నిద్రా లేదు.. భోజనం లేదు!

ABN , First Publish Date - 2021-09-12T05:42:18+05:30 IST

‘రోజుల తరబడి సరైన భోజనం లేదు. కంటి నిండా నిద్రలేదు. చుట్టూ ప్రమాదకర రసాయనాలు వెలువడడంతో విపరీతమైన దుర్వాసన. అనారోగ్యంతో ఒక్కొక్కరూ మంచం పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 30 మంది వరకూ మృత్యువాత పడ్డారు’... ఇదీ బెహ్రయిన్‌లో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశా వాసులు పడుతున్న వ్యధ. దేశంకాని దేశంలో తాము పడుతున్న బాధలను కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు తల్లడిల్లిపోతున్నారు.

నిద్రా లేదు.. భోజనం లేదు!
బెహ్రయిన్‌లో పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు

బెహ్రయిన్‌లో శ్రీకాకుళం, విశాఖ, ఒడిశా వాసుల విలవిల

ప్రమాదకర స్థితిలో నాలుగు వేల మందితో పనులు

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు

నెల రోజుల్లో 30 మంది మృత్యువాత?

ప్రశ్నిస్తున్న వారిపై పరిశ్రమ యాజమాన్యం దాడి

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 11: ‘రోజుల తరబడి సరైన భోజనం లేదు. కంటి నిండా నిద్రలేదు. చుట్టూ ప్రమాదకర రసాయనాలు వెలువడడంతో విపరీతమైన దుర్వాసన. అనారోగ్యంతో ఒక్కొక్కరూ మంచం పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 30 మంది వరకూ మృత్యువాత పడ్డారు’... ఇదీ బెహ్రయిన్‌లో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశా వాసులు పడుతున్న వ్యధ. దేశంకాని దేశంలో తాము పడుతున్న బాధలను కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. కొందరు బాధితులు నేరుగా విలేకరులకు ఫోన్‌చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమను రక్షించి క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు, కుటుంబసభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలతో ఒడిశాకు చెందిన దాదాపు నాలుగు వేల మంది బెహ్రయిన్‌లోని ‘ఎన్‌ఎస్‌హెచ్‌’ కంపెనీలో కొన్ని నెలల కిందట పనికి కుదిరారు. మంచి జీతం, ఓవర్‌ డ్యూటీ, భోజనం, ఇతరత్రా వసతులు కల్పిస్తామని వీరికి ఆశచూపారు. విశాఖ, ఒడిశా కేంద్రాలుగా నడిచే మణికంఠ, గలఫ్‌ఎప్‌, రెయిన్‌ బో, మెట్రిక్‌, జనార్దన, ప్రజ్ఞ తదితర ఏజెన్సీల ద్వారా లక్షల రూపాయలు చెల్లించి వీరు విధుల్లో చేరారు. అయితే ఏజెన్సీలు చెప్పినదానికి అక్కడున్న పరిస్థితులకు పొంతన లేదు. చుట్టూ ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. సరైన భోజనం అందించడం లేదు. విశ్రాంతి తీసుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వడం లేదు. సమీప పరిశ్రమల నుంచి రసాయనాలు, వ్యర్థాలు వస్తుండడంతో విపరీతమైన దుర్వాసన. దీంతో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. నెల రోజుల వ్యవధిలో 30 మంది మృత్యువాత పడినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేయలేమని చెబుతుంటే పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు దాడులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో చాలామంది బాధితులు ఆస్పత్రిపాలయ్యారు. ఇక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని వజ్రపుకొత్తూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీను అనే బాధితుడు వీడియో కాల్‌ చేసి విలేకరులకు వివరించాడు. బాధితులు సంబంధిత ఏజెన్సీలకు సంప్రదిస్తున్నా స్పందన లేకపోతోంది. విషయం తెలుసుకున్న నాటి నుంచి బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి తమవారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

Updated Date - 2021-09-12T05:42:18+05:30 IST