Advertisement
Advertisement
Abn logo
Advertisement

షమీకి అండగా కోహ్లీ.. పది నెలల కుమార్తె వామికపై అత్యాచారం తప్పదంటూ బెదిరింపులు

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాభవం తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై అభిమానులు విరుచుకుపడ్డారు. అతడు ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం వల్లే భారత్ ఓడిపోయిందంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.


దీనిని మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా ఖండించారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా సారథి కోహ్లీ కూడా షమీపై ఆన్‌లైన్ దాడిని ఖండించి అతడికి అండగా నిలిచాడు. షమీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశాడు. మతం పేరుతో దూషించడం చాలా నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

మతం పేరుతో దూషించేవాళ్లను చూస్తుంటే జాలి వేస్తోందని కోహ్లీ అన్నాడు. వెన్నెముక లేనివారే ఇలా మతాన్ని టార్గెట్ చేసుకుంటారని పేర్కొన్నాడు. దేశంపై షమీకి ఉన్న అంకితభావం ఏంటో అందరికీ తెలుసని, మరోమారు నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.


అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ దానికి మతాన్ని ఆపాదించడం మాత్రం సరైనది కాదని అన్నాడు. అసలు ఇలా చేయడాన్ని తాను ఎప్పుడు, ఎక్కడా చూడలేదన్నాడు. షమీ గురించి తెలియని వారే ఇలాంటివి చేస్తుంటారని, ఎవరెన్ని విమర్శలు చేసినా తమ సోదరభావాన్ని చెడగొట్టలేరని తేల్చి చెప్పాడు. షమీకి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పాడు. 


అయితే, షమీకి కోహ్లీ అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు ఈసారి కోహ్లీ-అనుష్కశర్మ 10 నెలల కుమార్తె వామికను టార్గెట్‌గా చేసుకున్నారు. చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ బెదిరింపు ట్వీట్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు. కోహ్లీని, అతడి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండించారు.


‘‘కోహ్లీ కుమార్తెకు వచ్చిన బెదిరింపులు నా దృష్టికీ వచ్చాయి. ఇది ఒక గేమ్ మాత్రమేనన్న విషయాన్ని ప్రజలు తొలుత అర్థం చేసుకోవాలి. తామందరం వేర్వేరు దేశాల తరపున ఆడుతున్నా అందరం ఒకటేనన్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను, అతడి కెప్టెన్సీని విమర్శించే హక్కు ఉంటుందని, కానీ అతడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే హక్కు ఎవరికీ లేదన్నాడు.


ఇలాంటి అనుభవమే కొన్ని రోజుల క్రితం షమీకి ఎదురైందని గుర్తు చేశాడు. గెలుపోటములు ఆటలో చాలా సహజమైన విషయమన్నాడు. కోహ్లీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తనను తీవ్రంగా బాధించిందని ఇంజిమామ్ తన యూట్యూబ్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఇది ఇండియా అని, ఇక్కడ అలాంటివి జరుగుతుంటాయని కొందరు కామెంట్ చేస్తే.. సహచరుడైన ముస్లింకు అండగా నిలబడినందుకే కోహ్లీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.


నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత కూడా టీమిండియాపై ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో భారత జట్టును లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం సిగ్గుచేటైన విషయమన్నాడు. ఇండియా ఎప్పటికే మంచి జట్టేనని కితాబిచ్చాడు. క్రికెటర్ల కుటుంబాలను టార్గెట్ చేయడం సహించరానిదన్నాడు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement