వామ్మో డెంగ్యూ

ABN , First Publish Date - 2021-09-17T06:29:46+05:30 IST

డెంగ్యూతో పాటు వైరల్‌ జ్వరాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను హడలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలతో సీజనల్‌ వ్యాధులకు ఊతమిచ్చినట్లుగా మారింది.

వామ్మో డెంగ్యూ
జ్వరాలతో అసుపత్రిలో చిన్నారులు

- 20 రోజుల్లో 16 మందికి నిర్ధారణ 

- జిల్లాలో అనేకమందికి లక్షణాలు

- భారీ వర్షాలతో సీజనల్‌ వ్యాధులకు ఊతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

డెంగ్యూతో పాటు వైరల్‌ జ్వరాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను హడలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలతో సీజనల్‌ వ్యాధులకు ఊతమిచ్చినట్లుగా మారింది. జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఏ ఇంటిలో చూసినా జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారే ఉన్నారు. విషజ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్‌కు తోడుగా డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. జిల్లాలో వైద్య అరోగ్య శాఖ గడిచిన 20 రోజుల్లో 16 మందికి డెంగ్యూ జ్వరం వచ్చినట్లు నిర్ధారించారు. జిల్లాలోని బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వేములవాడ రూరల్‌, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, మండలాల్లో డెంగ్యూ జ్వరాలు సోకిన వారిని గుర్తించారు. వీరితో పాటు జిల్లాలో అనేకమంది డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూతో పాటు వైరల్‌ జ్వరాలతో జిల్లా ప్రధాన అసుపత్రితో పాటు ప్రైవేటు అసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నా యి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

- అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ..

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో పాటు డెంగ్యూ జ్వరాలు నిర్ధారణ అవుతుండడంతో వైద్య అరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను నిర్వహిస్తూ మందులను అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందితో పాటు ఇతర అధికారులు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎడిస్‌ దోమకాటువల్ల డెంగ్యూ వ్యాధి వ్యాప్తిస్తుంది. ఈ రకం దోమలు మురుగునీటిలో ఉండవు. తాగిపడేసిన కొబ్బరి బొండాలో, పాతపడిన టైర్లలోని నిల్వ నీటిలో, పాడుబడిన కూలర్లు, ఇండ్లలోని ఖాళీ కుండీలు, డ్రంబులు తదితర ప్రాంతాల్లో ఉంటాయి. డెంగ్యూ జ్వరం, డెంగ్యూ హెమరేజ్‌, డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు కల్గించే వ్యాధి హఠాత్తుగా తీవ్ర జ్వరంతో వాంతులు, విరోచనాలు, వికారం నొప్పితో కూడిన కంటి కదలికలు, కీళ్ల నొప్పులతో వస్తుంది. లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకుంటే ప్రమాదం ఉండదని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  మరోవైపు ఏడో విడత ఫీవర్‌ సర్వేను కొనసాగిస్తున్నారు. ఏడో విడతలో 49,635 ఇళ్ల వద్దకు వెళ్లి జ్వరాలు, కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని 376 మందికి గుర్తించి చికిత్సలు అందించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి విడత సర్వేలో 3,789 మంది, రెండో విడత సర్వేలో 3,372 మంది, మూడో విడత సర్వేలో 1,710 మంది, నాలుగో విడత సర్వేలో 679 మందిని గుర్తించగా ఐదో విడత సర్వేలో 597 మందిని గుర్తించారు. ఆరో విడత సర్వేలో 762 మందిని గుర్తించారు. ఏడో విడత  సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 376 మంది జ్వర పీడితులను గుర్తించారు. వైద్య అరోగ్య శాఖ అవసరమైన చోట ప్రత్యేక క్యాంపులను కూడా నిర్వహించి సీజనల్‌ వ్యాధులు అరికట్టడానికి సంసిద్ధంగా ఉంది. 

Updated Date - 2021-09-17T06:29:46+05:30 IST