుంచి ఆమె రిషిపై ప్రేమ పెంచుకుంటుంది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం రిషిని తీవ్రవాదులు కిడ్నాప్‌ చేయడంతో కొత్త మలుపు తిరుగుతుంది. రోజా రాజకీయనాయకులు, సైన్యంలోని పై అధికారులందరినీ కలిసి తన భర్తను సురక్షితంగా విడిపించాలని ప్రాధేయపడుతుంది. చివరకు ఉగ్రవాదుల నుంచి తప్పించుకొని రిషి, రోజాను కలుసుకుంటాడు. రోజాగా మధుబాల, రిషిగా అరవింద స్వామి నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.


మద్రాస పట్టణం

దర్శకుడు: ఎ.ఎల్‌.విజయ్‌

విడుదలైన సంవత్సరం: 2010

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలం నాటి ప్రేమ కథ. అమీ (అమీ జాక్సన్‌) మద్రాస్‌ ప్రెసిడెన్సీ గవర్నర్‌ కూతురు. బ్రిటీష్‌ వాళ్లు ఇండియాను విడిచి వెళుతున్న సమయంలో పరిథి (ఆర్య), తనకు ఇచ్చిన తాళిబొట్టును అతడికి తిరిగి ఇవ్వాలనుకుంటుంది. పరిథి దుస్తులు ఉతికే కుటుంబానికి చెందినవాడు. తమ స్థలంలో బ్రిటీష్‌ అధికారులు గోల్ఫ్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నించడాన్ని అతడు దైర్యంగా వ్యతిరేకిస్తాడు. ఈ క్రమంలోనే ఆమిని పెళ్లి చేసుకోబోయే అధికారితో తలపడి గెలుస్తాడు. అలా అమీ, పరిథి మధ్యలో ప్రేమ చిగురిస్తుంది. అదేసమయంలో భారత దేశానికి స్వాతంత్రం వస్తుంది. అమీ, పరిథి కలిసి ఉండాలనుకుంటారు. బ్రిటీష్‌ సైన్యం కంటపడకుండా మద్రాస్‌ రైల్వే స్టేషన్‌లోని క్లాక్‌టవర్‌లో దాక్కుంటారు. కానీ సైనికులు వీరిని కనిపెడతారు. అలా ఇద్దరూ విడిపోతారు. తిరిగి మద్రాస్‌ వచ్చిన అమీ పరిథి సమాధి సాక్షిగా అతడిచ్చిన తాళి ఇక తనదేనని అనుకుంటుంది.