దేవినేని ఉమా కోరుకున్న చోటుకు నేను, కొడాలి నాని వస్తాం: వంశీ

ABN , First Publish Date - 2021-01-19T17:21:30+05:30 IST

గొల్లపూడి సెంటర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా..

దేవినేని ఉమా కోరుకున్న చోటుకు నేను, కొడాలి నాని వస్తాం: వంశీ

విజయవాడ: గొల్లపూడి సెంటర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు యత్నించగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చ జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని, ఏ టీవీ స్టూడియోలోనైనా చర్చలకు సిద్ధమని మంత్రి కొడాలి నాని అన్నారని, దేవినేని ఉమా ఏ స్టూడియోకి వచ్చినా తాను, మంత్రి వస్తామని.. ఏ ప్రభుత్వం ఏం చేసిందో దానిపై చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. చర్చకు వస్తే ఎవరు అవినీతికి పాల్పడింది.. అన్ని విషయాలు బయటకు వస్తాయని వంశీ వ్యాఖ్యానించారు.


సోమవారం మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. అయితే మంత్రి చేసిన విమర్శలకు కౌంటర్‌గా దేవినేని ఉమా సవాల్ విసిరారు. ‘దీక్ష చేపడతా దమ్ముంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ.. మంత్రి నాని ఎవరైనా సరే అడ్డుకోవాలి’ అని సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం దేవినేని ఉమా దీక్షకు పూనుకోవడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-01-19T17:21:30+05:30 IST